PM Kisan : రూ.6000 కావాలంటే ఈ పని తప్పక చేయాల్సిందే.. పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్ !
PM Kisan : పీఎం కిసాన్22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. డబ్బులు ఎప్పుడు జమవుతాయి? కొత్తగా వచ్చిన ఫార్మర్ ఐడీ నిబంధనలు, ఈ-కేవైసీ అప్‌డేట్స్ గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పీఎం కిసాన్22వ విడత: జనవరిలో వస్తుందా? ఫిబ్రవరిలోనా? క్లారిటీ ఇదే!
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 22వ విడత నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
2025 నవంబర్ నెలలో 21వ విడత నిధులు విజయవంతంగా విడుదలయ్యాయి. ఇప్పుడు కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కావడంతో, 22వ విడత ఎప్పుడు విడుదలవుతుందనే చర్చ రైతుల మధ్య మొదలైంది. ముఖ్యంగా జనవరి నెలలోనే డబ్బులు జమ అవుతాయా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.
పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?
పీఎం కిసాన్ నిధుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రభుత్వం వైపు నుండి 22వ విడత విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ గతంలో నిధులు విడుదలైన సమయాలను బట్టి కొన్ని అంచనాలు ఉన్నాయి. సాధారణంగా ఈ పథకం నిధులు ప్రతి నాలుగు నెలలకొకసారి విడుదలవుతాయి.
కొన్ని మీడియా రిపోర్టు ప్రకారం, 22వ విడత నిధులు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొన్ని విశ్లేషణల ప్రకారం, మార్చి లేదా ఏప్రిల్ 2026 మధ్యలో నిధులు జమ అయ్యే ఛాన్స్ ఉంది. జనవరి నెలలో 22వ విడత విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం.
రైతులకు తప్పనిసరి అయిన 'ఫార్మర్ ఐడీ'
ఈసారి పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందేందుకు ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. పథకం ప్రయోజనాలు పొందే రైతులందరికీ యూనిక్ ఫార్మర్ ఐడీ (Farmer ID) ఉండటం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరికైతే ఈ ఐడీ ఉండదో, వారి తదుపరి విడత నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
అసలు ఈ ఫార్మర్ ఐడీ అంటే ఏమిటి?
ఇది రైతుల డిజిటల్ గుర్తింపు. ఇందులో రైతుకు సంబంధించిన భూమి వివరాలు, పండించే పంటలు, సాగు వివరాలు, పశుసంపద, ఆదాయ వివరాలు ఉంటాయి. ఈ ఐడీని పొందడానికి రైతులు ఆధార్ కార్డు, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్, భూమి పత్రాలు, రేషన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ డబ్బులు ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పీఎం కిసాన్22వ విడత నిధులు ఎలాంటి ఆటంకం లేకుండా మీ ఖాతాలో జమ కావాలంటే, రైతులు తమ వివరాలను సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి. అలాగే, మీ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి, బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉండాలి.
భూమి రికార్డుల్లో ఏవైనా తప్పులు ఉన్నా, పేరులో అక్షర దోషాలు ఉన్నా డబ్బులు జమ కాకపోవచ్చు. కాబట్టి, రైతులు వెంటనే తమ స్టేటస్‌ను చెక్ చేసుకుని, ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి. సాంకేతిక కారణాల వల్ల లేదా డాక్యుమెంట్ల అప్‌డేట్ లేకపోవడం వల్ల చాలా మంది రైతులకు డబ్బులు నిలిచిపోతున్నాయి.
లబ్ధిదారుల జాబితా, పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం ఎలా?
రైతులు తాము 22వ విడతకు అర్హులేనా కాదా అని తెలుసుకోవడానికి పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకుని జాబితాను చూడవచ్చు.
అలాగే, బెనిఫిషరీ స్టేటస్ ఆప్షన్ ద్వారా పేమెంట్ వివరాలను ట్రాక్ చేయవచ్చు. ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా మీ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ స్టేటస్‌లో పెండింగ్ లేదా రిజెక్ట్ అని ఉంటే, దానికి గల కారణాన్ని తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
రైతులకు పీఎం కిసాన్ పథకం ఎందుకు కీలకం?
పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, వాతావరణ మార్పుల నేపథ్యంలో పీఎం కిసాన్ పథకం రైతులకు ఒక పెద్ద భరోసాగా నిలుస్తోంది. విత్తనాలు, ఎరువులు, సాగు నీటి ఖర్చులు, కూలీల ఖర్చుల కోసం ఈ డబ్బులు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ముఖ్యంగా 2026లో వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యే సమయానికి ఈ నిధులు అందడం వల్ల రైతులకు పెట్టుబడి కష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వం తీసుకుంటున్న డిజిటల్ చర్యల వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరుతున్నాయి. రైతులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ అప్‌డేట్స్ తెలుసుకోవడం మంచిది.

