- Home
- Life
- Chana Dal: శనగపప్పు తొందరగా ఉడకడం లేదా? ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే 10 నిమిషాల్లో మెత్తగా ఉడికిపోతుంది..!
Chana Dal: శనగపప్పు తొందరగా ఉడకడం లేదా? ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే 10 నిమిషాల్లో మెత్తగా ఉడికిపోతుంది..!
Chana Dal: కందిపప్పు, పెసరపప్పు ఉడికినంత ఈజీగా శనగపప్పు ఉడకదు. ఈ శనగపప్పు ఉడికించడానికి చాలా సమయం పడుతుంది. మరి, సింపుల్ గా ఈజీగా ఉడకాలంటే ఎలాంటి ట్రిక్స్ పాటించాలో తెలుసా?

శనగపప్పు తొందరగా ఉడకడం లేదా?
భారతీయ వంటకాల్లో పప్పులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. రెగ్యులర్ గా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పప్పును తమ భోజనంలో భాగం చేసుకుంటూ ఉంటారు. పప్పు రుచిగా ఉండటమే కాకుండా, శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, అన్ని రకాల పప్పులు ఒకేలా ఉడకవు. ముఖ్యంగా కందిపప్పు, పెసరపప్పు చాలా సులభంగా ఉడికేస్తాయి. కానీ, శనగపప్పు మాత్రం ఉడకడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అసలు, శనగపప్పు ఎందుకు అంత ఆలస్యంగా ఉడుకుతుంది? దీనిని త్వరగా ఉడికించాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
శనగపప్పు ఉడకడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది?
శనగలు సహజంగా చాలా గట్టిగా ఉంటాయి. దానిని రెండు ముక్కలుగా విడగొట్టి శనగపప్పు గా మార్చినా కూడా ఆ గట్టిదనం అలాగే ఉంటుంది. అందువల్ల నీరు లోపలికి వెళ్లడానికి ఇతర పప్పుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. పెసరపప్పు, కందిపప్పు వెంటనే నీరు పీల్చుకొని మెత్తగా మారుస్తాయి. దీని వల్ల, ఇవి తొందరగా ఉడుకుతాయి. కానీ, శనగపప్పు అలా కాదు. శనగపప్పులో ప్రోటీన్, కార్బో హైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మృదువుగా మార్చాలి అంటే.. వేడి, సమయం చాలా అవసరం.
శనగపప్పు త్వరగా, మెత్తగా ఉడకాలంటే ఏం చేయాలి?
వంట చేయడానికి కనీసం 30 నుంచి 40 నిమిషాల ముందు శనగపప్పును నీటిలో నానపెట్టాలి. వీలైతే గోరువెచ్చని నీటిలో నానపెడితే.. పప్పు ఇంకా తొందరగా ఉడుకుతుంది. వేడి నీటిలో వేస్తే... పప్పు త్వరగా నాని... తొందరగా ఉడుకుతుంది. నానపెట్టే సమయం లేదు.. అయినా పప్పు తొందరగా ఉడకాలి అంటే.. చిటికెడు బేకింగ్ సోడా వేస్తే సరిపోతుంది. ఇది పప్పు గట్టితనాన్ని తగ్గించి, త్వరగా మెత్తగా ఉడికేలా చేస్తుంది. అయితే, బేకింగ్ సోడా మరీ ఎక్కువగా మాత్రం వేయకూడదు. ఎక్కువ వేస్తే.. పప్పు రుచి తగ్గిపోతుంది. కాబట్టి, చిటికెడు మించి వేయకూడదు.
ఒకవేళ మీరు శనగపప్పును కుక్కర్ లో ఉడికించాలి అనుకుంటే.. సాధారణ నీటికి బదులు, వేడి లేదా మరిగించిన నీటిని వాడాలి. అప్పుడు తొందరగా ఉడుకుతుంది.
శనగపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
శనగపప్పు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని మన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి
శనగపప్పులో ఫైబర్, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. ఇందులో ప్రోటీన్లు , ఫైబర్ ఎక్కువ శాతంలో ఉంటాయి. ఇది త్వరగా కడుపు నిండిన భావనాన్ని కలిగించి, తరచూ ఆహారం తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా సహాయపడుతుంది. శనగపప్పు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నెమ్మదిగా విడుదలయ్యేలా సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. మలబద్దకం సమస్య తగ్గుతుంది. అంతేకాదు, ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు , ఐరన్ ఉండటం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది, అలసట తగ్గుతుంది. కాబట్టి, ఈ శనగపప్పును ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకోవాలి.

