మడమలు పగిలాయా? ఓ సారి ఈ చిట్కాలను ట్రై చేసి చూడండి.. పగుళ్లే ఉండవ్..
మడమలు చాలా మందికి పగులుతుంటాయి. దీనివల్ల మడమలు నొప్పి పెడుతుంటాయి. కొంతమందికైతే పగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో మడమల పగుళ్లను నయం చేయొచ్చు. అదెలాగంటే?
పాదాల పగుళ్లు చాలా మందికి ఒక సాధారణ సమస్య. పాదాలు అందంగా, పగళకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. మనలో చాలా మంది పాదాలను, మడమలను అస్సలు పట్టించుకోరు. స్నానం చేసినా.. వాటిని మాత్రం పెద్దగా క్లీన్ చేయరు. దీనివల్లే పగుళ్లు వస్తాయి. దుమ్ము, దూళి, చనిపోయిన కణాలు పేరుకుపోవడం వల్ల పాదాలు పగుళుతుంటాయి. పగుళ్లు ఎక్కువైతే రక్తం కూడా వాటిలోంచి కారుతుంది.దీనివల్ల నడవటానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే పగుళ్లను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మరసం
నిమ్మరసంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనితో కూడా పాదాలు పగలకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం రెండు లేదా మూడు చుక్కల నిమ్మరసంలో ఒక టీస్పూన్ వాసెలిన్ మిక్స్ చేసి పాదాలకు అప్లై చేయండి. తర్వాత కాసేపు మసాజ్ చేయండి. 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత పాదాలను కడగండి. దీన్ని వారానికి మూడు లేదా నాలుగు సార్లు అప్లై చేయొచ్చు. దీనివల్ల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి.
కొబ్బరి నూనె
కొబ్బరినూనెను మనలో చాలా మంది ఒక్క జుట్టుకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కాన్ని దీన్ని చర్మానికి కూడా ఉపయోగించొచ్చు. అవును కొబ్బరి నూనె కూడా మడమల పగుళ్లను తగ్గిస్తుంది. ఇందుకోసం ప్రతిరోజూ కొబ్బరినూనెతో పాదాలను మసాజ్ చేయండి. రాత్రిపూట కొబ్బరినూనెను పగుళ్లకు పెట్టి కాసేపు మసాజ్ చేయండి. ఉదయాన్నే పాదాలను కడగండి. కొన్ని రోజులు కంటిన్యూగా ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి.
ఉప్పు
పాదాల పగుళ్లు రాకుండా ఉండటానికి ఉప్పు కూడా బాగా సహాయపడుతుంది. పగుళ్లను కూడా తగ్గిస్తుది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేయండి. అందులో మీ పాదాలను మొత్తం ముంచండి. 20 నిమిషాల తర్వాత బయటకు తీసి పాదాలను శుభ్రంగా కడగండి.
పసుపు
పసుపులో శక్తివంతమైన కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మీ పాదాలను మరింత సున్నితంగా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం పసుపును, తులసి, కర్పూరాలను సమాన పరిమాణంలో తీసుకుని అందులో అలోవెరా జెల్ ను కలిపి మడమలపై అప్లై చేయండి. ఇలా వారానికి ఒక్కసారైనా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.