Supreme Court: పిల్లల విషయంలో సుప్రీం కోర్టు చెప్పినట్లు జరుగుతుందా?
Supreme Court: పిల్లలు సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ ప్రమాదాల నుంచి పిల్లలను కాపాడాలంటే ఇంటర్నెట్కు దూరం చేయడం పరిష్కారం కాదని స్పష్టం చేసింది. పిల్లల భద్రతతో పాటు వారి స్వేచ్ఛను కాపాడాల్సిందేనని పేర్కొంది.

ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు
ఈరోజుల్లో ఇంటర్నెట్ లేనిదే పని జరగదు. తినడానికి అన్నం లేకపోయినా కుదురుతుంది గానీ....ఇంటర్నెట్ లేకపోతే కుదరదు. అలా ఉంది పరిస్థితి. పెద్దవాళ్లైనా, చిన్న పిల్లలైనా ఫోన్ ఉండాల్సిందే. పిల్లలు అన్నం తినాలంటే నెట్, వర్క్ చేయాలంటే నెట్.. ఇంకా ఫోన్ అనేది ఎక్కువగా పిల్లల దగ్గరే ఉంటోంది. అయితే ఇదే విషయంలో ఇంటర్నెట్ వినియోగం ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఈ హక్కు పిల్లలకూ వర్తిస్తుందని తెలిపింది. పిల్లల భద్రత, వారి స్వేచ్ఛ ఒకదానికొకటి విరుద్ధమైనవి కావని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆన్లైన్ వేదికల్లో ప్రమాదాలు ఉన్నాయనే కారణంతో పిల్లలకు ఇంటర్నెట్ను పూర్తిగా నిరాకరించడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది.
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా, ఇతర ఆన్లైన్ వేదికల్లో పిల్లలపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించే వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఆదేశాలు జారీ చేసే క్రమంలో ఈ అంశాలను ప్రస్తావించింది.
సోషల్ మీడియా ఖాతాల్లో ‘చైల్డ్ మోడ్’!
పిల్లలు ఇంటర్నెట్ను ఉపయోగించకుండా అడ్డుకోవడం కంటే, వారు సురక్షితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం అవసరం అని సుప్రీంకోర్టు సూచించింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా ఖాతాలకు ‘చైల్డ్ మోడ్’ వంటివి పెట్టాలని సూచించింది. దీనివల్ల పిల్లలకు ఆన్లైన్లో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడంతో పాటు, వారి సమాచార హక్కును కూడా కాపాడవచ్చనే దిశగా కోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి.
ఆన్లైన్ వేదికల్లో హానికరమైన కంటెంట్‌ను గుర్తించి తొలగించడంలో ఆయా ప్లాట్‌ఫామ్‌లు విఫలమైతే, దాని ప్రభావాన్ని పిల్లలపై ఆంక్షలు విధించడం ద్వారా పరిష్కరించలేమని ధర్మాసనం పేర్కొంది. సమస్యను సృష్టిస్తున్న వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడంపైనే దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.
మారుమూల ప్రాంతాల్లో పిల్లలకు ఇంటర్నెట్టే ఆధారం
ఇంటర్నెట్ అనేది కేవలం సోషల్ మీడియా కోసం మాత్రమే కాదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. చదువు, సమాచారం, సృజనాత్మకత, భావప్రకటనకు ఇది కీలక వేదికగా మారిందని పేర్కొంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించే పిల్లలకు ఇంటర్నెట్ ఒక్కటే విద్య, సమాచారానికి ప్రధాన ఆధారంగా ఉండే సందర్భాలున్నాయని తెలిపింది.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కూడా ఆన్లైన్ వేదికలు ఉపయోగకరంగా ఉంటాయని ధర్మాసనం అభిప్రాయపడింది. తమలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడేందుకు, పరిచయాలు పెంచుకునేందుకు ఇవి అవకాశం కల్పిస్తాయని పేర్కొంది. అందువల్ల పిల్లల భద్రత పేరుతో వారి స్వేచ్ఛను పూర్తిగా పరిమితం చేయడం సరికాదని స్పష్టం చేసింది.
గత తీర్పులనూ ప్రస్తావించిన కోర్టు
2020లో అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇంటర్నెట్ ద్వారా భావప్రకటన స్వేచ్ఛ, వ్యాపారం నిర్వహించే స్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. అలాగే, 2025లో ప్రగ్యా ప్రసూన్ తదితరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిజిటల్ యాక్సెస్ హక్కును ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించిన అంశాన్ని కూడా ప్రస్తావించింది.
మొత్తంగా, పిల్లలను ఆన్లైన్ ప్రపంచం నుంచి పూర్తిగా దూరం చేయడం కాకుండా.. ఇంటర్నెట్లో వారి భద్రతకు తగిన రక్షణలు కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. సోషల్ మీడియా వేదికలు పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడంలో మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి ముందుకు తెచ్చాయి.

