Ganga Floating Stone: గంగా నదిలో తేలుతున్న 2 క్వింటాళ్ల భారీ రాయి.. వీడియో వైరల్
Ganga Floating Stone: మరోసారి గంగానదిలో తేలుతున్న రాయి వీడియోలు వైరల్ గా మారాయి. నీటిపై తేలుతున్న ఆ రాయి దాదాపు 2 క్వింటాళ్లకు పైగా బరువు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇది రామసేతు నిర్మాణంలో వాడిందేనంటూ పూజలు చేస్తున్నారు.

ఘాజీపూర్‌లో గంగా నదిలో తేలుతున్న భారీ రాయి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ వద్ద గంగా నదిలో తేలుతున్న ఒక భారీ రాయి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా అద్భుతంగా కనిపించే ఘటనలు జనాల్లో ఆశ్చర్యం, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇది కూడా అలాంటి ఒక సంఘటనే. ఈ వీడియోలో గంగా నదిలో భారీ రాయి నీటిపై తేలుతూ కనిపిస్తోంది. దాన్ని చూసిన కొంతమంది దాన్ని రామసేతు నిర్మాణంలోని రాయిగా పేర్కొంటూ పూజలు కూడా చేస్తున్నారు.
వీడియోకు లక్షల్లో వ్యూస్
ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేశారు. “ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో గంగా జలాల్లో భారీ రాయి తేలుతూ వచ్చింది” అని పేర్కొన్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొంత సమయంలోనే వైరల్ గా మారింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. కామెంట్ల వర్షం కురుస్తోంది.
వీడియోలో గంగా ప్రవాహంలో పెద్ద రాయి తేలుతూ ఉన్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆశ్చర్యంతో చూస్తూ, కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేస్తుండగా, మరికొందరు దాన్ని రామసేదుదేననీ, దైవమని నమ్మి పూజలు చేయడం మొదలుపెట్టారు.
गाजीपुर ददरी घाट पर हुआ चमत्कार,#गंगा में तैरता हुआ मिला #पत्थर,।
जय सियाराम@siddharthgzppic.twitter.com/7YbsC7KBG7— Shashi Sinhawadi (Modi ka pariwar) (@shashibjpgzp) July 18, 2025
గతంలో కూడా నీళ్లలో తేలిన రాళ్లు కనిపించాయి
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలోని నదిలో 2022లో తేలియాడుతున్న ఒక భారీ రాయి కనిపించింది. ఈ తేలియాడే రాయి అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. రాముడు లంకకు వెళ్ళడానికి సముద్రం మీద నిర్మించిన రామసేతు వంతెనలోని రాళ్లలో ఇది ఒకటి అక్కడి ప్రజలు పేర్కొన్నారు. దీంతో పాటు, ఆ రాయిపై రాముడి పేరు కూడా రాసి ఉందని గ్రామస్తులు చెప్పడంతో అప్పట్లో వైరల్ గా మారింది.
రామసేతు.. నీటిపై తెలియాడే వంతేన
హిందూ పురాణాల ప్రకారం.. శ్రీరాముని సైన్యం లంకకు (ఇప్పటి శ్రీలంక) వెళ్లడానికి సముద్రం పై వంతెనను నిర్మించారు. వంతెన నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై రాముడి పేరు రాశారు. రాములోరి ఆధ్యాత్మికత, శక్తి కారణంగా ఆ రాయి నీటిపై తేలుతుందని హిందూ మత పురాణాలు పేర్కొంటున్నాయి.
నీటిలో తేలియాడే రాళ్లు.. సైన్స్ ఏం చెబుతోంది?
వీడియోపై పలువురు ఎక్స్ వినియోగదారులు తమ అభిప్రాయాలు షేర్ చేశారు. “నీటిలో తేలే రాయిని ‘ప్యూమిస్ స్టోన్’ లేదా ‘ఝావన్ స్టోన్’ అంటారు. ఇది అగ్నిపర్వత లావాతో ఏర్పడే రాయి. ఇందులో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, ఇవి దాని ఘనత్వాన్ని నీటి కన్నా తక్కువగా చేస్తాయి, అందువల్ల ఇది తేలుతుంది” అని ఒక యూజర్ పేర్కొన్నారు. మరొకరు.. “ఈ రాయి నీటిలో ఎలా తేలుతుంది అనే విషయంలో ఆశ్చర్యం అవసరం లేదు. ఇది ప్యూమిస్ రాయి” అని కామెంట్స్ చేశారు.
సైన్స్ ప్రకారం.. 'ప్యూమిస్' అనే రాయి నీటిపై తేలుతుంది. ప్యూమిస్ రాయి లావా గట్టిపడిన రూపం. రాయి నీటి కంటే బరువైనది, కాబట్టి అది నీటిలో మునిగిపోతుంది, కానీ గాలి లోపల చిక్కుకున్నప్పుడు, అది రాయి బరువును తగ్గిస్తుంది. రాయి నీటిపై తేలుతుంది.
ఈ ఘటన మత విశ్వాసాలు లేదా వారి నమ్మకాలను నమ్మే వారికీ, శాస్త్రీయంగా ఆలోచించే వారికీ మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని బయటపెట్టింది. గంగా నదిలో తేలుతున్న ఈ రాయి విషయంలో జనాల్లో ఆసక్తి పెరుగుతున్నప్పటికీ.. ఇది ప్రకృతిలో సహజంగా ఏర్పడే ఒక రకం రాయి మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.