Independence Day 2025: భారతదేశం ఇవాళ 79వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు, 'స్వేచ్ఛను గౌరవిద్దాం, భవిష్యత్తుకు ప్రేరణ ఇస్తాం' అని ఈసారి వేడుకలకు థీమ్ .
Independence Day 2025: భారతదేశం ఇవాళ 79వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా ప్రారంభిస్తారు. 'స్వేచ్ఛను గౌరవిద్దాం, భవిష్యత్తుకు ప్రేరణ ఇస్తాం' అని ఈసారి వేడుకలకు థీమ్ ఇచ్చారు. ఉదయం 7:21 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు. 7:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత జాతీయ గీతం ఆలపించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ గౌరవ వందనం సమర్పించాయి, 21 తుపాకుల గౌరవ సాల్వోతో వేడుకలు జరుగుతున్నాయి.
అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఘర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని కోరారు. ఇది 140 కోట్ల భారతీయుల సంకల్ప పండుగగా మోదీ వర్ణించారు. ఈ వేడుకలు ‘నయా భారత్’ థీమ్‌తో జరుగుతున్నాయని పేర్కొంటూ, దేశమంతా ఒకే సమైక్య భావంతో ఉప్పొంగే సమయం ఇదేనని అన్నారు. స్వాతంత్య్రం అనేక మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధుల కృషి, త్యాగాల ఫలమని గుర్తుచేసి, వారందరికీ వందనం చేశారు.
ఈ రోజు మనం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కూడా జరుపుకుంటున్నాం. ఆయన దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు. కోట్లాది ప్రజల త్యాగాలతో స్వాతంత్య్రం వచ్చిందని మోదీ అన్నారు. వేడుకల్లో పాల్గొన్న ‘లక్‌పతి దీదీ’, ‘డ్రోన్ దీదీ’ వంటి ప్రగతి పథంలో ఉన్న మహిళలకు మోదీ అభినందనలు తెలిపారు. టెక్నాలజీ రంగంలో విశాల భారత్ నుంచి వచ్చిన ప్రతినిధులు, వివిధ రంగాల్లో సాధన చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇక వారి ఆటలు సాగవు.. పాక్ కు మోడీ హెచ్చరిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు హెచ్చరిక జారీ చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేసుకుంటూ, పిల్లల ముందు తండ్రిని హత్య చేసిన దారుణం దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపిందని పేర్కొన్నారు. “మతాన్ని అడిగి ప్రాణాలు తీశారు… ఆ ఆక్రోశం నుంచే ‘ఆపరేషన్ సిందూర్’ ఆవిర్భవించింది” అని తెలిపారు.
మోదీ మాట్లాడుతూ, “మన సైన్యానికి పూర్తి స్వేఛ్ఛ ఇచ్చాం. యుద్ధ నీతిని అనుసరించి లక్ష్యం సాధించాం. వందలాది ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం. ఇప్పుడు ఉగ్రవాదుల ఆటలు సాగవు. ‘ఆపరేషన్ సిందూర్’ ఇకపై న్యూ నార్మల్. ఎక్కడైనా ఉగ్రదాడి జరిగితే, మన సమాధానం ఇదే” అని స్పష్టం చేశారు.
అణు దాడి బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ ప్రయత్నాలు చేసినా భారత్ వెనక్కి తగ్గదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. “మన వీర జవాన్లు దుర్మార్గులపై చెక్ పెట్టారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం చేసిన ప్రతి యోధుడికి దేశం సెల్యూట్ చేస్తుంది” అని ప్రధాని మోదీ తెలిపారు.
పాకిస్థాన్‌కు ఆ జలాలను ఇచ్చేదే లేదు
సింధు జలాల ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఘాటుగా విరుచుకుపడ్డారు. సింధు జలాల ఒప్పందం దేశానికి అన్యాయం చేస్తున్నదన్నారు. 'భారత నదుల జలాలు ఉగ్రవాద దేశానికి వెళ్తున్నాయి. మన రైతులకు నీరు అందడం లేదు. ఇది ఏం ఒప్పందం? ఆ నీటిపై భారతీయులకు హక్కు ఉంది. దానిపై అధికారం మనకే ఉంటుంది. పాక్ కు సిందూ జలాలను ఇచ్చేదే లేదు' అని మోదీ స్పష్టం చేశారు.
ఆత్మనిర్భర భారత్ వైపు దేశం సాగాలని పిలుపునిచ్చిన మోదీ, ఆపరేషన్ సిందూర్ విజయానికి ‘మేడ్ ఇన్ ఇండియా’ ఆయుధాలే కారణమని చెప్పారు. మన ఆత్మనిర్భరత వల్లే పాకిస్థాన్‌కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాం. మన ఆయుధాలు మనమే తయారు చేసుకుంటామని తెలిపారు. రక్షణ రంగంలో సామర్థ్యం పెంచుతూ, టెక్నాలజీ ఆధారిత శతాబ్దంలో ముందుకు సాగాలని అన్నారు. 2047 నాటికి అన్ని లక్ష్యాలను సాధించాల్సిందేనని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
GST సంస్కరణలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఆర్థిక, సామాజిక రంగాలకు సంబంధించిన పలు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. ఈ ఏడాది దీపావళి నాడు దేశ ప్రజలకు “డబుల్ దీపావళి” గిఫ్ట్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. “గత ఎనిమిదేళ్లలో GSTతో పన్ను వ్యవస్థను సరళీకరించాం. ఎనిమిదేళ్ల తర్వాత దానిని సమీక్షించడం అవసరం. రాష్ట్రాలతో చర్చించి, తదుపరి తరం GST సంస్కరణలు తీసుకువస్తున్నాం” అని ప్రకటించారు.
ఈ కొత్త సంస్కరణల ద్వారా పరిశ్రమలకు పెద్ద సౌలభ్యం కలుగుతుందనీ, రోజువారీ అవసర వస్తువులు చౌకవుతాయని ఆర్థిక వ్యవస్థకు బలమైన ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థను విశ్వసిస్తున్నాయని, దేశ స్థూల సూచికలు బలంగా ఉన్నాయని మోదీ అన్నారు. రైతులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలకు లాభం చేకూరేలా కొత్త చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
