భారతదేశానికి చెందిన ఒక యువకుడు గూగుల్‌కే భారీ ఆఫర్ ఇచ్చాడు. గూగుల్ వెబ్ బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్ ను తాము కొంటామని అడిగాడు. అతడు పెర్ప్లెక్సిటీ అనే ఏ స్టార్టప్ ఓనర్.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్న కాలం ఇది. భవిష్యత్తులో దీని ట్రెండు మరింత పెరిగే అవకాశం ఉంది. మన దేశానికి చెందిన ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజన్ పెర్ప్లెక్సిటీ. దీన్ని 2022 డిసెంబర్లో అరవింద శ్రీనివాస్, డెన్నిస్ యారట్స్, జానీ హోమ్, ఆండీ కొన్విన్సీ అనే నలుగురు యువకులు స్థాపించారు. ఇందులో పెర్ప్లెక్సిటీ సీఈవోగా అరవింద శ్రీనివాస్ ఉన్నారు. ఆయన ఆ కంపెనీ సహాయ వ్యవస్థాపకులు కూడా. ఐఐటి మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు.
అరవింద శ్రీనివాస్ నేతృత్వంలో పెర్ఫ్లెక్సిటీ గూగుల్ క్రోమ్ కొనేందుకు గూగుల్ 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి పెర్ప్లెక్సిటీ కంపెనీ మొత్తం విలువ కంటే ఇది చాలా ఎక్కువ. అయినా సరే అంత మొత్తాన్ని పెట్టి కొనేందుకు వీరు సిద్ధమయ్యారు.
ఎలా కొంటోంది?
గూగుల్ క్రోమ్ అమ్మాలని గూగుల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తోంది. దీంతో పెర్ప్లెక్సిటీ నుంచి భారీ ఆఫర్ రావడంతో గూగుల్ క్రోమ్ అమ్మే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుతోంది. ఇంత పెద్ద మొత్తంలో పెర్ఫ్లెక్సిటీ గూగుల్ క్రోమ్ ను కొనేందుకు బయటనుంచి పెట్టుబడిదారులను కూడా సాయం కోరుతోంది. ఇప్పటికే వారికి ఆ సాయం అందిందని సమాచారం. ఈ ఆఫర్ నిజమేనని పెర్ప్లెక్సిటీ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది కూడా. ఒకవేళ గూగుల్ క్రోమ్ ను పెర్ప్లెక్సిటీ కొంటే దాన్ని అలాగే ఉంచుతామని... పెర్ప్లెక్సిటీ డిఫాల్ట్ సెర్చ్ ఇంజనుగా మార్చబోమని కూడా అరవింద శ్రీనివాస్ చెబుతున్నారు.
గూగుల్ క్రోమ్ ఎందుకు అమ్ముతున్నారు?
గూగుల్ క్రోమ్ ను ఎందుకు విక్రయిస్తున్నారు? నిజంగా విక్రయిస్తారా? లేదా? అన్న విషయాలపై ఇప్పటికీ ఎక్కడ స్పష్టమైన ప్రకటన లేదు. ఇప్పటికే శాంసంగ్, యాపిల్ వంటి ఎన్నో మొబైల్ కంపెనీలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుంది. ఆయా ఫోన్లలో గూగుల్ క్రోమ్ సెర్చ్ డిఫాల్ట్ గా ఉండేలా వారికి ఎక్కువ మొత్తాలు చెల్లించింది. అయితే అమెరికాలోని జస్టిస్ డిపార్ట్మెంట్ దీన్ని తప్పుడు పద్ధతి అని వాదిస్తున్నాయి. ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించాయి. గూగుల్ చేపట్టిన విధానాలు చట్ట విరుద్ధమని వారు కోర్టులో వాదిస్తున్నారు. దీంతో గూగుల్ క్రోమ్ అమ్మాలని అమెరికా ప్రభుత్వం కూడా గూగుల్ సంస్థను అడుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
పెర్ప్లెక్సిటీ సెర్చ్ ఇంజన్ లాగా పనిచేసే ఒక అప్లికేషన్. కామెట్ అనే పేరుతో ఇది సేవలు అందిస్తోంది. ఇప్పటికే దీన్ని వాడే వారి సంఖ్య పెరుగుతుంది. ఏడాదిలో 10 కోట్ల నుంచి 100 కోట్ల యూజర్లకు చేరుకోవాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఎంతో స్మార్ట్ ఫోన్ తయారీదారులతో కూడా ఇది చర్చలు జరుపుతుంది.
