Tamarind: చింతపండు ఎందుకు తినాలి? అది తినకపోతే మన శరీరానికి ఏమైనా నష్టమా?
Tamarind: కూరల్లో రుచి కోసం చింతపండును వాడతాం. ఇది కేవలం రుచి కోసమే అనుకుంటారు చాలా మంది. చింతపండు తినకపోయినా మన శరీరానికి వచ్చిన నష్టమేమీ లేదనుకుంటారు. నిజానికి చింతపండులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

చింతపండు ఎందుకు తినాలి?
సాంబారు, పులిహోర వంటివాటి కోసమే ఎక్కువగా చింతపండును వాడుతూ ఉంటాము. కానీ దానిలో కూడా పోషకాలు ఉంటాయని మాత్రం ఎవరూ భావించరు. దాన్ని కేవలం పులుపు రుచి కోసం మాత్రమే అనుకుంటారు. చింతపండు తినకపోవడం వల్ల ఎలాంటి నష్టం లేదనుకుంటారు. నిజానికి చింతపండులో విటమిన్లు, మినరల్స్ నిండి ఉంటాయి. దీనిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
పేగుల ఆరోగ్యానికి
చింతపండులో పాలీఫెనాలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి అల్సర్లను నివారించి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కాలేయ ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా చింతపండులోని పోషకాలు ఉపయోగపడతాయి. కాలేయం కోసం డైట్‌లో చింతపండు చేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
చింతపండులో ఉండే మెగ్నీషియం మనకున్న నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. చింతపండులో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉండటం వల్ల రోజూ తింటే బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
చింతపండులో ఫ్లేవనాయిడ్లు ఉంటాయని ముందే చెప్పుకున్నాం. ఇవి శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుందని పరిశోధనల్లో తేలింది.
చింతపండులో ఫైబర్, టార్టారిక్ యాసిడ్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని నివారించి, జీర్ణరసాల ఉత్పత్తికి సాయపడతాయి. ఇందులోని పాలీఫెనాలిక్ కాంపౌండ్స్ పెప్టిక్ అల్సర్లను రాకుండా అడ్డుకుంటాయి.
చింతపండు నీటిని రోజూ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చింతపండులోని పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడి, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.
ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తే, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చింతపండు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

