- Home
- Feature
- Own Sun Village: సూర్యుడు రాని గ్రామానికి... అద్దంతో వెలుగు తెచ్చారు, చీకటిని జయించిన గ్రామం కథ తెలుసా?
Own Sun Village: సూర్యుడు రాని గ్రామానికి... అద్దంతో వెలుగు తెచ్చారు, చీకటిని జయించిన గ్రామం కథ తెలుసా?
Own Sun Village: ప్రపంచం మొత్తం సూర్యోదయంతోనే మేల్కుంటుంది. కానీ, సూర్యుని వెలుగు రావడం లేదని.. ఓ గ్రామం తమకంటూ ప్రత్యేకంగా కృత్రిమంగా సూర్యుడిని తయారు చేసుకుందని తెలుసా?

Own Sun Village
చలికాలంలో మనకు కాస్త ఆలస్యంగా సూర్యుడు వస్తేనే చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది, సంవత్సరంలో దాదాపు మూడు నెలలు కొంచెం కూడా సూర్య కాంతి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ప్రపంచంలో అసలు అలాంటి ప్రదేశం ఉంటుందా అంటే... ఒక గ్రామం ఉంది. అక్కడ సంవత్సరంలో మూడు నెలలు అసలు సూర్యుడి వెలుగు కూడా పడదు. చీకటిలో జీవించాల్సిందే. అయితే.. ఆ సమస్యను వాళ్లు.. కృత్రిమ సూర్యుడి సహాయంతో పరిష్కరించారు. అదే ఇటలీలోని విగనెల్లా అనే గ్రామం. ఇక్కడ అసలు సూర్యుడు ఎందుకు రాడు? ఈ ప్రజల సమస్యను పరిష్కరించింది ఎవరు?
మూడు నెలల చీకటి...
ఇటలీలోని విగనెల్లా అనే గ్రామం లోయలో ఉంటుంది. చుట్టూ ఉన్న పర్వతాలు శీతాకాలంలో సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. దీని వల్ల ఈ ఊరు ఏడాదిలో దాదాపు మూడు నెలల పాటు పూర్తి చీకటిలోనే మగ్గుతుంది. అంటే చలికాలం మూడు నెలలు వీరు కటిక చీకటిలో ఉండిపోవాల్సిందే. ఈ చీకటి కాలం ముగిసి, మళ్లీ వెలుగు తిరిగి ఫిబ్రవరి లోనే వస్తుంది. ఆ వెలుగు వచ్చిన రోజున అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకునేవారు. కానీ, చీకటిలో మగ్గిన ఆ మూడు నెలలు అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు.
కృత్రిమ సూర్యుడు...
చలి, చీకటి వల్ల ఏర్పడే ఒంటరితనం, నిరాశను దూరం చేయడానికి 2006లో విగనెల్లాలో ఒక వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆర్కిటెక్ట్ గియాకోమో బొంజనీ (Giacomo Bonzani) రూపొందించిన ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1,00,000 యూరోల ఖర్చుతో ఊరి పైనున్న పర్వత శిఖరంపై ఒక భారీ అద్దాన్ని ఏర్పాటు చేశారు. సూర్యుడి గమనాన్ని అనుసరించి ఈ అద్దం తన స్థానాన్ని, కోణాన్ని మార్చుకుంటూ ఉండేలా ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా నియంత్రిస్తారు. ఇది ఏర్పాటు చేయడం వల్ల.. ఆ గ్రామంలో ప్రతిరోజూ ఆరు గంటల పాటు సూర్యుడి వెలుగు లభిస్తోంది. నార్మల్ గా సూర్యకాంతి అంత తీవ్రత లేకపోయినా.. ఆ గ్రామం చీకటిలో మిగిలిపోకుండా.. ఈ కృత్రిమ సూర్యుడు ఈ గ్రామస్థుల జీవితంలో వెలుగులు నింపుతోంది.
ప్రపంచానికే ఆదర్శం...
విగనెల్లా సాధించిన ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు స్ఫూర్తినిచ్చింది. నార్వేలోని ర్జుకాన్ లోయతో సహా పలు చోట్ల ఇలాంటి ప్రాజెక్టులు రావడానికి ఇది దారితీసింది. ప్రకృతి సవాళ్లను టెక్నాలజీతో అధిగమించిన ఈ అద్భుత ప్రయత్నం.. ప్రపంచాన్ని ఆకర్షించింది.














