Rain: మన దేశంలో సంవత్సరమంతా వర్షం పడే ప్రదేశం ఇది...!
Rain: సంవత్సరంలో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా, ఏడాది పొడవునా వర్షం పడే ప్రదేశం ఒకటి మన దేశంలోనే ఉంది. ఇక్కడ మీరు ఎంత వెతికినా పొడిగా ఉండే ప్లేస్ కూడా దొరకదు.

సంవత్సరం పొడవునా వర్షమే..
వర్షం అంటే ఇష్టం లేనివాళ్లు చాలా అరుదు. అప్పుడప్పుడు సరదాగా వర్షంలో తడుస్తూ ఆడుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాదు.. బయట జోరున వర్షం పడుతుంటే.. ఇంట్లో వేడి వేడి గా పకోడీలు తింటూ, టీ తాగుతుంటే వచ్చే హాయి అంతా ఇంతా కాదు. అప్పుడప్పుడు వర్షం పడే మనకు ఇలా సరదాగానే ఉంటుంది. మనకు వరసగా నాలుగు రోజులు ఆగకుండా వర్షం పడితే... ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టడానికి లేదని ఇబ్బంది పడతాం. కానీ, ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా... సంవత్సరమంతా వర్షం పడితే ఎలా ఉంటుంది? అలాంటి ప్రదేశం ఒకటి మన దేశంలోనే ఉంది. ఇక్కడ ఎంతలా వర్షం పడుతుంటే.. గొడుగు చేతిలో లేకుండా.. ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టలేరు. అంతేకాదు.. మీకు ఎంత వెతికినా.. అక్కడ ఒక్కచోట కూడా పొడి ప్రదేశం ఉండదు. సంవత్సరమంతా తడిగానే ఉంటుంది.
మన దేశంలో తడిగా ఉండే ప్రదేశం..
భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మావ్సిన్రామ్ లో నిత్యం వర్షాలు పడుతూనే ఉంటాయి. ఇక్కడ సగటున ప్రతి సంవత్సరం దాదాపు 11,800 మిమి వర్షం కురుస్తుంది. అంటే.. ఇక్కడ పడే వర్షాన్ని లెక్కకట్టి చూస్తే దాదాపు 12 మీటర్ల ఎత్తు వస్తుంది.
ఇక్కడ ఇంత వర్షం ఎందుకు కురుస్తుంది?
ఇక్కడ సంవత్సరమంతా వర్షం కురవడం వెనక సైన్స్ దాగి ఉంది. బంగాళాఖాతం వైపు నుంచి తేమను మోసుకుంటూ వచ్చే రుతుపవన గాలులు మేఘాలయలోని ఖాసీ కొండలను ఢీకొంటాయి. ఆ కొండల అడ్డుగా నిలవడం వల్ల ఆ తేమతో కూడిన గాలులు ఒక్కసారిగా పైకి ఎగసి చల్లగా మారతాయి. దాంతో మేఘాల్లోని నీటి ఆవిరి కాస్తా భారీ వర్షంగా కురుస్తుంది.
భౌగోళిక శాస్త్రంలో ఈ ప్రక్రియను 'ఓరోగ్రాఫిక్ లిఫ్ట్' (Orographic Lift) అంటారు. ఖాసీ కొండల ప్రత్యేక ఆకృతి కారణంగా మావ్సిన్రామ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ప్రపంచంలోనే అత్యంత తడిగా ఉండే ప్రాంతాలుగా నిలిచాయి. ఇక్కడ వర్షం పడుతున్నప్పుడు ప్రయాణం చేయడం అంటే సామాన్యుల పని కాదు. కొన్నిసార్లు రోడ్లపైకి కొండల నుంచి నేరుగా జలపాతాలు కిందకు జారే అద్భుత దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి.
చిన్నప్పటి నుంచి స్కూల్లో మనం చదువుకున్న దాని ప్రకారం.. అత్యధిక వర్షపాతం అనగానే చిరపుంజీ గర్తుకు వస్తుంది. అక్కడ 1861 జూలైలో కేవలం ఒక్క నెలలోనే అక్కడ ఏకంగా 9,300 మి.మీ. వర్షం కురిసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అయితే, దీర్ఘకాలిక సగటు వార్షిక వర్షపాతం లెక్కల ప్రకారం ప్రస్తుతం మావ్సిన్రామ్ ప్రపంచంలోనే అత్యంత వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా అగ్రస్థానంలో ఉంది. మావ్సిన్రామ్ అనగానే కేవలం వానలే గుర్తుకొస్తాయి కానీ, ఇక్కడ ప్రకృతి సృష్టించిన మరో అద్భుతం సున్నపురాతి గుహలు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన శాండ్‌స్టోన్ గుహ అయిన 'క్రెమ్ పూరి' ఇక్కడే ఉంది. అలాగే రాతి శిలలతో ఏర్పడిన 'మావ్జిమ్బుయిన్ గుహలు' పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక.. నిత్యం వర్షాలు కురుస్తూ ఉండటంతో ఇక్కడ ఎప్పుడూ దట్టమైన పచ్చదనం కళకళలాడుతూ ఉంటుంది. భూతల స్వర్గాన్ని తలపిస్తూ ఉంటుంది. ఇంత అందంగా ఉన్నా పర్యాటకులు ఇక్కడికి వెళ్లడానికి కాస్త భయపడుతూ ఉంటారు. ఎప్పుడు కొండచరియలు విరిగిపడతాయో అనే భయంతో ఎక్కువ మంది వెళ్లడానికి ఇష్టపడరు.

