Viksit Bharat : నశా ముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. అసలేంటిది?
Nasha Mukt Yuva Campaign : వికసిత్ భారత్ సాధనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 'నశా ముక్త్ యువ' ప్రచారాన్ని ప్రారంభించారు. అసలేంటిది? 100 వారాల పాటు సాగే ఈ ప్రజా ఉద్యమం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

‘నశా ముక్త్ యువ’ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
యువత సాధికారత, సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) కల నెరవేరాలంటే యువత అతిపెద్ద శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మహమ్మారిని ఉపేక్షించకుండా పూర్తిగా నిర్మూలించేందుకు ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అధికారికంగా ప్రారంభించారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే యువత దేశ ప్రగతిలో భాగస్వాములు కాగలరని ఆయన పిలుపునిచ్చారు.
కాశీ పైలట్ ప్రాజెక్ట్ నుంచి 100 వారాల ప్లాన్
ఈ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం ఒక రోజుతో ముగిసిపోయేది కాదని, రాబోయే 100 వారాల పాటు సాగే భారీ ప్రజా ఉద్యమం అని ప్రధాని వెల్లడించారు. గతేడాది పవిత్ర కాశీ క్షేత్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ప్రయోగం, ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా విస్తరించడం విశేషం. శాస్త్రీయ అవగాహనతో పాటు ఆధ్యాత్మిక బలాన్ని జోడిస్తూ దాదాపు 125కి పైగా ఆధ్యాత్మిక సంస్థలు ఈ మిషన్‌లో భాగస్వాములయ్యాయి. దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ ప్రాంతాల నుంచి సుమారు ఒక కోటి మందికి పైగా యువకులు వర్చువల్‌గా పాల్గొని నశా ముక్తి ప్రతిజ్ఞ తీసుకున్నారు.
ప్రతి ఆదివారం స్పెషల్ యాక్టివిటీస్
ఈ 100 వారాల క్యాంపెయిన్‌లో భాగంగా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యువతను నెగెటివ్ ఆలోచనలు, అలవాట్లకు దూరం చేసి క్రీడలు, సంస్కృతి వైపు మళ్లించడమే నశా ముక్త్ యువ ముఖ్య ఉద్దేశం.
• స్పోర్ట్స్, ఫిట్‌నెస్: వాక్‌థాన్‌లు, రన్నింగ్, రకరకాల క్రీడా పోటీలు.
• మానసిక వికాసం: ధ్యాన శిబిరాలు, యోగా సెషన్లు.
• కల్చరల్ ఈవెంట్స్: వీధి నాటకాలు, ఆర్ట్ కాంపిటీషన్లు, అవగాహన ర్యాలీలు, చర్చలు
పెరుగుతున్న మాదకద్రవ్యాల ముప్పు.. గణాంకాలు ఏం చెప్తున్నాయి?
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రిపోర్టుల ప్రకారం.. దేశంలో మత్తు పదార్థాల విక్రయాలు, వాడకం ఆందోళనకర రీతిలో ఉన్నాయి. అధికారులు రూ. 1,980 కోట్ల విలువైన 1.34 లక్షల కేజీల మాదకద్రవ్యాలను సీజ్ చేశారు. అంతేకాకుండా, 42,282 ఎకరాల్లో అక్రమంగా సాగు చేస్తున్న మాదకద్రవ్యాల పంటలను అధికారులు ధ్వంసం చేశారు. 2020లో ఇది కేవలం 10,000 ఎకరాలుగా ఉండగా, ఐదేళ్ల కాలంలో గణనీయంగా పెరిగింది. ఈ భయంకరమైన పరిస్థితిని అరికట్టడానికి ‘మై భారత్’ (MY Bharat), ఎన్‌ఎస్‌ఎస్ (NSS), పాఠశాలలు, కళాశాలలు, ఎన్‌జీఓలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఏర్పడింది.
‘అమృత తరం’ చేతుల్లోనే భారత్ భవిష్యత్తు
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ.. 2020 ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించిన మాదకద్రవ్యాల రహిత భారత్ సంకల్పానికి ఈ నూతన అభియాన్ మరింత ఊతాన్నిస్తుందని తెలిపారు. నేటి యువతను ‘అమృత తరం’గా అభివర్ణించిన ప్రధాని మోదీ, రాబోయే 20-25 ఏళ్లలో దేశ దిశను నిర్దేశించే శక్తి యువతకే ఉందన్నారు. మై భారత్ పోర్టల్ (mybharat.gov.in) ద్వారా ప్రతీ ఒక్కరూ వాలంటీర్లుగా నమోదు చేసుకుని ఈ మిషన్‌లో భాగస్వాములు కావాలని, ప్రతిజ్ఞ తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రతీ 50, 75, 100 వారాల మైలురాళ్ల వద్ద అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ప్రత్యేకంగా సన్మానించనున్నారు.
Speaking at the launch of 'Nasha Mukt Yuva for Viksit Bharat Sankalp Abhiyan', a 100-week campaign against substance abuse. I urge every citizen, especially our youth, to join this movement. https://t.co/ucvrcAyK4C
— Narendra Modi (@narendramodi) August 2, 2026

