Biryani Pickle: ఈ పచ్చడి అన్నంలో కలిపి తింటే బిర్యానీలా ఉంటుంది.. ఎక్కడ దొరుకుతుందంటే..!
Biryani Pickle: వేడి వేడి అన్నంలో.. పచ్చడి వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ, ఆ పచ్చడి అన్నం బిర్యానీలా ఉంటే ఇంకా బాగుంటుంది కదా.. అలాంటి బిర్యానీ పచ్చడి కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? అది కూడా హైదరాబాద్ లోనే దొరుకుతుంది..

బిర్యానీ రుచి ఇచ్చే పచ్చడి...
భారతీయులకు పచ్చడి తో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం.. చాలా రకాల నిల్వ పచ్చళ్లు తయారు చేసుకొని... వాటిని సంవత్సరమంతా ఆస్వాదిస్తారు. ఇప్పటి వరకు మీరు చాలా రకాల పచ్చళ్లు రుచి చూసి ఉండొచ్చు. మామిడికాయ, టమాట, అల్లం, నిమ్మకాయ.. ఇలా చాలా రకాల పచ్చళ్లు మనం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. బయాట మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతూనే ఉంటాయి. కానీ, బిర్యానీ పచ్చడి అని ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తింటే... మీకు బిర్యానీ తిన్న అనుభూతి కలుగుతుంది. ఆ పచ్చడి మనకు హైదరాబాద్ లోనే లభిస్తుంది. ఈ బిర్యానీ పచ్చడి స్పెషాలిటీ ఏంటి? హైదరాబాద్ లో ఎక్కడ లభిస్తుంది..?
బిర్యానీ పచ్చడి ఎక్కడ దొరుకుతుందంటే...
హైదరాబాద్ లోని ముర్గీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఖదీప్ ఆచార్ ఘర్ అనే దుకాణంలో ఈ ప్రత్యేకమైన బిర్యానీ ఫ్లేవర్ ఉండే పచ్చడి అందుబాటులో ఉంది. ఈ దుకాణంలో.. మొత్తం 16 రకాల పచ్చళ్లు అందుబాటులో ఉండగా, అందులో ఈ బిర్యానీ పచ్చడి మాత్రం చాలా స్పెషల్. ఈ దుకాణం ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చినది ఏమీ కాదు. ఈ దుకాణాన్ని 1954 లో ప్రారంభించారు. మొదట్లో ఈ దుకాణంలో కేవలం పచ్చళ్లు కాకుండా.. ఇతర ఫుడ్స్ కూడా అమ్మేవారు. కానీ, పచ్చళ్లకు ఎక్కువ ఆదరణ రావడంతో... వాటిని మాత్రమే అమ్ముతూ వస్తున్నారు. వీళ్లు చాలా ఏళ్లుగా పచ్చళ్ల వ్యాపారంలో ఉండగా, కొన్ని సంవత్సరాల క్రితమే.. ఈ బిర్యానీ పచ్చడిని ప్రచారంలోకి తీసుకువచ్చారు.
బిర్యానీ రుచి పచ్చడిలోకి ఎలా వచ్చింది..?
హైదరాబాద్ బిర్యానీకి ఉన్న ప్రత్యేకమైన రుచిని పచ్చడి రూపంలో అందించాలనే ఆలోచనతోనే ఈ వైరైటీని తయారు చేశారు. ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న హైదరాబాదీలకు ఇంటి బిర్యానీ రుచిని గర్తు చేసేలా ఈ పచ్చడిని రూపొందించాలని ఆ దుకాణ యజమానులు చెబుతున్నారు. అయితే, ఈ పచ్చడి తయారీ అంత ఈజీ ఏమీ కాదు. సరైన రుచి, స్థిరత్వం రావడానికి వారికి కనీసం రెండు నెలలు పట్టిందంట. చాలా ప్రయోగాలు చేసిన తర్వాత వారు కోరుకున్న రుచి సాధ్యం అయ్యిందని వారు చెప్పారు.
20కి పైగా పదార్థాలతో పచ్చడి...
ఈ బిర్యానీ పచ్చడిలో ఏకంగా 20కి పైగా పదార్థాలను ఉపయోగిస్తారు. బిర్యానీలో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను ఇందులోనూ కలుపుతారు. లవంగాలు, చెక్క, వేయించిన ఉల్లిపాయలు, యాలకులు, జీడిపప్పు, దాల్చిన చెక్క వంటి పదార్థాలు ఈ పచ్చడికి ప్రత్యేకమైన రుచి, సువాసనను అందిస్తాయి. దీనిని అన్నంలో కలుపుకుంటే.. పూర్తిగా బిర్యానీ తిన్న ఫీల్ వస్తుంది. అయితే.. ప్రస్తుతానికి ఈ పచ్చడి వెజ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. నాన్ వెజ్ బిర్యానీ పచ్చడి మాత్రం అందుబాటులో లేదు. ఇక్కడ.. నాన్ వెబ్ బిర్యానీ పచ్చడి దొరకకపోవచ్చు. కానీ... నాన్ వెజ్ పచ్చళ్లు మాత్రం లభిస్తాయి. వీరు పచ్చడి అయినా.. తాజాగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఈ పచ్చళ్లు మీకు ఆన్ లైన్ లో కూడా లభిస్తాయి. మీరు, అక్కడ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.

