మనదేశంలో మొబైల్ నంబర్లలో 10 అంకెలే ఎందుకుంటాయి? దీని వెనుక భారీ గణిత లెక్కలు
మన మొబైల్ నెంబర్లో సరిగ్గా పది నెంబర్లే ఉంటాయి. ఇలా పది నెంబర్లు ఉండాలని ఎవరు నిర్ణయించారు? పది నెంబర్లు మాత్రమే ఎందుకు ఉండాలి? దీని వెనుక భారీ గణిత లెక్కలు, మన దేశ జనాభా సంఖ్య ఆధారపడి ఉంది.

మొబైల్ నెంబర్లో 10 అంకెలే ఎందుకుంటాయి?
మనం ప్రతిరోజూ ఎంతోమందికి ఫోన్ కాల్స్ చేస్తుంటాం. ఫోన్ నంబర్‌లో ఒక్క అంకె తగ్గినా లేదా ఎక్కువైనా కాల్ కలవదు. అది చెల్లని నంబర్ అని చెబుతుంది. అయితే మనదేశంలో మొబైల్ నంబర్లను 8 లేదా 9 అంకెలకు కాకుండా సరిగ్గా 10 అంకెలుగానే ఎందుకు నిర్ణయించారో తెలుసా? ఇది సాధారణంగా తీసుకున్న నిర్ణయం కాదు.. దీని వెనుక భారీ గణిత లెక్కలు, మన దేశ జనాభా అవసరాలు, స్పష్టమైన టెలికాం ప్రణాళికలు ఉన్నాయి.
దేశ జనాభాను బట్టి
సాధారణంగా ఏ దేశమైనా తన జనాభా పరిమాణం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫోన్ నంబర్ల పొడవును నిర్ణయించుకుంటుంది.దీని వెనుక ఉన్న ముఖ్యమైన లెక్కలను గమనిస్తే 10 అంకెల నంబరింగ్ విధానం ద్వారా గరిష్టంగా 1,000 కోట్ల విభిన్న కాంబినేషన్ల నంబర్లను రూపొందించే అవకాశం ఉంటుంది. ఒకవేళ భారత్‌లో 9 అంకెల నంబర్లే ఉంటే, కేవలం 100 కోట్ల నంబర్లు మాత్రమే సాధ్యమయ్యేవి. మన దేశ జనాభా 140 కోట్లు దాటిపోవడమే కాకుండా, చాలామంది రెండు లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులను వాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో 9 అంకెల విధానం ఏమాత్రం సరిపోదు. అలాగని 11 అంకెలు పెడితే 10,000 కోట్ల విభిన్న నెంబర్లను రూపొందింవచ్చు. కానీ అది ప్రస్తుత అవసరం లేదు. అందుకే 10 అంకెల విధానాన్ని ఎంపిక చేసుకున్నారు
ఎవరు నిర్ణయిస్తారు?
ఈ 10 అంకెల మొబైల్ నంబర్ కేవలం ఒక గుర్తింపు సంఖ్య మాత్రమే కాదు, నెట్‌వర్క్ వ్యవస్థకు సంబంధించిన ఒక చిరునామా లాంటిది. ఇందులో మొదటి 4 లేదా 5 అంకెలు టెలికాం సర్కిల్ (రాష్ట్రం/ప్రాంతం), ఆపరేటర్ (జియో, ఎయిర్‌టెల్ వంటివి) వివరాలను తెలియజేస్తే, మిగిలిన 5 లేదా 6 అంకెలు సదరు వినియోగదారుడి వ్యక్తిగత గుర్తింపు సంఖ్యగా పనిచేస్తాయి. 1990ల కాలంలో మన దేశంలో ల్యాండ్‌లైన్ నంబర్లు 6 లేదా 7 అంకెలు మాత్రమే ఉండేవి. కానీ 2000 సంవత్సరం తర్వాత దేశంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది. వినియోగదారుల సంఖ్య భారీగా పెరగడంతో పాత విధానం సరిపోలేదు. దీంతో భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్ - TRAI) ‘నేషనల్ నంబరింగ్ ప్లాన్ 2003’ కింద దేశవ్యాప్తంగా 10 అంకెల మొబైల్ నంబర్ల విధానాన్ని అధికారికంగా అమలులోకి తెచ్చింది.

