ఆసియా కప్: T20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు వీరే
Asia Cup 2025 Most Runs: ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నారు.

ఆసియా కప్ టీ20 ఫార్మాట్
ఆసియా కప్ అనేది ఆసియా ఖండంలోని అత్యుత్తమ క్రికెటర్ల ప్రతిభను ప్రదర్శించే ప్రతిష్టాత్మక టోర్నమెంట్ గా గుర్తింపు పొందింది. ఈ టోర్నమెంట్‌లో వన్డే ఫార్మాట్‌కి విశేష చరిత్ర ఉన్నప్పటికీ, టీ20 వెర్షన్ మాత్రం సాహసోపేతమైన షాట్లు, వ్యూహాత్మక మాస్టర్‌ప్లాన్‌లకు వేదికైంది.
ఈ టోర్నీలో ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ బ్యాట్స్‌మెన్‌లు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పరుగుల వరద పారించారు. ఆసియా కప్ టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 జాబితాలో ఇద్దరు భారత ప్లేయర్లు చోటుదక్కించుకున్నారు.
KNOW
1. విరాట్ కోహ్లీ
ఈ జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్, "కింగ్" విరాట్ కోహ్లీ టాప్ లో ఉన్నారు. ఆసియా కప్ టీ20ల్లో కోహ్లీ అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నారు. స్థిరమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 429 పరుగులు చేసి, అద్భుతమైన 85.80 సగటుతో తన బ్యాటింగ్ ను కొనసాగించారు.
2022లో ఆఫ్గానిస్తాన్‌పై 122 నాటౌట్ పరుగుల కోహ్లీ నాక్.. టీ20లో ఆడిన అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఒత్తిడిలోనూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం, అదే సమయంలో వేగంగా స్కోరు చేయడం విరాట్ కోహ్లీ ప్రత్యేకత.
2. మహమ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ జట్టు నమ్మదగిన వికెట్‌కీపర్-బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 281 పరుగులు చేసి పాక్ జట్టులో కీలక పాత్ర పోషించారు.
2022 ఆసియా కప్‌లో టాప్ రన్-స్కోరర్‌గా నిలిచిన రిజ్వాన్, తన స్థిరమైన ఓపెనింగ్ ప్రదర్శనలతో పాకిస్తాన్ విజయాల్లో ముఖ్యపాత్ర పోషించారు.
3. రోహిత్ శర్మ
భారత జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. 9 మ్యాచ్‌ల్లో 271 పరుగులు సాధించారు. మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించారు.
140కు పైగా స్ట్రైక్ రేట్‌తో రోహిత్ ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఆడతారు. ఆయన శుభారంభాలు భారత్‌కు టీ20 ఆసియా కప్‌లో విజయానికి బలమైన పునాది వేసాయి.
4. బాబర్ హయత్
ఆసియా కప్ లో అదరగొట్టిన మరో ప్లేయర్ బాబర్ హయత్. హాంకాంగ్ కు చెందిన ఈ ప్లేయర్ కేవలం 5 ఇన్నింగ్స్‌లోనే 235 పరుగులు చేసి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు.
2016లో ఒమన్‌పై క్వాలిఫయర్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి చిన్న క్రికెట్ దేశాల ఆటగాళ్లు కూడా టాప్ స్థాయిలో రాణించగలరని నిరూపించారు.
5. ఇబ్రాహీం జద్రాన్
టాప్-5 జాబితాతో చివరి స్థానంలో ఆఫ్గానిస్తాన్ యువ ఆటగాడు ఇబ్రాహీం జద్రాన్ ఉన్నారు. 5 మ్యాచ్‌ల్లో 196 పరుగులు సాధించి తన ప్రతిభను నిరూపించారు.
2022 టోర్నమెంట్‌లో జట్టుకు కీలకంగా నిలిచిన ఆయన, 65.33 సగటుతో ఆడుతూ ఆఫ్గాన్ బ్యాటింగ్ శక్తిని ప్రపంచానికి చూపించారు. భవిష్యత్తులో ఆఫ్గాన్ క్రికెట్‌కు ప్రధాన ఆటగాడిగా నిలిచే అవకాశాలున్నాయి.
వీరి ప్రదర్శనలు కేవలం వ్యక్తిగత రికార్డులే కాకుండా, జట్ల విజయానికి కీలకంగా మారాయి.