శనివారం ఏం జరగనుంది.? లాక్‌డౌన్ తరహా నిబంధనలు ఎందుకు విధించారు.?
Delhi: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 10న నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

జంతర్ మంతర్ వద్ద నిరసనకు CJP పిలుపు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆందోళన చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఇతర సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా మద్ధతు తెలిపే అవకాశం ఉండటంతో పోలీసులు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
57 మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేత
నిరసనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 9 రాత్రి 9 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగవచ్చని తెలిపింది. రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, జనపథ్, ఐటీఓ, కాశ్మీర్ గేట్ వంటి కీలక స్టేషన్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. కొన్ని స్టేషన్లలో రైళ్ల మార్పిడి సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే, న్యూఢిల్లీ మెట్రో స్టేషన్‌కు సంబంధించి ప్రత్యేక ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
దుకాణాలు, కార్యాలయాలపై ఆంక్షలు..
నిరసనల ప్రభావం సెంట్రల్ ఢిల్లీలోని వ్యాపార ప్రాంతాలపైనా పడనుంది. ముఖ్యంగా కనాట్ ప్లేస్ పరిసరాల్లో దుకాణాలు, రెస్టారెంట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల కార్యకలాపాలపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. మరోవైపు, నిరసనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. కొన్ని రైళ్ల రాకపోకలను కూడా రద్దు చేయడం లేదా నియంత్రించడం వల్ల ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను ముందుగానే పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, దేశ రాజధాని మొత్తం పూర్తిగా బంద్ అవుతుందని అధికారిక ప్రకటన వెలువడలేదు.
రాత్రి 10 గంటల నుంచి ఇంటర్నెట్ సేవల నిలిపివేత
భద్రతా చర్యల్లో భాగంగా సెంట్రల్ ఢిల్లీలోని నిర్దిష్ట ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుంచి 24 గంటల పాటు, జనపథ్–కర్తవ్య పథ్ కూడలిని కేంద్రంగా చేసుకుని నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. నిరసనల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఆంక్షలు ఢిల్లీ మొత్తం కాకుండా నిర్దిష్ట పరిధిలో అమలు కానున్నాయి.
భారీగా పోలీసు బలగాల మోహరింపు..
నిరసనల సందర్భంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఢిల్లీలో భారీగా పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు సమాచారం. జంతర్ మంతర్, న్యూఢిల్లీ జిల్లాలోని కీలక ప్రాంతాలతో పాటు నగర సరిహద్దుల వద్ద కూడా భద్రతను పెంచారు. రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు, రాకపోకల నియంత్రణ చర్యలు చేపట్టారు.

