Hair Care: చలికాలంలో జుట్టు ఎండుగడ్డిలా మారిపోతోందా? ఈ ఒక్క నూనెతో ఆ సమస్యకు చెక్..!
Hair Care: చలికాలంలో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. చల్లటి గాలులకు జుట్టు ఎండు గడ్డిలా మారిపోయి.. అంద విహీనంగా కనపడుతుంది. అయితే, ఈ సమస్యకు జస్ట్ ఒకే ఒక్క నూనెతో చెక్ పెట్టొచ్చు.

Winter Hair Care
ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అనే వయసు తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నవారే. ఇక, చలికాలం వస్తే చాలు... జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుంది. జుట్టు రాలడమే కాదు... ఎండు గడ్డిలా మారుతుంది. జుట్టులో జీవం కూడా ఉండదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అందరూ ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. అయినా ఫలితం రాకపోతే.. మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలు, షాంపూలకు చెక్ పెట్టి.. వాటి స్థానంలో మునగాకు వాడితే చాలు. మరీ ముఖ్యంగా, మునగాకు నూనె వాడితే.. జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చని తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం...
మునగాకులో పోషకాలు...
మునగాకులో విటమిన్ ఎ, సి, ఇ తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు లోతైన తేమని అందించి..జుట్టును అందంగా మారుస్తాయి.
మునగాకు నూనె ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి?
కావలసిన పదార్థాలు:
పచ్చి మునగాకు – 1 కప్పు (లేదా మునగాకు పొడి - 2 స్పూన్లు)
స్వచ్ఛమైన కొబ్బరి నూనె – 1 కప్పు
ఆముదం (Castor Oil) – 2 స్పూన్లు
తయారీ:
మునగాకును శుభ్రంగా కడిగి, ఎలాంటి నీటి చుక్కలు లేకుండా ఆరబెట్టి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొబ్బరి నూనె, ఆముదం, మునగాకు పేస్ట్ కలపాలి. దీనిని చిన్న మంటపై డబుల్ బాయిలర్ మెథడ్ లేదా నేరుగా సిమ్‌లో 10-15 నిమిషాలు వేడి చేయాలి. ఇప్పుడు ఈ నూనె ఎరుపు రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన నూనెను వడకట్టి గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.
ఈ నూనె జుట్టుకు ఎలా వాడాలి అంటే...
గోరువెచ్చని నూనెతో మసాజ్..
వారానికి 2 సార్లు ఈ మునగాకు నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేసి తల కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు బాగా రాసుకోవాలి. మునివేళ్లతో 10 నిమిషాలు మృదువుగా మసాజ్ చేయడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ పెరిగి జుట్టు మూలాల నుంచి బలపడుతుంది. నూనె రాసిన 45 నిమిషాల తర్వాత లేదా రాత్రంతా ఉంచి మరుసటి రోజు మైల్డ్ రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి.
హెయిర్ మాస్క్..
2 స్పూన్ల మునగాకు నూనె + 2 స్పూన్ల తాజా పెరుగు + 1 స్పూను తేనె. వీటన్నింటినీ మంచి మిశ్రమంలా కలుపుకోవాలి. తర్వాత.. దీనిని తలకు, జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇది చలికాలంలో పొడిబారిన జుట్టుకు నేచురల్ కండిషనర్‌లా పనిచేసి పట్టులా మృదువుగామారుస్తుంది.
హెయిర్ సీరమ్.
తలస్నానం చేసిన తర్వాత జుట్టు కొద్దిగా తడిగా ఉన్నప్పుడు, 2-3 చుక్కల మునగాకు నూనెను చేతుల్లో వేసుకొని కేవలం జుట్టు చివర్లకు మాత్రమే రాసుకోవాలి. ఇది జుట్టు చిట్లిపోకుండా రక్షించి, సిల్కీ మెరుపును ఇస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చలికాలంలో తలస్నానానికి అతి వేడి నీటిని వాడకూడదు. గోరువెచ్చని నీరు మాత్రమే వాడాలి. వేడి నీరు జుట్టులోని సహజ నూనెలను తొలగించి జుట్టును మరింత గడ్డిలా మారుస్తుంది. ఈ నూనెను క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు వాడితే చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు ఊడటం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.





