- Home
- Life
- Sunrise Village: దేశమంతా నిద్రలో ఉంటే... ఈ గ్రామంలో తెల్లారిపోతుంది, సూర్యుడు ఉదయించే తొలి గ్రామం
Sunrise Village: దేశమంతా నిద్రలో ఉంటే... ఈ గ్రామంలో తెల్లారిపోతుంది, సూర్యుడు ఉదయించే తొలి గ్రామం
Sunrise Village: భారతదేశంలో సూర్యుడు అందరికంటే ముందు ఏ గ్రామంలో ఉదయిస్తాడో తెలుసా? దేశమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో... ఇక్కడ సూర్యుడి కిరణాలు పడతాయి. మరి ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసా?

మొదటి సూర్య కిరణాలు పడే గ్రామం..
భారత దేశం మొత్తం ఇంకా గాఢ నిద్రలో, చీకట్లో మునిగి ఉండానే... ఓ గ్రామంలో మాత్రం సూర్యుని తొలి కిరణాలు..నేలను తాకుతాయి. తెల్లవారుజామున 4 గంటలకే అక్కడ వెలుగులు విరజిమ్ముతాయి. ఆ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకోవడానికి చాలా మంది పర్యాటకులు అర్థరాత్రే నిద్రలేచి కొండల మీదకు ఎక్కుతారు. ఆ దృశ్యం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మరి, ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఆ గ్రామంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూద్దాం...
అరుదైన గ్రామం...
దేశంలో మొట్టమొదటగా సూర్యోదయం జరిగే ప్రాంతం.. అరుణాచల్ ప్రదేశ్ లోని అంజా జిల్లాలో, లోహిత్ నది ఒడ్డున ఉన్న దోంగ్ వ్యాలీ గ్రామం. చైనా-మయన్మార్ సరిహద్దులకు సమీపంలో, వాలోంగ్ పట్టణానికి దగ్గరగా ఉన్న ఈ మారుమూల చిన్న గ్రామంలోనే భారతదేశపు తొలి సూర్యోదయం సంభవిస్తుంది. 1999లో దోంగ్ వ్యాలీని భారతదేశపు మొట్టమొదటి సూర్యోదయ స్థలంగా గుర్తించారు. ముఖ్యంగా 2000వ సంవత్సరం జనవరి 1న శతాబ్దపు తొలి సూర్య కిరణాలు చూడటానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలిరావడంతో ఈ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది.
అర్థరాత్రి సాహసయాత్ర...
ఈ గ్రామంలో సూర్యోదయం చూడటం ఓ సాహసంతో కూడిన అనుభూతి అని చెప్పొచ్చు. సూర్య కిరణాలు భూమిని తాకడాన్ని కళ్లారా చూడాలని అక్కడికి వచ్చిన పర్యాటకులు సాధారణంగా తెల్లవారుజామున 2:30 లేదా 3:00 గంటలకే ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు. దట్టమైన అడవులు, కొండదారుల మధ్య నడుస్తూ... కొండపై ఉన్న వ్యూపాయింట్ కు చేరుకుంటారు.
కాలాలను బట్టి ఇక్కడ తెల్లవారుజామున 4:00 నుండి 4:30 గంటల మధ్యలోనే సూర్యుడు ఉదయిస్తాడు. మిగతా భారతదేశమంతా ఇంకా నిద్రలో ఉండగానే.. ఇక్కడి లోయలు, మంచు కొండలు బంగారు వర్ణంలో మెరిసిపోవడం చాలా అందంగా కనపడుతుంది.
ఇక్కడ చూడాల్సిన మరికొన్ని అద్భుతాలు..
కేవలం సూర్యోదయం మాత్రమే కాదు.. ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలను చూడవచ్చు:
వాలోంగ్ (Walong): దోంగ్ వ్యాలీకి కేవలం 7 కి.మీ దూరంలో ఉన్న అందమైన చారిత్రక గ్రామం. 1962 నాటి భారత్-చైనా యుద్ధ స్మారకాలు ఇక్కడ ఉన్నాయి.
కిబితు (Kibithu): భారతదేశపు అత్యంత తూర్పు సరిహద్దు గ్రామం. సరిహద్దు జీవన విధానం, ప్రకృతి అందాలు ఇక్కడ కట్టిపడేస్తాయి.
లోహిత్ నది (Lohit River): లోయ గుండా ప్రవహించే ఈ నది చుట్టూ ఉన్న పైన్ అడవులు శీతాకాలంలో మరింత అందంగా కనిపిస్తాయి.
మేయోర్ తెగ సంస్కృతి: స్థానిక 'మేయోర్' (Meyor) గిరిజన తెగ ప్రజల సంస్కృతి, వారి జీవనశైలిని దగ్గరగా పరిశీలించవచ్చు.
సన్ రైజ్ ఫెస్టివల్...
దోంగ్ సూర్యోదయ విశిష్ఠతను ప్రపంచానికి చాటడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 29 నుండి జనవరి 2 వరకు ప్రత్యేకంగా సన్ రైజ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ ఉత్సవంలో గైడెడ్ సన్ రైజ్ ట్రెక్ లు, స్థానిక నృత్యాలు, సాంప్రదాయ వంటకాలు, హస్తకళల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.













