దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు.. హై అలర్ట్
Airlines Bomb Threat: ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో దేశంలోని ఐదు ప్రధాన ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పేలుడు తర్వాత బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి బాంబు బెదిరింపు: దేశవ్యాప్తంగా అలర్ట్
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యాలయానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. బుధవారం పంపిన ఆ ఇమెయిల్‌లో, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్‌పోర్టులను పేల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో ఐదు ప్రధాన ఎయిర్‌పోర్టులలో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఢిల్లీ టర్మినల్-3లో కలకలం
బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టర్మినల్ 3లో బాంబు ఉందని అగ్నిమాపక శాఖకు కాల్ వచ్చింది. ఆ సమాచారం అందుకున్న వెంటనే భద్రతా సిబ్బంది టర్మినల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు జరిపి ఎటువంటి పేలుడు పదార్థం లభించలేదని నిర్ధారించింది. ఈ బెదిరింపు చివరికి హోక్స్‌గా తేలింది.
ఢిల్లీ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. “సమాచారం అందుకున్న వెంటనే అన్ని ప్రాంతాల్లో జాగ్రత్త తనిఖీలు చేపట్టాం. ఎటువంటి ప్రమాద సూచనలు లేవు” అని తెలిపారు.
వారణాసిలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్
ఇండిగో బెదిరింపుల మధ్యే మరో సంఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి వారణాసీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికులు మధ్యలో బాంబు బెదిరింపు సమాచారం రావడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే లాల్‌బహాదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది.
బాంబు నిర్వీర్య బృందం విమానాన్ని ఖాళీ చేయించి విస్తృత తనిఖీలు చేపట్టింది. ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనుగొనలేదు. అధికారులు ఈ బెదిరింపును కూడా హోక్స్‌గానే భావిస్తున్నారు.
తిరుచ్చి మంత్రుల ఇళ్లకు బెదిరింపులు, పోలీసుల దర్యాప్తు
అలాగే, తమిళనాడులోని తిరుచ్చిలో కూడా బాంబు బెదిరింపు కలకలం రేపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కే.ఎన్.నెహ్రూ, విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పోయమొజి నివాసాలపై ఇమెయిల్ బెదిరింపులు వచ్చాయి. చెన్నై పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి వచ్చిన ఈ సమాచారంతో తిరుచ్చి సిటీ పోలీసులు వెంటనే మంత్రుల ఇళ్ల వద్ద, కార్యాలయాల వద్ద తనిఖీలు నిర్వహించారు.
బాంబు నిర్వీర్య బృందం మంత్రుల నివాసాలు, కార్యాలయాలు, చత్రం బస్‌స్టాండ్ వద్ద ఉన్న కాలేజీ ప్రాంగణాలను కూడా పరిశీలించింది. ఈ బెదిరింపులు కూడా చివరకు హోక్స్‌గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీ బ్లాస్ట్ విచారణలో కొత్త మలుపు
ఇదిలా వుండగా, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కార్ బ్లాస్ట్ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఆ ఘటనలో 12 మంది మరణించగా, పలు వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. విచారణలో భాగంగా పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు, వీరిలో ముగ్గురు వైద్యులు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఢిల్లీ పోలీసులు మరో ముఖ్యమైన ఆధారాన్ని గుర్తించారు. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్‌లో నిందితులు వాడిన మరో వాహనం ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్ కోసం గాలిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసు తనిఖీలు కఠినతరం చేశారు.
దేశవ్యాప్తంగా భద్రతా బలగాల అలర్ట్
ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు వచ్చిన ఈ బెదిరింపులు, తిరుచ్చి మంత్రుల ఇళ్లకు వచ్చిన ఇమెయిల్స్, రెడ్ ఫోర్ట్ పేలుడు ఘటన.. ఇలా అన్ని ఘటనలు దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను మరింత అలర్ట్ చేశాయి. అన్ని ఎయిర్‌పోర్టులు, ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్రదేశాల్లో భద్రతా తనిఖీలు కఠినతరం చేసినట్లు కేంద్ర భద్రతా సంస్థలు వెల్లడించాయి.