Salary: ఎంపీ నెల జీతం ఎంతో తెలుసా.? 60 ఏళ్ల క్రితం రూ. 500, ఇప్పుడు ఎంతైందంటే..
MP Salary in India: పార్లమెంటు సభ్యుల జీతాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల వేతనాన్ని 24 శాతం పెంచుతూ పార్లమెంటరీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతాలను పెంచారు. ఇంతకీ భారత దేశంలో ఎంపీలకు ఎంత జీతం వస్తుంది.? ఎలాంటి ఇతర అలవెన్సులు ఉంటాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Parliament building (File Photo/ANI)
వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా జీతాలు పెంచారు. ఎంపీల జీతం 24 శాతం పెరగడంతో ప్రస్తుతం రూ. 1.24 లక్షలకు పెరిగింది. ఎంపీల దినసరి భత్యాన్ని కూడా పెంచారు. గతంలో రోజుకు రూ. 2 వేలు ఉండగా ఇప్పుడు రూ. 2500కి పెంచారు. ఇక మాజీ పార్లమెంటు సభ్యులకు అందించే పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచారు. గతంలో ఈ పెన్షన్ మొత్తం 25 వేల రూపాయలు ఉండగా.. తాజాగా దీన్ని రూ.31 వేలకు పెంచుతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
Prime Minister Narendra Modi (File photo/ANI)
ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి
ఇదిలా ఉంటే ఎంపీల జీతభత్యాలను ప్రతీ 5 ఏళ్లకు ఒకసారి సమీక్షిస్తామని 2018లో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఎంపీల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 1966లో ఎంపీల జీతం కేవలం రూ. 500 మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు అది రూ. 1.24 లక్షకు చేరింది.
ఎన్నో అలవెన్సులు కూడా..
కేవలం జీతానికి మాత్రమే పరిమితం కాకుండా ఎంపీలకు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. ఇందులో విమాన ప్రయాణం, రైల్వే, నీరు, విద్యుత్ ఛార్జీలు వంటివి ఉంటాయి. ఎంపీలకు ఏటా రూ. 4.8 లక్షల విమాన ప్రయాణ భత్యం అందిస్తారు. అదే విధంగా నియోజకవర్గ భత్యం కింద నెలకు రూ. 87,000 లభిస్తుంది. ఉచిత రైలు పాస్ సౌకర్యం ఉంటుంది. 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చు. 4 లక్షల లీటర్ల ఉచిత నీరు పొందొచ్చు. ఫోన్, ఇంటర్నెట్ ఛార్జీల కోసం ఏటా ప్రత్యేకంగా అలవెన్సులు లభిస్తాయి.
జీతం కాకుండా ఎంపీలకు అలవెన్సుల రూపంలో నెలకు సుమారు రూ. 1,51,833 లభిస్తుంది. ఈ లెక్కన జీతంతో కలిపితే ఒక ఎంపీ జీతం నెలకు సుమారు రూ. 2.9 లక్షలకుపైమాటే. ఇదిలా ఉంటే ఎంపీలు పొందే జీతంపై ఎలాంటి పన్ను ఉండదు. వీటికి అదనంగా ఎంపీ భార్యలకు ఏడాదికి 34 ఉచిత విమాన ప్రయణాలు లభిస్తాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు 8 ఉచిత విమాన ప్రయాణాలు లభిస్తాయి.