8వ వేతన సంఘం బంపర్ అప్‌డేట్ ! DA బేసిక్‌లో కలుస్తుందా?
8th Pay Commission: 8వ వేతన సంఘంపై ఉద్యోగుల ఆసక్తి పెరిగింది. డీఏను బేసిక్ పేతో విలీనం చేస్తారా? వేతన మార్పులు ఎలా ఉంటాయి? అనే కీలక వివరాల పై చర్చ మొదలైంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

8వ వేతన సంఘం: ఉద్యోగులకు డీఏ విలీనం ఉంటుందా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం ఏర్పాటు, అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవరాత్రి, దీపావళికి ముందు నోటిఫికేషన్ వస్తుందని వారు ఆశించినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ఎటువంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 50 శాతం దాటిన తర్వాత వారి డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
8వ వేతన సంఘం అమలు
ప్రభుత్వం ప్రకారం, 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు 7వ వేతన సంఘం సిఫార్సులు డిసెంబర్ 31, 2025 వరకు వర్తిస్తాయి. కానీ ఇప్పటి వరకు కొత్త సంఘం అధికారికంగా ఏర్పడలేదు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.
డీఏ అంటే ఏమిటి? దానిని బేసిక్ పేతో కలిపే డిమాండ్ ఎందుకు?
డీఏ (Dearness Allowance) అనేది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అదనపు భత్యం. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించేందుకు ఇచ్చే భత్యం. ఎందుకంటే వస్తువుల ధరలు పెరిగినప్పుడు జీవన ఖర్చులకు కూడా పెరుగుతాయి. దీని భర్తీ కోసం డీఏను అందిస్తారు. ప్రతి ఆరు నెలలకోసారి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారంగా ప్రభుత్వం దీనిని పెంచుతూ ఉంటుంది.
ఉదాహరణకు బేసిక్ పే ₹50,000 అయితే, డీఏ 50% అంటే అదనంగా ₹25,000 వస్తుంది. మొత్తం జీతం ₹75,000 (ఇతర అలవెన్సులు కాకుండా). అయితే, గతంలో 50% డీఏకు చేరినప్పుడు దానిని బేసిక్ పేలో కలిపే ఆనవాయితీ ఉండేది. కానీ ఇప్పుడు అది పాటించడంలేదు. ఉద్యోగ సంఘాలు దీన్ని పునరుద్ధరించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మార్పుతో వేతనాల పెరుగుదల
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ద్వారా ఉద్యోగుల వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘంలో ఇది 2.57 గా ఉంది. 8వ వేతన సంఘంలో దీన్ని 2.86 కి పెంచే అవకాశం ఉంది. దీని ప్రకారం వేతన మార్పులు (ఉదాహరణకు):
• లెవల్ 1: ₹18,000 → ₹51,480
• లెవల్ 5: ₹29,200 → ₹83,512
• లెవల్ 10: ₹56,100 → ₹1,60,446
• లెవల్ 13A: ₹1,31,100 → ₹3,74,946
• లెవల్ 18: ₹2,50,000 → ₹7,15,000
పెన్షనర్లు కూడా లబ్ధి పొందుతారు. కనిష్ఠ పెన్షన్ సుమారుగా ₹25,740 కు చేరే అవకాశముంది.
ఎవరికెంత ప్రయోజనం?
ఈ వేతన సంఘం దాదాపు 5 మిలియన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 6.5 మిలియన్ పెన్షనర్లకు లబ్ధి చేకూర్చనుంది. అంటే మొత్తం 11.5 మిలియన్ మంది దీనివల్ల ప్రత్యక్షంగా ప్రభావితమవుతారు. వేతనాలు, పెన్షన్లు 30% నుండి 34% వరకు పెరగవచ్చని అంచనా. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.83 నుండి 2.86 మధ్య ఉండే అవకాశం ఉంది.
డీఏ విలీనంపై కేంద్రం ఏం చెప్పింది?
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి డీఏను బేసిక్ పేతో కలిపే ఎలాంటి ప్రణాళికలు లేవు. అయితే ఇది ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో మళ్లీ ప్రస్తావనలోకి రావచ్చు. కానీ ఆమోదం పొందే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బేసిక్ పే లో డీఏ విలీనం, ఫిట్‌మెంట్ మార్పులు, కనిష్ఠ వేతన పెంపు తదితర అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలు వచ్చే నెలలలో వెలువడవచ్చనే చర్చ సాగుతోంది.