ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వింత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎండాకాలంలో వానలు దంచికొట్టగా… ఇప్పుడు వర్షాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఇలా కాలంతో సంబంధం లేకుండా వాతావరరణ పరిస్థితులు మారుతున్నాయి.
Weather Updates : ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులతో కాలాలు కూడా తారుమారు అవుతున్నాయి. ఓ కాలంలో ఉండాల్సిన వాతావరణ పరిస్థితులు మరోకాలంలో కనిపిస్తున్నాయి... వేసవిలో వర్షాకాలం మాదిరిగా వానలుపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి... దీంతో తొలకరి జల్లులు కురవాల్సిన సమయం. కానీ వర్షకాలం మొదలయ్యాక ఎండలు మండిపోతున్నాయి... కొన్నిచోట్ల నడి వేసవికాలంలో మాదిరిగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. అలాగే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వర్షాకాలంలో ఇవేం ఎండల్రా నాయనా అనుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో మండుటెండలు :
తెలుగు రాష్ట్రాల్లో ఇన్నిరోజులు వర్షాలు దంచికొట్టాయి.. తాజాగా వర్షాలు తగ్గి మళ్ళీ ఎండలు మొదలయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో రుతుపవనాలు వేగంగా కదిలి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసాయి... కానీ ఇప్పుడు వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీంతో రుతుపవనాల వేగం తగ్గి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి చల్లని వాతావరణం కాస్త వేడెక్కిపోతోంది.
గత రెండ్రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు పెరిగాయి. కొన్నిచోట్ల నడి వేసవిలో మాదిరిగా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్నమొన్న తిరుపతిలో 40 డిగ్రీలు, నెల్లూరులో 39, మచిలీపట్నంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలు తగ్గడంతో చాలాచోట్ల ఇలాగే ఎండలు పెరగడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
ఈ ఎండలకు ఉక్కపోత తోడయ్యింది. రాయసీమ, దక్షిణకోస్తా ప్రాంతాల్లో ఉక్కపోతతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఇదే పరిస్థితి మరో పదిరోజుల పాటు కొనసాగనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు కంగారు పెడుతున్నాయి. జూన్ 12 వరకు రుతుపవనాల ప్రభావం పెద్దగా ఉండదు.. దీంతో వర్షాలు కురిసే అవకాశం లేదు కాబట్టి ఎండలు, ఉక్కపోత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
జూన్ 12న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయట... ఇలా వాతావరణం అనుకూలంగా మారడంతో రుతుపవనాలు వేగం పుంజుకుంటాయని తెలిపారు. దీంతో వర్షాలు మళ్లీ జోరందకుంటాయి.. దీంతో ఎండలు, ఉక్కపోత నుండి ఉపశమనం లభిస్తుందట. అప్పటివరకు ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోవాల్సిందే.
ఆంధ్ర ప్రదేశ్ లో వానలు :
ఆంధ్ర ప్రదేశ్ లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.. కొన్నిప్రాంతాల్లో ఎండలు దంచికొడుతుంటే మరికొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోత పరిస్థితులుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం వర్షాలు కురుస్తుండటంతో చల్లని వాతావరణం ఉంది.
శ్రీకాకుళం విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లుకు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణ వాతావరణం :
తెలంగాణలో కూడా ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగానే విచిత్ర పరిస్థితులు ఉన్నాయి.. కొన్నిచోట్ల ఎండాకాలంలో మాదిరిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్నిచోట్ల వర్షాలు కురుస్తూ వాతావరణం చల్లగా ఉంటోంది. రాబోయే రెండుమూడు రోజులు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. హైదరాబాద్ లో గత కొన్నిరోజులుగా వర్షాలు దంచికొట్టగా ప్రస్తుతం వేడి, ఉక్కపోతతో ప్రజలు సతమతం అవుతున్నారు.
ఇదితావుంటే కొన్నిజిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయని హెచ్చరించారు... దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు కంగారు పడుతున్నారు. మొదట్లో వర్షాలు విస్తారంగా కురవడంతో వ్యవసాయ పనులు ప్రారంభించుకున్నారు... తీరా పంటలు వేసాక వర్షాలు తగ్గిపోయాయి. మరో వారంరోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలు లేవన్న వాతావరణ శాఖ హెచ్చరికలు వారిలో ఆందోళన పెంచాయి.
