Milk: ఆవు పాలా? గేదె పాలా? మేక పాలా?...పిల్లలకు ఏది మంచిది?
Milk: ఉదయం లేవగానే పిల్లలకు గ్లాసుడు పాలు ఇవ్వడం చాలా మందికి అలవాటు. కానీ పిల్లల ఎదుగుదలకు ఏది బెటర్? ఆవు పాలు, గేదె పాలు, మేకపాలు... ఈ మూడింట్లో దేంట్లో కొవ్వు, ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయో చూద్దాం.

ఆరోగ్యానికి ఏది మంచిది?
బ్రేక్ ఫాస్ట్ లో పాలు తాగడం మన దగ్గర కామన్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పాలు తాగుతుంటారు. కానీ ఆవు పాలు, గేదె పాలు, మేక పాలు ఈ మూడింట్లో ఒకే రకమైన పోషకాలు ఉండవు. కొవ్వు, ప్రోటీన్, కాల్షియం, క్యాలరీలు ఒక్కో దాంట్లో ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా గేదె పాలలో కొవ్వు, క్యాలరీలు ఎక్కువ. ఆవు పాలలో కొవ్వు తక్కువ. మేక పాలలో కూడా ప్రోటీన్, కాల్షియం లాంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఏ పాలు మంచివి అనడం కంటే, మన శరీరానికి ఏవి సరిపోతాయో తెలుసుకోవడం ముఖ్యం.
ఆవు పాలు తాగితే లాభమేంటి?
గేదె పాలతో పోలిస్తే ఆవు పాలలో కొవ్వు, క్యాలరీలు తక్కువ. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12 లాంటివి ఇందులో దొరుకుతాయి. బరువు తగ్గాలి, కొవ్వు కంట్రోల్ చేసుకోవాలి అనుకునేవాళ్లు ఆవు పాలు తాగొచ్చు. అయితే పాలలో ఉండే పోషకాలు వాటి కొవ్వు శాతం, పశువుల ఆహారం, జాతిని బట్టి మారుతుంటాయి. కాబట్టి అన్ని ఆవు పాలలో ఒకే రకమైన పోషకాలు ఉంటాయని చెప్పలేం.
గేదె పాలలో పోషకాలు ఎక్కువా?
గేదె పాలు చిక్కగా ఉంటాయి, కొవ్వు కూడా ఎక్కువే. ఆవు పాలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, క్యాలరీలు ఎక్కువ. ఎక్కువ ఎనర్జీ కావాలనుకునేవాళ్లకు ఇవి బాగా ఉపయోగపడతాయి. పెరుగు, పన్నీర్, నెయ్యి లాంటివి చేయడానికి గేదె పాలు ఎక్కువ వాడతారు. బరువు కంట్రోల్ లో ఉంచుకోవాలనుకునేవాళ్లు మాత్రం కాస్త చూసుకోవాలి. ఇవి ఎక్కువ తాగితే క్యాలరీలు పెరుగుతాయి.
మేక పాల స్పెషాలిటీ ఏంటి?
మేక పాలు కూడా పోషకాల పరంగా మంచి ఆప్షనే. ఇందులో కూడా ప్రోటీన్, కొవ్వు, కాల్షియం దొరుకుతాయి. కొంతమందికి దీని టేస్ట్ నచ్చుతుంది. అలాగని మేక పాలు అందరికీ తొందరగా అరుగుతాయని గానీ, ఆవు పాలు పడనివాళ్లకు ఇవి సేఫ్ అని గానీ చెప్పలేం. ఈ మూడు రకాల పాలలోనూ లాక్టోస్ ఉంటుంది. కాబట్టి లాక్టోస్ పడని వాళ్లు డాక్టర్ సలహా తీసుకోవాలి.
మీకు ఏ పాలు సెట్ అవుతాయి?
కొవ్వు, క్యాలరీలు తక్కువ కావాలనుకునేవాళ్లు ఆవు పాలు తాగొచ్చు. కొంచెం ఎనర్జీ, ఫ్యాట్ కావాలనుకునేవాళ్లు గేదె పాలు ట్రై చేయొచ్చు. పోషకాలు, బాడీని బట్టి మేక పాలు కూడా వాడొచ్చు. కానీ ఏడాది లోపు పిల్లలకు ఆవు పాలు, గేదె పాలు ఇవ్వకూడదు, తల్లి పాలే బెస్ట్. ఏ పాలు తాగినా బాగా కాచి తాగడం లేదా పాశ్చరైజ్డ్ పాలు వాడటం ముఖ్యం.













