Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పటినుంచో తెలుసా?
Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు వరుసగా 6 రోజులు సెలవులు రానున్నాయి. ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె, సెలవుల వల్ల వరుసగా 6 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

వరుసగా 6 రోజులు ఎస్‌బీఐ క్లోజ్
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెతో పాటు వీక్లీ ఆఫ్స్, పండుగ సెలవులు అన్నీ కలిసి రావడంతో.. దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ బ్రాంచ్‌లు వరుసగా 6 రోజుల పాటు మూతపడనున్నాయి. రాబోయే 10 రోజుల్లోనే ఈ 6 రోజుల సెలవులు ఉండటం గమనార్హం.
దేశవ్యాప్తంగా ఎస్‌బీఐకి 23,270 బ్రాంచ్‌లు, 63,000 కంటే ఎక్కువ ఏటీఎంలు ఉన్నాయి. అలాగే 50 కోట్లకు పైగా ఖాతాదారులు ఉన్నారు. ఇంత పెద్ద నెట్‌వర్క్ ఉన్న బ్యాంక్ వరుసగా ఇన్ని రోజులు బంద్ కానుండటంతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. జీతాలు, పెన్షన్ వంటి పలు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నారు. అయితే దీనిపై బ్యాంక్ యాజమాన్యం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మే 25, 26 తేదీల్లో సమ్మె
ఎస్‌బీఐ ఉద్యోగుల యూనియన్ అయిన 'ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్' (AISBISF) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. మే 25, 26 తేదీల్లో (సోమవారం, మంగళవారం) రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.
ఈ కారణంగా ఆ రెండు రోజులు బ్యాంక్ బ్రాంచ్‌లలో ఎలాంటి పనులు జరగవు. ఈ సమ్మెకు ముందు కూడా పలు విడతలుగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు యూనియన్ స్పష్టం చేసింది.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే
ఉద్యోగ సంఘాలు బ్యాంక్ యాజమాన్యం ముందు 16 ప్రధాన డిమాండ్లను ఉంచాయి. అందులో ముఖ్యంగా కొత్త నియామకాలు చేపట్టడం, పెన్షన్ విధానంలో మార్పులు, ప్రమోషన్లు, ఉద్యోగులకు మెరుగైన పని వాతావరణాన్ని కల్పించడం వంటివి ఉన్నాయి. వీటితో పాటు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పై కూడా ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మె బాట పట్టారు.
ఆ 6 రోజులు ఎందుకు బంద్ అంటే?
బ్యాంకులు వరుసగా 6 రోజులు ఎందుకు మూతపడుతున్నాయో ఆ తేదీల వివరాలు ఇలా ఉన్నాయి..
• మే 23: నాలుగో శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
• మే 24: ఆదివారం సెలవు
• మే 25, 26: ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘాల సమ్మె కారణంగా పని దినాలు కావు.
• మే 27, 28: బక్రీద్ పండుగ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవు ప్రకటించింది. దీనివల్ల పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.
బక్రీద్ సెలవులు ఎక్కడెక్కడ?
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. మే 27న అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, గువహటి, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, కోహిమా, లక్నో, న్యూఢిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడ, షిమ్లా వంటి నగరాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. అలాగే మే 28న బేలాపూర్, బెంగళూరు, చెన్నై, జైపూర్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, పాట్నా, శ్రీనగర్ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు.
ఏ సేవలు ఆగుతాయి? ఏవి నడుస్తాయి?
వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్ కానుండటంతో కస్టమర్లకు క్యాష్ కష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. బ్రాంచ్‌లు మూతపడటం వల్ల నగదు విత్‌డ్రా, చెక్కుల డిపాజిట్, డిమాండ్ డ్రాఫ్ట్ తయారీ, లోన్ సంబంధిత పనులు, పాస్‌బుక్ అప్‌డేట్ వంటి సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం సేవలు మాత్రం ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కస్టమర్లు తమ ముఖ్యమైన బ్యాంక్ పనులను ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం మంచిది.

