Smallest Country: 15 నిమిషాల్లో తిరిగివచ్చేయచ్చు.. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం ఇదే..!
Smallest Country: నడిచి వెళ్లినా కూడా కేవలం 15 నిమిషాల్లో చుట్టేయగల దేశం ఒకటి ఉందని తెలుసా? అక్కడ జనాభా కూడా తక్కువే. కానీ.. దేశం చిన్నదే అయినా చాలా పవర్ ఫుల్. ఆ దేశమేదో తెలుసా?

అతి చిన్న దేశం..
ఒక దేశం అంటే సరిహద్దుల్లో సైన్యం, వేల కిలోమీటర్ల విస్తీర్ణం, కోట్ల జనాభా ఉంటారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ, కనీసం ఒక చిన్న కాలనీ అంత కూడా లేకుండా, కేవలం 0.49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఒక దేశం ఉందని తెలుసా? అది, ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం.. అదే వాటకన్ సిటీ. విస్తీర్ణంలో చాలా చిన్నదిగా కేవలం 15 నిమిషాల్లో మొత్తం చుట్టేసే అంత ఉన్నా.. ఈ దేశం ఎంత శక్తివంతమైనదో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
నగరం లోపల దాగి ఉన్న దేశం...
వాటికన్ సిటీ ఇటలీ రాజధాని రోమ్ నగరం నడిబొడ్డున ఉంది. అంటే మీరు రోమ్ వీధుల్లో నడుస్తూ.. ఒక్క అడుగు ముందుకు వేస్తే... ఈ దేశంలోకి అడుగుపెట్టినట్లే. కేవలం 0.49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత చిన్న స్వత్రంత్ర దేశంగా రికార్డు సృష్టించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద కట్టడం ఇక్కడే...
ఈ దేశం విస్తీర్ణంలో చిన్నదే అయినప్పటికీ, ఇక్కడి కట్టడాలు మాత్రం ప్రపంచాన్నే అబ్బురపరుస్తాయి. అపోస్తులుడైన సెయింట్ పీటర్ సమాధిపై నిర్మించిన సెయింట్ పీటర్స్ బాసిలికా (St. Peter's Basilica), ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కట్టడాలలో ఒకటి. అలాగే, అద్భుతమైన కుడ్యచిత్రాలు, శిల్పకళకు నిలయమైన సిస్టీన్ చాపెల్ (Sistine Chapel) కూడా ఇక్కడే కొలువై ఉంది. ఆధ్యాత్మికతతో పాటు అరుదైన కళలు, వాస్తుశిల్పానికి ఇది ఒక మహా కేంద్రం.
పోప్ పాలన.. విభిన్నమైన ప్రభుత్వం.
సాధారణ దేశాల్లా కాకుండా ఇక్కడి పాలనా వ్యవస్థ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒక 'థియోక్రాటిక్ ఎలెక్టివ్ మొనార్కీ' (Theocratic elective monarchy) దేశం. అంటే పోప్ (Pope) దీనికి సర్వాధికారిగా వ్యవహరిస్తారు. రోమన్ క్యాథలిక్ చర్చి కేంద్ర ప్రభుత్వమైన 'హోలీ సీ' (Holy See) ద్వారా ఈ దేశ పరిపాలన అంతా నడుస్తుంది.
కోట్లాది మందికి అత్యంత పవిత్ర స్థలం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ ప్రజలకు వాటికన్ సిటీ అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. చిన్న భూభాగమే అయినా, ప్రపంచ స్థాయిలో ఎంతో గౌరవం, ప్రాధాన్యత కలిగిన ఈ చిట్టి దేశం నిజంగా ఒక అద్భుతమే.















