- Home
- National
- Astha Poonia : ఇండియన్ నేవీకి తొలి మహిళా ఫైటర్ పైలట్ ను అందించింది మన వైజాగే ... ఎవరీ ఆస్థా పూనియా?
Astha Poonia : ఇండియన్ నేవీకి తొలి మహిళా ఫైటర్ పైలట్ ను అందించింది మన వైజాగే ... ఎవరీ ఆస్థా పూనియా?
సబ్ లెప్టినెంట్ ఆస్థా పూనియా నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని నేవీ ఎయిర్ ఫోర్స్ కేంద్రం INS డేగాలో శిక్షణ పూర్తి చేసిన ఈమె మిగ్-29K యుద్ద విమానం నడిపేందుకు సిద్ధమయ్యారు.

ఇండియన్ నేవీలో 'నారీ శక్తి'
Astha Poonia : భారత ఆర్మీలో మహిళలకు మరింత ఎక్కువగా భాగస్వామ్యం కల్పిస్తోంది మోదీ సర్కార్. ఇప్పటికే త్రివిధ దళాల్లో మహిళలకు ఉన్నతమైన స్థానాల్లో నియమించి కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్ళి మరీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో మహిళా జవాన్లు కీలకంగా వ్యవహరించారు... ఈ ఆపరేషన్ గురించి, పాకిస్థాన్ పై దాడుల గురించి యావత్ దేశానికి తెలియజేసే బాధ్యతను కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కు అప్పగించింది. ఇదిచాలు ప్రభుత్వం సైన్యంలో మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి.
తాజాగా మరో మహిళ ఇండియన్ నేవీలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. సబ్ లెప్టినెంట్ ఆస్థా పూనియా నేవీ పైటర్ పైలట్ గా శిక్షణపొందిన తొలి మహిళగా నిలిచారు. విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగాలో జరిగిన స్నాతకోత్సవంలో పూనియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
జులై 3న వైజాగ్ లోని భారత నౌకాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ డేగాలో సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్సు స్నాతకోత్సవం జరిగింది. ఇందులో గ్రాడ్యుయేట్ సాధించిన పూనియాకు రియర్ అడ్మిరల్ జనక్ బెవ్లీ 'వింగ్స్ ఆఫ్ గోల్డ్' పురస్కారం అందజేసారు. లెఫ్టినెంట్ అతుల్ కుమార్ ధుల్ తో కలిసి ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
A New Chapter in Naval Aviation#IndianNavy marks a historic milestone with the graduation of the Second Basic Hawk Conversion Course on #03Jul 2025 at @IN_Dega.
Lt Atul Kumar Dhull and Slt Aastha Poonia received the prestigious 'Wings of Gold' from RAdm Janak Bevli, ACNS (Air).… pic.twitter.com/awMUQGQ4wS— SpokespersonNavy (@indiannavy) July 4, 2025
పూనియా ఏ పైటర్ జెట్ నడపనున్నారు?
ఒకప్పుడు ఇండియన్ ఆర్మీలో మహిళలకు ఎక్కువగా అవకాశాలు వచ్చేవికావు... అయితే మోదీ సర్కార్ 'నారీ శక్తి' నినాదంతో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తోంది. దీంతో గత దశాబ్దకాలంలో త్రివిధదళాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. చివరకు యుద్ద సమయాల్లో ఉపయోగించే పైటర్ జెట్లను నడిపే పైలట్లుగా మహిళలకు అవకాశం ఇస్తున్నారు.
ఇలా ఇప్పటికే పలువురు మహిళలకు ఇండియన్ ఎయిర్ పోర్స్ లో పైటర్ జెట్స్ నడిపే అవకాశం వచ్చింది. అయితే ఇండియన్ నేవీలో మాత్రం ఈ అవకాశం ఆస్థా పూనియాకు దక్కుతోంది. ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న ఆమె నావికాదళంలోని ఫైటర్ జెట్ మిగ్-29K నడపనున్నారు.
రాఫెల్ ను కూడా నడపనుందా?
ఈ మిగ్ 29K పైటర్ జెట్స్ రష్యా నుండి కొనుగోలు చేసింది ఇండియా. ప్రస్తుతం ఇండియన్ నేవీ ఈ విమానాలను ఉపయోగిస్తోంది. ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ (M) విమానాలను కూడా నౌకాదళం కొనుగోలు చేస్తోంది. వీటిని ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లో మోహరించనున్నారు. వీటిని నడిపే అవకాశం కుడా పూనియాకు రావచ్చు.
2028 నుంచి 2030 వరకు భారత నౌకాదళం రాఫెల్ (M) విమానాలను అందుకోనుంది. 2025 ఏప్రిల్‌లో ఫ్రెంచ్ ఏరోస్పేస్ సంస్థ డాసాల్ట్ ఏవియేషన్ తో 26 రాఫెల్ (M) విమానాల కొనుగోలుకు నౌకాదళం ఒప్పందం కుదుర్చుకుంది.
ఎవరీ సబ్ లెప్టినెంట్ ఆస్థా పూనియా?
ఆస్థా పూనియా విశాఖపట్నంలోని నౌకాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ డేగాలో పైటర్ పైలట్ గా శిక్షణ పొందారు. ఎంతో కఠినమైన ఈ శిక్షణను పూర్తిచేసుకుని ఇండియన్ నేవీ చరిత్రలో నిలిచిపోయేలా తొలి మహిళా పైటర్ పైలట్ గా నిలిచారు. ఆమె హాక్ 132 అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనర్‌పై శిక్షణ పూర్తి చేశారు. ఈ శిక్షణ పైలట్లకు యుద్ధ నైపుణ్యాలను అందిస్తుంది.
భారత నౌకాదళం ఇప్పటికే మహిళా అధికారులను పైలట్లుగా, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్లుగా ఎంఆర్ ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లలో నియమించింది. కానీ పైటర్ జెట్ పైలట్ గా మాత్రం ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదు... పూనియానే మొదటి మహిళ. పైటర్ విభాగంలో ఆస్థా పూనియా నియామకం నౌకాదళంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో భారత నౌకాదళ నిబద్ధతకు, నారీ శక్తిని ప్రోత్సహించడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
సాయుధ దళాల్లో సరికొత్త అధ్యాయం
గత దశాబ్ద కాలంలో భారత సాయుధ దళాలలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుతం త్రివిధ దళాల్లో 11,000 మందికి పైగా మహిళలు సేవలందిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత సైన్యంలోనే అత్యధికంగా మహిళలు ఉన్నారు.
2016లో భారత వైమానిక దళం మొదటిసారిగా ముగ్గురు మహిళా అధికారులు అవని చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్ లను ఫైటర్ విభాగంలో నియమించింది. 2022లో భారత నౌకాదళం జలాంతర్గాములు, ఏవియేషన్ విభాగంలో మహిళా అధికారులను నియమించింది. ఇప్పటికే చాలా మంది మహిళలు నౌకలు, ఏవియేషన్ విభాగాలలో సేవలందిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం భారత సైన్యం మిలిటరీ పోలీస్ విభాగంలో మహిళలను నియమించడం ప్రారంభించింది. ప్రస్తుతం సుమారు 1,700 మంది మహిళా అధికారులు వివిధ విభాగాలలో సేవలందిస్తున్నారు. ఇన్‌ఫాంట్రీ, ఆర్మర్డ్, మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ వంటి యుద్ధ విభాగాలు తప్ప మిగతా అన్ని విభాగాలు మహిళా అధికారులకు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం భారత వైమానిక దళంలో మొత్తం 20 మంది మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు. ఇప్పుడు నౌకాదళంలో పైటర్ పైలట్ గా ఆస్థా పూనియా చేరారు. భవిష్యత్ లో మరింతమంది వీర వనితలు భారత సైన్యంలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. వీరందరికీ ఆస్థా పూనియా లాంటి మహిళలే ఆదర్శంగా నిలుస్తున్నారు.