Indian Navy: శత్రు దేశాలకు దబిడి దిబిడే.. ఇండియన్ నేవీలో శక్తివంతమైన ఆయుధం
ఇండియన్ ఆర్మీ బలోపేతమవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇండియన్ నేవీ సరికొత్త రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ రాకెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియన్ నేవీ కీలక అడుగు
ఇండియన్ నేవీ మరో కీలక ముందడుగు వేసింది. శత్రు జలాంతర్గాములను సమీపంలోనే గుర్తించి తక్కువ సమయంలో తుపాకులతో ఎదుర్కొనే నూతన రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ రాకెట్‌కు పేరు ERASR (Extended Range Anti-Submarine Rocket). INS కవరత్తి నుంచి దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఇప్పటివరకు 17 రాకెట్లు ప్రయోగించగా, అన్నీ లక్ష్యాలను విజయవంతంగా చేధించాయి.
ERASR పరీక్ష విజయవంతం
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) రూపొందించిన ERASR రాకెట్‌ను జూన్ – జూలై 2025 మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న INS కవరత్తి నౌక నుంచి ప్రయోగించారు. మొత్తం 17 రాకెట్లు ప్రయోగించగా, వీటి ప్రయోగాల్లో టార్గెట్ రేంజ్, టైమింగ్ ఫ్యూజ్, వాటర్‌లో వార్‌హెడ్ పనితీరు మొదలైన లక్ష్యాలన్నీ విజయవంతమైనట్లు DRDO తెలిపింది.
ఈ రాకెట్ల ప్రయోగం ద్వారా శత్రు సబ్‌మెరైన్లను సమీపంలో ఉన్నప్పుడే గుర్తించి తక్షణమే ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని భారత్ సాధించింది.
ERASR ప్రత్యేకతలు ఏంటి?
ఈ రాకెట్ 500 మీటర్ల నుంచి 8.9 కిలోమీటర్ల వరకు శత్రు జలాంతర్గాములపై దాడి చేయగలదు. ఇది షార్ట్ రేంజ్ లేదా లాంగ్ రేంజ్ మోడ్‌లో పనిచేయగలదు. శత్రువు ఎక్కడ ఉన్నాడన్నదాన్ని బట్టి ప్రయోగాన్ని మారుస్తారు. అవసరాన్ని బట్టి ఒకే రాకెట్ లేదా ఒకేసారి పలు రాకెట్లు ప్రయోగించవచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న రష్యన్ RBU-6000 లాంచర్లు బదులు భవిష్యత్తులో ఇండియన్ రాకెట్ లాంచర్ (IRL) వ్యవస్థను వినియోగించనున్నారు.
పాత రష్యన్ సిస్టమ్ కంటే మెరుగైంది.
ఇండియన్ నేవీలో ఇప్పటివరకు RBU-6000 అనే సోవియట్ యాంటీ సబ్‌మెరిన్ రాకెట్లు వినియోగిస్తున్నాయి. ఇవి గరిష్ఠంగా 5 కిలోమీటర్ల దూరం వరకే పని చేస్తాయి. కానీ ERASR దాదాపు 9 కిలోమీటర్ల వరకు పని చేయగలదు. ఇది పూర్తిగా ఇండియాలోనే అభివృద్ధి చేసిన టెక్నాలజీ, అందువల్ల భారత్‌కు తక్కువ ఖర్చుతో అధిక భద్రత లభిస్తుంది.
భవిష్యత్తులో SMART మిస్సైల్
ERASRతో పాటు డీఆర్‌డీఓ మరో మెగా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది అదే SMART (Supersonic Missile Assisted Release of Torpedo). ఈ మిస్సైల్ ద్వారా టార్పీడోను 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో డ్రాప్ చేయవచ్చు. ఇది ప్రధానంగా సుదూర జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్నారు. 2024లో SMART టెస్ట్ విజయవంతమైంది.
భవిష్యత్తులో దీన్ని నౌకల నుంచి లేదా తీర ప్రాంతంలో ఉన్న కోస్టల్ బ్యాటరీల నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. SMART సిస్టమ్‌ను విజయవంతంగా అమలు చేయాలంటే, ముందు శత్రు జలాంతర్గాముల సుదూర ప్రాంతాల్లోనే గుర్తించగల సోనార్ వ్యవస్థలు కూడా మెరుగ్గా ఉండాలి.