Ghee: ముఖానికి నెయ్యితో మసాజ్ చేస్తే మీరు ఏ క్రీములు వాడాల్సిన అవసరం లేదు
Ghee: ఆయుర్వేదంలో నెయ్యికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అలాగే ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మ ఆరోగ్యము మెరుగు పెరుగుతుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

దేశీ నెయ్యి ఒక అమృతం
ఆయుర్వేదంలో నెయ్యిని అమృతంతో పోలుస్తారు.. ఎందుకంటే ఇది శరీరాన్ని, మనసును, ఆత్మను కూడా శుద్ధిపరుస్తుంది. అంతేకాదు దీనిలో పోషకాలు కూడా ఎక్కువ. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నెయ్యి రోజుకు స్పూన్ తీసుకోవడం వల్ల శరీరం, మనసు రెండింటికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకారం నెయ్యి కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా వాడాలి. తరతరాలుగా భారతీయుల ఇళల్లో దేశీ నెయ్యి సిద్ధమవుతూనే ఉంది.
నెయ్యిలో పోషకాలు
ఆయుర్వేద ప్రకారం నెయ్యిని సరైన సమయంలో సరైన పరిమాణంలో తీసుకుంటే అది అమృతంతోనే సమానం. దీన్ని తీసుకోవడం ద్వారా ఎముకలను బలంగా మార్చుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచవచ్చు. అలాగే దీనికి చర్మాన్ని ప్రకాశవంతం చేసే శక్తి కూడా ఉంది. నెయ్యిని తినడం వల్ల జీర్ణాశయంలోని అగ్ని ప్రేరేపిస్తుంది. పోషకాలను గ్రహించడానికి పేగులకు సహకరిస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు త్వరగా దాడి చేయకుండా అడ్డుకుంటుంది. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కె వంటివి ఉంటాయి. ఇవి మొక్కలను బలంగా మారుస్తాయి. కీళ్లవాపులు, కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు కూడా రాకుండా అడ్డుకుంటాయి.
నెయ్యితో మసాజ్
ఇప్పుడు జీవితం చాలా బిజీగా మారిపోయింది. ఒత్తిడి, ఆందోళన ఎక్కువైపోయాయి. ఇవి మనసును ప్రశాంతంగా ఉండనివ్వవు. మనసు ప్రశాంతంగా ఉండకపోతే చర్మంలో మెరుపు మాయమవుతుంది. నెయ్యి చర్మానికి, జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. నెయ్యిని ప్రతిరోజు ఒక స్పూన్ తినడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. పొడి చర్మం, ముడతలు, మచ్చలు వంటివి కూడా తగ్గుతాయి. అలాగే నెయ్యిని అర స్పూన్ తీసుకొని మీ ముఖానికి కాసేపు మసాజ్ చేస్తే లోతుగా పోషణ జరుగుతుంది. నెయ్యిలో సత్వ గుణాలు ఉంటాయి. ఇవి మీలో సానుకూల శక్తిని పెంచుతాయి. చర్మం పైన మలినాలను కూడా తొలగిస్తాయి.
ఎన్ని లాభాలో
రెగ్యులర్ నెయ్యితో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుబడి ముఖానికి సహజమైన కాంతి వస్తుంది. నెయ్యిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఈ.. చర్మాన్ని పోషించి యాంటీ ఏజింగ్ లక్షణాలను అందిస్తుంది. చలికాలంలో చర్మం పగిలిపోకుండా కూడా నెయ్యి కాపాడుతుంది. నెయ్యిలో సహజమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మానికి మంచి మాయిశ్చరైజర్ లాగా పని చేస్తాయి. కెమికల్స్ లేని సహజ పదార్థం నెయ్యి. కాబట్టి దీని వల్ల ఎవరికి అలర్జీలు వంటివి రావు. అయితే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు మాత్రం నెయ్యిని తక్కువగా ముఖానికి రాస్తే మంచిది. లేకుంటే రంధ్రాలు మూసుకుపోయి, మొటిమలు పెరిగే అవకాశం ఉంటుంది. వారానికి ఒకటి రెండు సార్లు నెయ్యితో మసాజ్ చేసుకుంటే సరిపోతుంది.

