- Home
- Feature
- Longest Train Journey: ఏకంగా 9 రాష్ట్రాల మీదుగా వెళ్లే రైలు.. ఇదే మనదేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ
Longest Train Journey: ఏకంగా 9 రాష్ట్రాల మీదుగా వెళ్లే రైలు.. ఇదే మనదేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ
Longest Train Journey: ఈశాన్య రాష్ట్రమైన అసోంలో మొదలై దేశ దక్షిణ కొసన ఉన్న కన్యాకుమారి వరకు సాగే ఈ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో తెలుసా? ఈ అద్భుతమైన ప్రయాణం గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

ఇండియాలో అత్యంత పొడవైన రైలు ప్రయాణం
ఇండియాలో రైలు ప్రయాణాలే ఎక్కువ. సౌకర్యవంతంగా వెళ్లేందుకు ఎక్కువ మంది ఎంపిక చేసుకునేది రైలు ప్రయాణాన్నే. అయితే ఒక రైలు మాత్రం ఏకంగా ఎన్నో రాష్ట్రాల అందాలను, అక్కడి ప్రజల జీవనశైలిని దగ్గరగా చూసే అవకాశం. అలాంటి అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చేదే దిబ్రూగఢ్ - కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్. అసోంలోని దిబ్రూగఢ్‌లో మొదలై తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిసే ఈ రైలు ఏకంగా 4,154 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గమ్యం చేరుకోవడానికి 75 గంటలకు పైగా, అంటే మూడు రోజులకు పైనే సమయం పడుతుంది.
ఏఏ రాష్ట్రాల మీదుగా…
బయలుదేరే సమయాన్ని బట్టి ఈ ప్రయాణం నాలుగు రోజుల పాటు సాగుతుంది. ఈ రూట్‌లో అసోం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు.. ఇలా మొత్తం తొమ్మిది రాష్ట్రాలు కవర్ అవుతాయి. రైలు కిటికీలోంచి చూస్తుంటే మారుతున్న ప్రకృతి దృశ్యాలు, పల్లెలు, పట్నాలు, రకరకాల భాషలు మాట్లాడే జనాలు.. ఈ ప్రయాణంలో మనకు భలే కిక్ ఇస్తాయి.
ఈ రైలు రూట్ చాలా కీలకం
వివేక్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా 2011-12 రైల్వే బడ్జెట్‌లో ఈ వివేక్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రకటించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలను రైలు మార్గం ద్వారా కలపడంలో ఈ దిబ్రూగఢ్ - కన్యాకుమారి రూట్ చాలా కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల పచ్చదనం, తేయాకు తోటలు, పెద్ద నగరాలు, తూర్పు తీర ప్రాంతాలు, దక్షిణ భారతదేశపు అందాలను కళ్లారా చూడొచ్చు. దారిలో చాలా ముఖ్యమైన స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఒకే ప్రయాణంలో ఇన్ని రాష్ట్రాల కల్చర్‌ను చూడటం, వేర్వేరు భాషలు మాట్లాడే జనాలను కలవడం ఈ రైలుకే సొంతం.
వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ అనుభవం
ఇటీవల ఫేమస్ కంటెంట్ క్రియేటర్ మమతా యాదవ్ తన టీమ్‌తో కలిసి వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రైలు కిటికీలోంచి కనిపించే ప్రకృతి అందాలు, తేయాకు తోటలు, బిజీ సిటీలు ఆ వీడియోలో హైలైట్ అయ్యాయి. ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో కొత్త వాళ్లను కలవడం, వాళ్ల కథలు వినడం నిజంగా ఒక మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.
అయితే, ఈ ప్రయాణంలో అన్నీ సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పలేం. రద్దీ సమయాల్లో జనరల్ బోగీల్లో కాలు పెట్టడానికి కూడా చోటు ఉండదు. వాష్‌రూమ్‌ల శుభ్రత, కూర్చునే చోటు, లగేజీ భద్రత లాంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందుకే ఇంత లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకునేవాళ్లు ముందుగానే అన్నీ చూసుకోవాలి. ప్రయాణ తేదీకి తగ్గట్టుగా కన్ఫర్మ్ అయిన బెర్త్ లేదా సీటు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
ఇది చాలా లాంగ్ జర్నీ కాబట్టి, మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా సరైన క్లాస్‌ను ఎంచుకోవడం మంచిది. తాగునీరు, శానిటైజర్లు, అవసరమైన మందులు, పవర్ బ్యాంక్, ఐడీ కార్డులు కచ్చితంగా వెంట తీసుకెళ్లాలి. భోజనం కోసం రైలులో ఉండే ప్యాంట్రీ లేదా దారిలో వచ్చే స్టేషన్ల వివరాలు ముందే తెలుసుకోవాలి. అలాగే, రైలు ఆగిన ప్రతి స్టేషన్‌లోనూ కిందకు దిగి చూద్దామనుకుంటే మాత్రం రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంది.

