యూపీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏమిటి ఈ ‘ప్రతిభా సేతు’?
Pratibha Setu Digital Platform: యూపీఎస్సీ అన్ని దశలు క్లియర్ చేసినా ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కని అభ్యర్థుల కోసం ప్రధాని మోడీ ‘ప్రతిభా సేతు’ అనే డిజిటల్ వేదికను ప్రారంభించారు.

ప్రతిభా సేతు ఏమిటి?
ప్రధాని నరేంద్ర మోడీ ‘ప్రతిభా సేతు’ డిజిటల్ వేదికను సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పటీ పడుతున్న వారికోసం ప్రారంభించారు. యూపీఎస్సీ పరీక్షల్లో అన్ని దశలు (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు) విజయవంతంగా పూర్తి చేసినా, ఒక్కోసారి స్వల్ప తేడాతో తుది మెరిట్ లిస్ట్‌లో చోటు పొందని అభ్యర్థుల కోసం రూపొందించిన డిజిటల్ వేదిక ప్రతిభా సేతు.
125వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రతిభా సేతు వేదికను ప్రధాని మోడీ ప్రజలకు పరిచయం చేశారు. ఆయన మాట్లాడుతూ, “దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. ఇందులో చాలా మంది కష్టపడి విజయం సాధిస్తారు. అయితే, ఎంతో ప్రతిభ ఉన్నా కొద్దిపాటి తేడాతో తుది జాబితాలో చోటు పొందని వేలాది మంది అభ్యర్థులు ఉన్నారు. వారి కృషి వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ‘ప్రతిభా సేతు’ ప్రారంభించాం” అన్నారు.
ప్రతిభా సేతు వేదికలో ఉన్న అవకాశాలు ఏమిటి?
ఈ వేదికలో ఇప్పటికే 10,000 మందికి పైగా ప్రతిభావంతులైన అభ్యర్థుల డేటా నమోదు అయ్యింది. భవిష్యత్తులో మరింత మంది కోసం ఇది ఒక డేటా బ్యాంక్ గా మారనుంది.
అభ్యర్థులు స్వచ్ఛందంగా ఈ వేదికలో నమోదు చేసుకోవచ్చు. తమ విద్యా వివరాలు, క్లియర్ చేసిన పరీక్షల దశలు, ఆప్షనల్ సబ్జెక్టులు, మార్కులు, అనుభవం వంటి అంశాలను జోడించవచ్చు. ప్రొఫైల్ నమోదు చేసిన తర్వాత, అది భద్రతతో కూడిన ఎంప్లాయర్ డేటాబేస్ లో కనిపిస్తుంది.
ప్రతిభా సేతులో ఎవరు రిజిస్టర్ చేసుకోవచ్చు?
అర్హత గల పరీక్షలు
• సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE)
• ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFoS)
• ఇంజినీరింగ్ సర్వీసెస్ (ESE/IES)
• కాంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (CMS)
• CAPF (అసిస్టెంట్ కమాండెంట్)
• కాంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS)
• ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ / ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (IES/ISS)
• జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్
ప్రతిభా సేతును ఎంప్లాయర్లు ఎలా ఉపయోగించుకోవచ్చు?
ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
• ప్రభుత్వ సంస్థలు అనుమతి పత్రం, డిపార్ట్‌మెంట్ ఐడీ సమర్పించాలి.
• ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (CIN) ద్వారా వెరిఫై చేయాలి.
• వెరిఫికేషన్ పూర్తయ్యాక, వారికి లాగిన్ ఐడి, పాస్‌వర్డ్ ఇస్తారు.
• దాంతో వారు అభ్యర్థుల బయోడేటా, అర్హతలు, పరీక్ష వివరాలు, సంప్రదింపు సమాచారం చూసి వారిని నేరుగా సంప్రదించవచ్చు.
ప్రతిభా సేతు పై ప్రధాని మోడీ ఏమన్నారంటే?
“స్నేహితులారా, యూపీఎస్సీ పరీక్షలో ఫైనల్ లిస్ట్‌లో చేరకపోయినా ప్రతిభ ఉన్న అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. వారికి కొత్త అవకాశాలు అందేలా, వారి కృషి వృథా కాకుండా ఉండేలా ‘ప్రతిభా సేతు’ ప్రారంభించాం” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
‘ప్రతిభా సేతు’ ద్వారా యూపీఎస్సీ పరీక్షలో ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో చేరకపోయినా ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ వేదిక అభ్యర్థులు, ఎంప్లాయర్లను కలిపే ఒక సేతుగా పనిచేయనుంది.