PM Modi: దేశంలో భారీగా తగ్గనున్న ధరలు.. కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలంతా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీ ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన దేశ ప్రజలకు ప్రధాని ఒక గుడ్ న్యూస్ చెప్పారు.

ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ కానుక
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో దేశానికి పెద్ద పండుగ కానుకను ప్రకటించారు. ఈ దీపావళి నాటికి తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా ప్రతిరోజు ఉపయోగించే వస్తువులపై పన్నులు తగ్గి, ప్రజలకు ఉపశమనం లభించనుంది.
KNOW
“దీపావళికి గొప్ప కానుక” – మోదీ
ఈ విషయమై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “దీపావళి రోజున నేను గొప్ప కానుక ఇవ్వబోతున్నాను. గత ఎనిమిదేళ్లలో జీఎస్టీ లో పెద్ద మార్పులు చేశాం, పన్నులను సులభతరం చేసాం. ఇప్పుడు కాలం డిమాండ్ మేరకు సమీక్ష అవసరం, మేము చేశాం, రాష్ట్రాలతో చర్చించాం, ఇక తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తున్నాం” అని స్పష్టం చేశారు.
పన్నుల్లో భారీ తగ్గింపు – చిన్న పరిశ్రమలకు లాభం
ప్రధాని ప్రకటన ప్రకారం, ఈ కొత్త జీఎస్టీ విధానం ద్వారా ప్రజలు చెల్లించే పన్నులు భారీగా తగ్గుతాయి. ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలు (MSMEs), రోజువారీ అవసరాల ఉత్పత్తులపై పన్ను తగ్గించడంతో అవి మరింత చవకగా అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల వినియోగదారులకు ఉపశమనం కలగడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది.
“రీఫార్మ్ – పర్ఫార్మ్ – ట్రాన్స్‌ఫార్మ్” తర్వాత కొత్త లక్ష్యాలు
మోదీ మాట్లాడుతూ గత దశాబ్దం "రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్" పంథాలో సాగిందని, ఇకపై మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో 21వ శతాబ్దానికి అవసరమైన అన్ని సంస్కరణలను సమయ పరిమితిలో సూచించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
జీఎస్టీ చరిత్ర ఏంటో తెలుసా.?
భారతదేశంలో జూలై 1, 2017న జీఎస్టీ అమలులోకి వచ్చింది. ఇది కేంద్ర, రాష్ట్ర పన్నులను రద్దు చేసి, ఒకే పన్ను వ్యవస్థను ఏర్పరచింది. జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఉంటారు. వారు రేట్లు, మినహాయింపులు, విధాన మార్పులపై నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతం జీఎస్టీ రేట్లు ఐదు ప్రధాన స్లాబ్‌లలో ఉన్నాయి – 0%, 5%, 12%, 18%, 28%. ఇందులో 12%, 18% రేట్లు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి వినియోగ వస్తువులకు ప్రామాణికంగా వర్తిస్తాయి.