RCB: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట క్రమంలో ఆర్సీబీ (RCB), కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA)పై క్రిమినల్ నిర్లక్ష్యానికి సంబంధించి ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఈ కేసును సీఐడీకి అప్పగించారు.

FIR Filed Against RCB: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదైంది. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఆర్సీబీ జట్టుపై ఎఫ్ఐఆర్ నమోదు

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై క్రిమినల్ నిర్లక్ష్యంపై కేసు నమోదు అయ్యింది. కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశార.ఆర్సీబీతో పాటు కర్నాటక క్రికెట్ సంఘంపై కేసు నమోదుచేశారు. ఈ FIRలో RCB, ఈవెంట్ నిర్వహణ సంస్థ డీఎన్ఏ, కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA) నిర్వాహకులపై అభియోగాలు నమోదయ్యాయి.

కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర గురువారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు పోలీస్ కమిషనర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, DCPలు, KSCA అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కోరలేదనీ, RCB, KSCA నిర్వహించాయని” స్పష్టం చేశారు. “ఇది బెంగళూరు జట్టుగా ఉండటంతో ప్రభుత్వంగా మద్దతు ఇచ్చాం. కానీ ఈ విషాద ఘటనపై ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నాను” అని పరమేశ్వర అన్నారు.

బెంగళూరు తొక్కిసలాటపై మేజిస్ట్రేటు దర్యాప్తు

ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, 33 మంది గాయపడ్డారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ, “ఇది ఒక పెద్ద విషాదం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తాం” అని చెప్పారు. “ఈ ఘటనపై మేజిస్ట్రేటు దర్యాప్తును ఆదేశించాను. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పాం. స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ 2-3 లక్షల మందికిపైగా వచ్చారు. దాంతో గేట్ల దగ్గర లోపలికి ప్రవేశం వద్ద తొక్కిసలాట జరిగింది” అని తెలిపారు.

అంతకుముందు, సంఘ సంస్కర్త స్నేహమయి కృష్ణ కూడా ఈ ఘటనపై మరో ఫిర్యాదు చేశారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, KSCA అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.

సంఘటనపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించమని ఆదేశించింది. కేసు సీరియస్‌గా ఉండటంతో దర్యాప్తును సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID)కు అప్పగించారు. ప్రత్యేక బృందం ఏర్పాటవుతోంది.