Soft Chapati: పెనంపై చపాతీలు పొంగేలా రావాలంటే ముందుగా చేయాలసిన పని ఇదే
Soft Chapati: చపాతీలు మెత్తగా, పొంగేలా రావాలంటే చిన్న చిట్కాలు పాటించాలి. పెనంపై వేయగానే చపాతీలు పొంగితేనే అవి సాఫ్ట్ గా ఉంటాయి. కాబట్టి చపాతీలు పొంగుతూ రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

చపాతీలు పొంగాలంటే
చాలా ఇళ్లలో చపాతీలు పెనంపై కాల్చేటప్పుడు అవి సరిగ్గా పొంగవు. కాసేపటికే గట్టిపడిపోవడం జరుగుతుంటుంది. దీనికి ప్రధాన కారణం పిండి కలిపే విధానంలోనే ఉంది. గోధుమ పిండిలో నీటిని ఒకేసారి పోయకుండా కొద్దికొద్దిగా పోస్తూ మెత్తగా, జిగురు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే ఒత్తేటప్పుడు పగుళ్లు వచ్చి రోటీ పొంగదు. అలాగే పిండి కలిపిన వెంటనే రోటీలు చేయకుండా, దానిపై మూత పెట్టి కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి చక్కగా నాని రోటీలు మృదువుగా తయారవుతాయి.
చపాతీని ఒత్తడం
చపాతీని ఒత్తే విధానం, కాల్చే పద్ధతి కూడా చపాతీ పొంగడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చపాతీ చేసేటప్పుడు ఒకవైపు మందంగా, మరోవైపు పల్చగా కాకుండా అన్నివైపులా సమానంగా ఉండేలా గుండ్రంగా ఒత్తుకోవాలి. ఎక్కువ పొడిపిండి వాడితే చపాతీ త్వరగా ఎండిపోయి గట్టిపడుతుంది. కాల్చే ముందు పెనం తగినంత వేడిగా ఉండాలి. చల్లటి పెనంపై వేస్తే చపాతీ తేమ కోల్పోతుంది, ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది. మీడియం మంటపై పెనం వేడెక్కిన తర్వాత చపాతీ వేసి, చిన్న బుడగలు వచ్చాక మాత్రమే రెండో వైపు తిప్పాలి.
చపాతీని కాల్చే పద్ధతి
చివరగా చపాతీని సరిగ్గా కాల్చడం, దాచడంపై దృష్టి పెట్టాలి. రెండో వైపు లేత గోధుమ రంగు మచ్చలు వచ్చాక కాటన్ గుడ్డతో లేదా గరిటెతో అంచులను తేలికగా నొక్కితే రోటీ బంతిలా పొంగుతుంది. కావాలనుకుంటే నేరుగా గ్యాస్ మంటపై ఉంచి ఇటూ అటూ తిప్పుతూ కూడా పొంగించవచ్చు. కాలిన వేడివేడి చపాతీలను ఎక్కువసేపు గాలికి వదిలేస్తే అవి బిరుసెక్కిపోతాయి. అందువల్ల రోటీలు కాల్చిన వెంటనే వాటిని శుభ్రమైన కాటన్ వస్త్రంలో చుట్టి, మూత ఉన్న బాక్సులో భద్రపరుచుకుంటే చాలా సమయం వరకు ఎంతో మెత్తగా ఉంటాయి.

