తెలంగాణ, ఆంధ్రలో మరో తుపాను.. దూసుకొస్తున్న సేన్యార్.. ఐఎండీ బిగ్ అలర్ట్
Heavy Rain Senyar Cyclone : సేన్యార్ తుపాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది.

బే ఆఫ్ బెంగాల్‌లో అల్పపీడనం.. మరో తుపాను హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలు సైక్లోన్ మోంథా దాటికి ఇప్పటికీ కోలుకోకముందే, మరో కొత్త తుపాను హెచ్చరికతో ఆందోళన పెరిగింది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం, బే ఆఫ్ బెంగాల్ దక్షిణ–తూర్పు భాగంలో ఏర్పడుతున్న అల్ప పీడనం కారణంగా వచ్చే రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ అల్ప పీడనం పశ్చిమ–వాయువ్య దిశగా కదలుతూ 24వ తేదీకి తీవ్రంగా మారనుంది. అనంతరం దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించి, వచ్చే 48 గంటల్లో ‘సేన్యార్’ పేరుతో తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
అప్రమత్తంగా తెలుగు రాష్ట్రాలు
ఐఎండీ ప్రకారం.. నవంబర్ 26 నుండి ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా నవంబర్ 28న దక్షిణ తీర ప్రాంతాలు, రాయలసీమ సరిహద్దు జల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజు నెల్లూరు, కృష్ణా జిల్లాల వరకూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా.
తమిళనాడులో 24వ తేదీ నుంచే వర్షాలు ప్రారంభమవుతాయని, 26 వరకు నిరంతర వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, బంగాళాఖాతం మీదుగా ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల మార్పు కారణంగా తుపాను దిశలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తుపాను కాకినాడ, మచిలీపట్నం మధ్య భూభాగాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా.
రైతులకు హెచ్చరికలు
నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, రాయలసీమలో ఉన్న వరి సాగుదారులు, ఇతర రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. నీటి ముంపు ప్రమాదం ఉన్నందున పంటలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. వరి, పత్తి తదితర పంటలకు సంబంధించి అప్రమత్తత సూచనలు విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు
దక్షిణ రాష్ట్రాలు మాత్రమే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
అండమాన్–నికోబార్ దీవులు : నవంబర్ 23, 24 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ, గాలులు గంటకు 55 కిమీ వేగంతో వీచే అవకాశం వుందని ఐఎండీ హెచ్చరించింది.
తమిళనాడు, కేరళ : నవంబర్ 22 నుండి 26 వరకు వర్షాలు కురుస్తాయనీ, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది.
ఈశాన్య రాష్ట్రాలు: నాగాలాండ్, మణిపూర్, తూర్పు అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉంటాయి.
ఉత్తర భారతంతో చలి పంజా
ఢిల్లీ ఎన్సీఆర్ : చలి తీవ్రత పెరగగా, కాలుష్యం పరిస్థితిని మరింత దిగజార్చింది. నవంబర్ 22న కనిష్ట ఉష్ణోగ్రత 10–12°C, 23న మరో 1–2°C తగ్గే అవకాశం ఉంది..
జార్ఖండ్ : రాత్రి ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా 2 డిగ్రీలు పెరిగే అవకాశం. 23వ తేదీ నుండి మళ్లీ తగ్గుదల ఉంటుంది. 26–27న తీవ్ర చలి ఉంటుంది.
యూపీ : కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 9–13°C మధ్య, గరిష్ఠం 25–28°C మధ్య ఉంటాయి.
రాజస్థాన్, బీహార్ : బీహార్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత అధికం అయింది. పొగమంచు, చలి గాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌లో కూడా తీవ్ర శీతల వాతావరణం నమోదైంది.
నవంబర్ 25 వరకు వేగంగా వీచే గాలుల, తుపాను ప్రభావం కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఐఎండీ సూచించింది. తుపాను సేన్యార్ ప్రభావం వచ్చే వారం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

