Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Banana: అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఈ పండు ఎప్పుడు తినాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రాత్రి పూట తింటే నిజంగా బరువు పెరుగుతారా?

రాత్రిపూట అరటి పండు తింటున్నారా?
అరటి పండు చాలా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం. అందుకే..చంటి పిల్లలకు కూడా మొదట ఈ పండునే అలవాటు చేస్తారు. అయితే.. ఈ పండుపై చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కొందరు ఈ పండును ఉదయాన్నే పరగడుపున తినకూడదు అంటారు. మరి కొందరు రాత్రి పూట తినకూడదు అంటారు. ఏది నిజం..? రాత్రి పూట తింటే నిద్ర పట్టదా? నిజంగానే బరువు పెరుగుతారా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
రాత్రిపూట తినవచ్చా లేదా?
ఆరోగ్యంగా ఉన్న ఏ వ్యక్తయినా రాత్రిపూట అరటిపండు తినవచ్చు. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే రాత్రి సమయంలో ఇది అందరిపై ఒకేలా పనిచేస్తుందని చెప్పలేం. ఇది మనం తినే పరిమాణం, సమయం, మొత్తం ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
నిద్రకు సహాయపడుతుందా?
అరటిపండ్లలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉన్నప్పటికీ, పడుకునే ముందు తినడం వల్ల మాత్రమే నిద్ర అద్భుతంగా మెరుగుపడుతుందని చెప్పలేం. ఒత్తిడి, స్క్రీన్ టైమ్, కాఫీ లేదా టీ తాగే అలవాట్లు, పడుకునే వేళ వంటి అనేక ఇతర అంశాలు కూడా నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి.
బరువు పెరుగుతారనే భయం నిజమేనా?
రాత్రిపూట అరటిపండు తిన్నంత మాత్రాన అకస్మాత్తుగా బరువు పెరిగే అవకాశం లేదు. బరువు నియంత్రణలో ఉండాలంటే రోజువారీ మొత్తం కేలరీల వినియోగం, శారీరక శ్రమ, సరైన ఆహారపు అలవాట్లు ముఖ్యం. అయితే, రాత్రి భోజనం తర్వాత కడుపు నిండినప్పటికీ అదనంగా అరటిపండ్లు లేదా ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోకి చేరే కేలరీలు పెరిగే ప్రమాదం ఉంది.
తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రాత్రిపూట తినొచ్చు. కానీ అయినప్పటికీ పరిమాణం చాలా ముఖ్యం. రాత్రి భోజనం చేసిన వెంటనే కడుపు నిండుగా ఉంటే అదనంగా అరటిపండు తినాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆకలిగా అనిపిస్తే మితంగా తీసుకోవచ్చు. అయితే పడుకునే సమయానికి చాలా దగ్గరగా ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కొంతమందిలో ఎసిడిటీ లేదా అసౌకర్యం కలగవచ్చు. బాగా పండిన అరటిపండ్లు తియ్యగా ఉంటాయి కాబట్టి మితంగా తినడం మంచిది. అలాగే చక్కెర లేదా సిరప్‌లు కలపకుండా, పెరుగు లేదా నట్స్‌తో కలిపి తీసుకోవడం ఉత్తమం.
ఎవరు తినకూడదు?
మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు తమ ఆరోగ్య పరిస్థితికి తగినట్లుగా పండ్ల పరిమాణాన్ని ఎంచుకోవాలి. అలాగే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు లేదా పొటాషియం స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాల్సిన వారు వైద్యులను లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.

