- Home
- Life
- Upma rava Vs Idli Rava: ఉప్మా రవ్వకు ఇడ్లీ రవ్వకు మధ్య తేడా ఏంటి? వీటిని దేనితో తయారుచేస్తారో తెలుసా?
Upma rava Vs Idli Rava: ఉప్మా రవ్వకు ఇడ్లీ రవ్వకు మధ్య తేడా ఏంటి? వీటిని దేనితో తయారుచేస్తారో తెలుసా?
Upma rava Vs Idli Rava: ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ రెండూ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తాయి. ఈ రెండూ లేకపోతే టిఫిన్లు వండడం పూర్తి కాదు. ఇడ్లీ నుంచి ఉప్మా వరకు ఈ రెండు రవ్వలు ఉండాల్సిందే. అయితే ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటో ఆలోచించారా?

ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ తయారీ
ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ రెండూ వంటింట్లో నిత్యం అవసరమైనవి. ఉప్మా, ఇడ్లీ, రవ్వ దోశె, ఊతప్పం ఇలా ఎన్నో టిఫిన్ల తయారీలో వీటి అవసరం ఉంటుంది. అయితే చాలా మందికి వీటిని ఎలా తయారు చేస్తారో మాత్రం తెలియదు. సాధారణంగా ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వను గోధుమలతో చేస్తారు. గోధుమలను మిల్లింగ్ చేసి నూకలా మార్చడం వల్ల ఇందులో గ్లూటెన్ ఉంటుంది. మరోవైపు ఇడ్లీ రవ్వను పూర్తిగా బియ్యంతో తయారు చేస్తారు. బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఆరబెట్టి, గరుగ్గా విసిరి తయారు చేయడం వల్ల ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది.
రవ్వల రంగులు వేరు
ఉప్మా, ఇడ్లీ రవ్వల రూపురేఖలు, వంట చేసే విధానం వేర్వేరుగా ఉంటాయి. ఉప్మా రవ్వ లేత పసుపు లేదా క్రీమ్ రంగులో ఉండి, కాస్త మెత్తటి ఇసుక రేణువులా అనిపిస్తుంది. వంట చేయడానికి ముందు దీనిని నూనె లేదా నేతిలో దోరగా వేయిస్తే మంచి రుచి వస్తుంది. అలా చేయకపోతే ఉప్మా ముద్దగా మారుతుంది. ఇడ్లీ రవ్వ తెల్లగా ఉండి, ముట్టుకుంటే కాస్త గరుగ్గా తగులుతుంది. దీనిని ఎప్పుడూ వేయించరు. వంటకు ముందు కాసేపు నీటిలో నానబెట్టి, మినప పిండిలో కలిపి వాడతారు.
రవ్వతో స్వీట్లు తయారీ
వంటకాల విషయంలో కూడా ఈ రెండింటి పాత్ర భిన్నంగా ఉంటుంది. ఉప్మా రవ్వతో కేసరి, రవ్వ లడ్డు వంటి స్వీట్లు కూడ చేసుకోవచ్చు. ఉప్మా రవ్వను పులియబెట్టాల్సిన పనిలేదు. ఇడ్లీ రవ్వను ముఖ్యంగా మెత్తని ఇడ్లీల కోసమే వాడతారు. మెత్తగా రుబ్బిన మినప్పిండిలో ఈ రవ్వను కలిపి, రాత్రంతా పులియబెట్టిన తర్వాతే ఆవిరిపై ఉడికిస్తారు. అందుకే ఒకదాని బదులు మరొకటి మార్చి వాడలేము. ఉప్మా రవ్వకు బదులు ఇడ్లీ రవ్వను వాడకూడదు. దేని లక్షణాలు దానికి ఉంటాయి.

