Holiday: పబ్లిక్ హాలీడే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Holiday: జూన్ 6ను జాతీయ సెలవుగా ప్రకటించారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది.

పబ్లిక్ హాలీడే
Holiday: జూన్ 6ను కేంద్ర ప్రభుత్వం జాతీయ సెలవుగా ప్రకటించిందంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వెబ్‌సైట్లలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బ్యాంకులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మూసివేయబోతున్నాయన్న వాదనలు పలు పోస్టుల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సోషల్ మీడియలో కూడా వైరల్ గా మారాయి.
జూన్ 6న జాతీయ సెలవు.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్
అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని అధికారికంగా నిర్ధారణ అయింది. జూన్ 6న జాతీయ సెలవు ప్రకటించారనీ, ఇది బక్రీద్ (ఇద్-ఉల్-అధా) పండుగకు సంబంధించి తీసుకున్న నిర్ణయమని సోషల్ మీడియాలో పోస్టులు, పలు వార్తా సంస్థలు కూడా సంబంధిత కథనాలు ప్రచురించాయి. అయితే, ఇందులో నిజం లేదని పీఐపీ ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.
భారత ప్రభుత్వ జాతీయ పోర్టల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల కేలెండర్‌లను పరిశీలించగా, కేంద్రం నుంచి జూన్ 6కు సంబంధించి ఎలాంటి సెలవు ప్రకటన లేదని స్పష్టమైంది.
జూన్ 7 సెలవు
జూన్ 7న బక్రీద్ గెజెటెడ్ సెలవుగా ప్రకటించారు. ఇది శనివారం కావడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే అహ్మదాబాద్, గాంగ్టాక్, ఇటానగర్, కొచ్చి, తిరువనంతపురం వంటి కొన్ని నగరాల్లో మాత్రం బ్యాంకులు తెరిచి ఉంటాయని సమాచారం.
కేరళలో సర్కారు సెలవు కానీ..
కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదట జూన్ 6ను బక్రీద్ సెలవుగా ప్రకటించినా, ఆ నిర్ణయాన్ని సవరించి జూన్ 7న సెలవుగా మార్చింది. అలాగే, RBI ప్రకారం కేరళలోని కొన్ని నగరాల్లో జూన్ 6న బ్యాంకులకు సెలవు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉందా?
తమిళనాడు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించిన ప్రకారం, జూన్ 6ను సెలవుగా ప్రకటించడంపై కేంద్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ ప్రకారం జూన్ 6న పాఠశాలలు యధావిధిగా పనిచేస్తాయి.
రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా సెలవు లేదు.
సెలవు పై వదంతులు
ఈ వదంతులు ఒక నిర్ధారణ లేని వెబ్‌సైట్‌లో ప్రచురితమైన వ్యాసం ఆధారంగా వ్యాపించాయి. ఈ వెబ్‌సైట్ ఇటీవల ప్రభుత్వ వృద్ధుల ఉచిత ప్రయాణ పథకంపై కూడా తప్పుడు వార్తలు ప్రచురించినట్లు గుర్తించారు. ఇవి ఎక్కువగా AI ద్వారా రూపొందించిన కంటెంట్ గా గుర్తించారు. తమ ట్రాఫిక్‌ను పెంచుకోవడం లక్ష్యంగా ఇలా చేస్తున్నట్లు కూడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మొత్తంగా భారత ప్రభుత్వం జూన్ 6, 2025ను జాతీయ సెలవుగా ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా పనిచేస్తాయి. కేవలం కేరళలోని కొద్ది నగరాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంది. ప్రజలు వాస్తవాలను ధృవీకరించుకుని తప్పుడు ప్రచారాలను గమనించి జాగ్రత్తగా ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు.