Liquor policy: బీరు తాగే వయసును తగ్గించిన ప్రభుత్వం.. ఎవరు తాగొచ్చంటే
Liquor policy: మద్యం విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుందని తెలిసిందే. తక్కువ వయసున్న వారికి మద్యం అమ్మకాలను నిషేధిస్తూ చట్టాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ రాష్ట్రంలో బీరు తాగే వయసును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

బీరు తాగే వయసులో మార్పు
దేశ రాజధాని ఢిల్లీలో 21 ఏళ్లు నిండిన యువత బీరు తాగేందుకు అనుమతి పొందనున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో చట్టబద్ధ వయసు 25 ఏళ్లుగా ఉండగా, కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం దానిని తగ్గించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం శివారు పట్టణాలకు వెళ్తున్న యువతను ఆపడం. ఇప్పటి వరకు గుర్గ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో 21 ఏళ్లకే బీర్ అనుమతించగా, ఢిల్లీలో 25 ఏళ్లుగా ఉంది. దీంతో యువత శివార్లకు వెళ్లి బీరు తాగుతున్నారు.
కొత్త విధానంతో ప్రభుత్వ ప్రణాళిక
ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వానికి మద్యం ద్వారా సుమారు రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తోంది. కానీ కొత్త మార్పులతో ఈ సంఖ్య రూ.12 వేల కోట్ల వరకు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా లీగల్ ఏజ్ తగ్గించడం వల్ల మార్కెట్ విస్తరించి, ప్రభుత్వ రెవెన్యూ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రైవేట్ షాపులకు అనుమతి అవకాశాలు
కొత్త పాలసీలో భాగంగా ప్రైవేట్ మద్యం షాపులకు కూడా మళ్లీ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గతంలో ఈ ప్రయత్నం చేసినప్పుడు విమర్శలు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో మరోసారి చర్చలు జరుగుతున్నాయి. బ్రాండెడ్ మద్యం కొరత తగ్గించడంపైనా దృష్టి సారిస్తున్నారు.
ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో లావాదేవీలపై దృష్టి
గత కొన్నేళ్లుగా ఢిల్లీ శివారు పట్టణాల్లో రూ.5 నుండి రూ.7 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని అంచనా. ఈ వ్యాపారం స్థానిక ప్రభుత్వాలకు లాభం చేకూర్చినా, ఢిల్లీకి నష్టం కలిగించింది. కొత్త విధానం ద్వారా ఆ లావాదేవీలను ఢిల్లీకే మళ్లించాలన్నది ప్రభుత్వ వ్యూహం.
భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు
కొత్త పాలసీని మరో మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఎక్సైజ్ కమిటీ ప్రణాళిక వేసింది. స్కూల్స్, ఆసుపత్రులు, నివాస సముదాయాల నుంచి దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. అదనంగా, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో మద్యం విక్రయాలకు అవకాశం కల్పించనున్నారు.