Income Tax Rules : ఇంట్లో ఎంత క్యాష్ ఉంచుకోవచ్చు? 84 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
Income Tax Rules : ఇంట్లో నగదు నిల్వ ఉంచడంపై 84% పన్ను విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత? ఐటీ చట్టం ఏం చెబుతోంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత?

మీ ఇంట్లో నగదు ఉందా? ఈ ఐటీ రూల్స్ తెలియకపోతే చిక్కుల్లో పడతారు!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. "ఇంట్లో ఎక్కువ మొత్తంలో నగదు ఉంచుకుంటే, దానికి 84 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది" అని. ఈ వార్త చూసి సామాన్యులు, చిన్న వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
నిజంగానే ప్రభుత్వం కొత్తగా ఇలాంటి రూల్ తెచ్చిందా? మన ఇంట్లో మన సంపాదనను దాచుకుంటే అంత భారీగా పన్ను చెల్లించాలా? అసలు ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) ఏం చెబుతోంది? ఈ విషయంపై స్పష్టత లేక చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో, చట్టపరమైన నిబంధనలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు? ఏదైనా లిమిట్ ఉందా?
అందరికీ వచ్చే ప్రధాన సందేహం ఇదే. చట్టపరంగా ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు అనేదానికి ఏదైనా పరిమితి ఉందా? అంటే దీనికి సమాధానం ఒకటే అలాంటిదేమీ లేదు.
ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం.. ఒక వ్యక్తి తన ఇంట్లో ఎంత మొత్తమైనా నగదును నిల్వ ఉంచుకోవచ్చు. అది రూ. 10 వేలు కావచ్చు, రూ. 10 లక్షలు కావచ్చు, లేదా రూ. 10 కోట్లు అయినా కావచ్చు. చట్టం దీనికి ఎటువంటి గరిష్ఠ పరిమితిని విధించలేదు. ఇంట్లో డబ్బు దాచుకోవడం నేరం కాదు. అయితే, దీనికి ఒకే ఒక్క కండిషన్ ఉంది. మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి సరైన ఆధారం ఉండాలి.
ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాంకు నుంచి డ్రా చేశారా? ఆస్తి అమ్మగా వచ్చిందా? లేదా మీ జీతం డబ్బేనా? అనేదానికి మీ దగ్గర పక్కా ఆధారాలు ఉండాలి. ఆ డబ్బుకు మీరు ఐటీ రిటర్న్స్ (IT Returns)లో పన్ను చెల్లించి ఉంటే, ఎంత డబ్బు ఇంట్లో ఉన్నా ఒక్క రూపాయి కూడా పెనాల్టీ కట్టాల్సిన అవసరం లేదు.
మరి ఈ 84 శాతం పన్ను గోల ఏంటి?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం కాదు, అలాగని పూర్తిగా నిజమూ కాదు. ఇది కేవలం బ్లాక్ మనీ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ప్రజలకు ఇది వర్తించదు.
ఒకవేళ ఐటీ అధికారులు మీ ఇంటిపై రైడ్ చేసినప్పుడు, మీ ఇంట్లో భారీగా నగదు దొరికిందనుకుందాం. ఆ డబ్బుకు మీరు సరైన లెక్కలు చూపించలేకపోతే, లేదా ఆ ఆదాయాన్ని మీరు ఐటీ రిటర్న్స్‌లో చూపించకపోతే.. అప్పుడు సెక్షన్ 115BBE కింద భారీ పన్ను పడుతుంది.
ఆ లెక్కలు ఇలా ఉంటాయి:
• ఫ్లాట్ ట్యాక్స్ : 60 శాతం
• సర్‌ఛార్జ్ : పన్నులో 25 శాతం (అంటే 60% లో 25% = 15%)
• సెస్ : 4 శాతం
• వీటన్నింటినీ కలిపితే మొత్తం పన్ను 78 శాతం అవుతుంది.
దీనికి అదనంగా, ఆదాయాన్ని దాచిపెట్టినందుకు మరో 6-10 శాతం పెనాల్టీ వేస్తే, మొత్తం దాదాపు 84 శాతానికి చేరుతుంది. ఉదాహరణకు, మీ దగ్గర రూ. 10 లక్షల లెక్కలేని నగదు దొరికితే, అందులో రూ. 8.4 లక్షలు ప్రభుత్వానికి పన్ను రూపంలో వెళ్లిపోతుంది. మిగిలేది చాలా తక్కువ. కాబట్టి, సక్రమంగా పన్ను కట్టిన డబ్బు ఉన్నవారికి ఈ రూల్ వర్తించదు.
క్యాష్ లావాదేవీలపై కఠిన ఆంక్షలు (సెక్షన్ 269ST)
ఇంట్లో నగదు ఉంచుకోవడంపై లిమిట్ లేదు కానీ, నగదు స్వీకరించడం పై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. చాలామందికి తెలియని, అత్యంత ముఖ్యమైన రూల్ ఇది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269ST ప్రకారం.. ఒక వ్యక్తి నుంచి ఒక రోజులో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోకూడదు.
ఒక లావాదేవీకి సంబంధించి లేదా ఒక ఈవెంట్ లేదా సందర్భానికి సంబంధించి.. రెండు లక్షల క్యాష్ తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ రూల్ అతిక్రమించి రూ. 2 లక్షలు క్యాష్ తీసుకుంటే, వారికి 100 శాతం పెనాల్టీ విధిస్తారు. అంటే మీరు రూ. 5 లక్షలు క్యాష్ తీసుకుంటే, ఆ రూ. 5 లక్షలు పెనాల్టీగా కట్టాల్సి ఉంటుంది. డబ్బు వైట్ మనీ అయినా సరే, క్యాష్ రూపంలో రూ. 2 లక్షలు దాటి తీసుకోకూడదు. డిజిటల్ లేదా చెక్ రూపంలోనే తీసుకోవాలి.
ఐటీ శాఖ సూచనలు - మీరు ఏం చేయాలి?
అనవసరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించడం ముఖ్యం..
- రికార్డ్స్ మెయింటైన్ చేయండి: మీరు బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసి ఇంట్లో ఉంచితే, ఆ విత్ డ్రా స్లిప్స్ లేదా స్టేట్‌మెంట్స్ భద్రంగా ఉంచుకోండి.
- ఆధారం ముఖ్యం: ఆస్తి అమ్మకాలు లేదా వ్యవసాయ ఆదాయం ద్వారా వచ్చిన డబ్బు అయితే, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండాలి.
- డిజిటల్ వాడకం: రూ. 2 లక్షలు దాటిన లావాదేవీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు వాడకండి. నెట్ బ్యాంకింగ్, చెక్ లేదా యూపీఐ వాడటం సురక్షితం.
- ఐటీ రిటర్న్స్: మీ ఆదాయానికి, మీరు చూపిస్తున్న ఆస్తులకు పొంతన ఉండేలా చూసుకోండి.
కాబట్టి, నిజాయితీగా పన్ను కట్టే సామాన్యులు సోషల్ మీడియా వదంతులను నమ్మి భయపడాల్సిన అవసరం లేదు. మీ డబ్బుకు లెక్క ఉంటే, ఇంట్లో ఎంతైనా ఉంచుకోవచ్చు.

