Dal: పోషకాలు పోకుండా ఉండాలంటే... పప్పు ఎలా వండాలో తెలుసా? ఇలా తింటేనే హెల్దీ..!
Dal: పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరానికి కావాల్సిన పోషకాలు, ప్రోటీన్ పప్పులో పుష్కలంగా ఉంటాయి. అయితే, అవన్నీ మనకు అందాలంటే పప్పుని ఎలా వండాలి? ఎలా తినాలి అనే విషయం తెలుసుకోవాలి..

పప్పు ఎలా వండాలి?
మన భారతీయుల నిత్య జీవితంలో పప్పు లేని భోజనాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇలా రకరకాల పప్పులను ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూనే ఉంటాం. పప్పులో మన శరీరానికి కావాల్సిన పోషకాలతో పాటు ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే, ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందాలి అంటే.. మనం పప్పు ఎలా వండుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. ఎలా వండితే... పప్పులోని పోషకాలు వృథా కాకుండా ఉంటాయి..? పప్పుని ఎలా తినాలి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం...
పప్పు నానపెట్టడం..
చాలా మంది పప్పును డైరెక్ట్ గా వండేస్తుంటారు. కానీ, దానిలోని పోషకాలు మనకు లభించాలి అంటే.. పప్పును వండటానికి కనీసం 2 గంటల ముందు నానపెట్టడం చాలా ముఖ్యం. ఇలా నానపెట్టడం వల్ల పప్పులోని ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోతాయి. దీని వల్ల మన జీర్ణ వ్యవస్థ పప్పులోని ప్రోటీన్లను పూర్తి స్థాయిలో గ్రహించగలుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు కూడా ఉండవు.
నానపెట్టిన నీటిని పారబోయకండి...
పప్పును నానపెట్టే ముందు.. పప్పును శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత నీటిలో నానపెట్టాలి. ఆ నానపెట్టిన నీటిని చాలా మంది పారబోస్తూ ఉంటారు. ఆ పొరపాటు చేయకూడదు. పప్పు నీటిలో నానపెట్టినప్పుడు అందులోని విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు ఆ నీటిలోకి చేరతాయి. ఆ నీటిని పారబోస్తే.. విటమిన్లు అన్నీ పోయినట్లే. ఇలా వృథా చెయ్యకుండా ఉండాలంటే.. పప్పును నానబెట్టడానికి ముందే 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడగాలి. దుమ్ము, ధూళి, పాలిష్ అన్నీ పోయాక, మంచి నీటిని పోసి నానబెట్టుకోవాలి. వండేటప్పుడు అదే నీటిని ఉపయోగిస్తే పోషకాలన్నీ సురక్షితంగా ఉంటాయి.
పప్పులో పోషకాలు రెట్టింపు అవ్వాలంటే...
పాలిష్ లేని పప్పులకే ప్రాధాన్యం ఇవ్వండి : షైనింగ్‌గా మెరిసిపోయే పప్పులను చూసి మోసపోవద్దు. ఆర్టిఫిషియల్ పాలిష్ చేసిన పప్పుల కంటే ఆర్గానిక్ లేదా పాలిష్ లేని పప్పుల్లోనే అసలైన సహజ పోషకాలు, ఫైబర్ ఉంటాయి.
నాణ్యత విషయంలో కాంప్రమైజ్ వద్దు: అధిక ప్రొటీన్, తక్కువ కొవ్వు, అవసరమైన పోషకాలు అందించే నాణ్యమైన లేదా నమ్మకమైన బ్రాండ్ పప్పులనే ఎంచుకోండి.
పప్పులను మిక్స్ చేసి వండండి: రోజూ ఒకే రకమైన పప్పు కాకుండా... కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు వంటి వాటిని కలిపి వండడం వల్ల శరీరానికి వివిధ రకాల అమినో యాసిడ్లు, పోషకాలు లభిస్తాయి.
వంటకాల్లో వైవిధ్యం చూపించండి.. కేవలం పప్పు-అన్నం తో సరిపెట్టకుండా, పప్పులతో చేసే సలాడ్లు, స్నాక్స్, పప్పుదోసెలు లేదా రోటీలలో పిండి కలిపి వండడం వంటి కొత్త కొత్త ప్రయోగాలు చేయండి. పప్పుతో ఎన్ని రుచులైనా చేయవచ్చు. అప్పుడు పప్పులోని పోషకాలన్నీ మీకు లభిస్తాయి. మీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు.





