Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Aadhaar Card New Rules 2026 : ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం UIDAI 2026 సంవత్సరానికి కొత్త పత్రాల జాబితాను విడుదల చేసింది. గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీ మార్పులకు కావాల్సిన డాక్యుమెంట్లు, ఆన్‌లైన్ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు మీకోసం.

ఆధార్ కార్డుదారులకు అలర్ట్: ఈ కొత్త రూల్స్ తెలియకపోతే ఇబ్బందులే
భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు అనేది అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. ప్రభుత్వ పథకాల నుండి బ్యాంకు లావాదేవీల వరకు ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి. అయితే, తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డుల జారీ, అప్‌డేట్‌కు సంబంధించి నిబంధనలలో కీలక మార్పులు చేసింది.
ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఆధార్ అప్‌డేట్ లేదా కొత్త ఆధార్ జారీ కోసం అవసరమైన చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితాను సవరించింది. 2025-26 అసెస్మెంట్ సంవత్సరానికి ఈ కొత్త జాబితా వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నిబంధన
ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనలలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి వ్యక్తికి కేవలం ఒకే ఒక ఆధార్ సంఖ్యను కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ పొరపాటున లేదా సాంకేతిక లోపాల వల్ల ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ ఐడీలు ఉంటే, ఆ వ్యక్తికి మొదట జారీ చేసిన ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
చాలా సందర్భాల్లో, సిస్టమ్ ఎర్రర్స్ వల్ల లేదా ప్రజలు తెలియక ఎక్కువ అప్లికేషన్లు పెట్టుకోవడం వల్ల రెండు కార్డులు జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించి మొదట సృష్టించిన ఆధార్ మాత్రమే యాక్టివ్‌గా, వాలిడ్‌గా పరిగణలో ఉంటుందని UIDAI తెలిపింది. మిగిలినవి రద్దు చేస్తారు.
ఆధార్ : గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు
మీ వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయడానికి అవసరమైన పత్రాల జాబితాను UIDAI స్పష్టంగా పేర్కొంది. వీటిని గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీ, ఇతర వివరాలను ధృవీకరించడానికి ఉపయోగిస్తారు.
- గుర్తింపు రుజువు : మీ పేరు, ఫోటోను ధృవీకరించడానికి పాన్ కార్డ్ (PAN Card), ఓటరు ఐడి (Voter ID), డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వం జారీ చేసిన మరేదైనా ఫోటో గుర్తింపు కార్డును సమర్పించవచ్చు.
- చిరునామా రుజువు : మీ ఇంటి అడ్రస్ మార్చుకోవడానికి యుటిలిటీ బిల్లులు అంటే కరెంట్ బిల్లు, బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డ్ లేదా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద జారీ చేసిన అధికారిక పత్రాలను చిరునామా రుజువుగా అంగీకరిస్తారు.
పుట్టిన తేదీ, కుటుంబ సంబంధాల ధృవీకరణ
ఆధార్‌లో పుట్టిన తేదీ, కుటుంబ సంబంధాల మార్పులు చాలా సున్నితమైనవి, కాబట్టి వీటికి కచ్చితమైన పత్రాలు అవసరం.
- పుట్టిన తేదీ రుజువు : మీ పుట్టిన తేదీని అప్‌డేట్ చేయడానికి లేదా సరిదిద్దడానికి జనన ధృవీకరణ పత్రం (Birth Certificate), పాస్‌పోర్ట్ లేదా SSLC సర్టిఫికేట్ వంటి పత్రాలను ఉపయోగించవచ్చు.
- సంబంధాల రుజువు : కుటుంబ యజమానితో సంబంధాన్ని నిర్ధారించుకోవడానికి లేదా కుటుంబ వివరాలను అప్‌డేట్ చేయడానికి రేషన్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ లేదా తల్లిదండ్రుల పేర్లతో కూడిన జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ స్టెప్ బై స్టెప్
కొత్త నిబంధనల ప్రకారం, మీ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీనికోసం కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి..
- స్టెప్ 1: ముందుగా myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
- స్టెప్ 2: స్క్రీన్‌పై కనిపించే మీ గుర్తింపు, చిరునామా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
- స్టెప్ 3: అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, "I confirm that the above information is accurate" (పైన పేర్కొన్న సమాచారం సరైనదని నేను నిర్ధారిస్తున్నాను) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 4: డ్రాప్‌డౌన్ మెను నుండి మీకు అందుబాటులో ఉన్న సరైన గుర్తింపు రుజువును (Identity Proof) ఎంచుకోండి.
- స్టెప్ 5: ఎంచుకున్న ఐడెంటిటీ డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలి. (ఫైల్ సైజు 2 MB కంటే తక్కువ ఉండాలి. అది JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో ఉండాలి).
ఆధార్ అప్డేట్ : చివరి దశ, సబ్మిషన్
గుర్తింపు పత్రం అప్‌లోడ్ చేసిన తర్వాత, చిరునామా మార్పు ప్రక్రియను పూర్తి చేయాలి.
- స్టెప్ 6: చిరునామా రుజువు (Address Proof) కోసం మీరు అందించాలనుకుంటున్న పత్రాన్ని జాబితా నుండి ఎంచుకోండి.
- స్టెప్ 7: ఎంచుకున్న అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్‌ను పైన పేర్కొన్న ఫార్మాట్ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌లోడ్ చేయాలి.
- స్టెప్ 8: అన్ని పత్రాలను విజయవంతంగా అప్‌లోడ్ చేసిన తర్వాత, ప్రక్రియను పూర్తి చేయడానికి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN) వస్తుంది. దీని ద్వారా మీ అప్‌డేట్ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు.

