Sensitive People Psychology: చిన్న విషయాలకే బాధపడేవారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా?
జీవితం అన్నాక మంచి, చెడు సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొందరు వాటిని క్షణాల్లో మరిచిపోతే.. మరికొందరు మనసులోనే మోస్తుంటారు. చిన్న విషయాలకే తెగ బాధపడుతుంటారు. వారు అలా ఎందుకు స్పందిస్తారు? ఇది బలహీనతా, లేక ఇంకేదైనా సమస్య? వీరి గురించి సైకాలజీ ఏం చెప్తోంది?

Sensitive People Psychology
మన చుట్టూ ఉండే వారిలో చాలామంది చిన్న విషయాలకే బాధపడిపోతుంటారు. వారిని చూసి.. ఇంత చిన్న విషయానికి ఎందుకు వీళ్లు ఇంతలా ఫీల్ అవుతున్నారని అనిపిస్తుంది. సైకాలజీ నిపుణుల ప్రకారం, ఇలాంటి వ్యక్తుల మనస్తత్వం ఒక్క కారణంతో ముడిపడింది కాదు. వారి వ్యక్తిత్వం, గత అనుభవాలు, భావోద్వేగాలను నిర్వహించే విధానం, ఆలోచనా శైలి అన్నీ కలిసి ఈ మైండ్ సెట్‌ను రూపొందిస్తాయి. చిన్న సమస్యలు పెద్దవిగా అనిపించడం వెనుక లోతైన మానసిక ప్రక్రియలు ఉంటాయని సైకాలజీ చెప్తోంది.
హై సెన్సిటివ్ పర్సన్స్..
సైకాలజీ ప్రకారం చిన్న విషయాలకే బాధపడే వారిని “హై సెన్సిటివ్ పర్సన్స్”గా చెప్తారు. వీరు తమ చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇతరులు సాధారణంగా తీసుకునే మాటలు లేదా సంఘటనలను వీరు తీవ్రంగా తీసుకుంటారు. చిన్న విమర్శ కూడా తమ విలువను ప్రశ్నించినట్లుగా వీరికి అనిపిస్తుంది. వీరిలో ఉండే అధిక భావోద్వేగ స్పందన, ఆలోచించే విధానమే ఇందుకు కారణమని సైకాలజీ చెప్తోంది. వీరు ఎక్కువగా బుద్ధితో కాకుండా ఎమోషనల్ గా నిర్ణయాలు తీసుకుంటారు.
గత అనుభవాల పాత్ర కీలకం
సైకాలజీ ప్రకారం, చిన్న విషయాలకే బాధపడే మైండ్ సెట్ వెనుక గత అనుభవాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. చిన్నప్పటి నుంచి విమర్శలు ఎక్కువగా ఎదుర్కొన్న వారు, ప్రేమ లేదా భద్రత లోపించిన వాతావరణంలో పెరిగిన వారు, పెద్దయ్యాక కూడా ప్రతి పరిస్థితిలో ప్రమాదం లేదా తిరస్కారం ఉంటుందని అనుకుంటారు. వారి మెదడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అందువల్ల చిన్న సమస్య కూడా పెద్ద ముప్పులా అనిపిస్తుంది.
ఓవర్ థింకింగ్
ఇలాంటి వ్యక్తుల్లో ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక చిన్న మాట లేదా సంఘటనను పదే పదే తలుచుకుంటూ, దాని వెనుక అర్థాలు వెతుకుతారు. “అతను అలా ఎందుకు అన్నాడు?”, “నేను ఏదైనా తప్పు చేశానా?” వంటి ప్రశ్నలు వారి మనసును వెంటాడుతూనే ఉంటాయి. ఈ ప్రక్రియలో సమస్య అసలు పరిమాణం కంటే చాలా రెట్లు పెరిగిపోతుంది.
నమ్మకం తక్కువ
చిన్న విషయాలకే బాధపడేవారిలో తమపై తమకు నమ్మకం తక్కువగా ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడతారు. ఎవరో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, అది తమ అర్హతలపై వచ్చిన తీర్పులా భావిస్తారు. ఇలాంటి మైండ్ సెట్‌లో ఉన్నవారు ఆనందాన్ని కూడా పూర్తిగా అనుభవించలేరు, ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక తప్పు జరుగుతుందన్న భయం వీరి వెంటే ఉంటుంది.
బలహీనత కాదు..
సైకాలజీ ప్రకారం చిన్న విషయాలకే బాధపడే మైండ్ సెట్ బలహీనత కాదు, అది ఒక రకమైన సున్నితత్వం. అయితే దాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోకపోతే, జీవితంలోని ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్వీయ అవగాహన, సరైన ఆలోచనా శైలి, భావోద్వేగాల నిర్వహణ ద్వారా ఈ మైండ్ సెట్‌ను క్రమంగా మార్చుకోవచ్చు. చిన్న విషయాలను చిన్నవిగానే చూడటం నేర్చుకున్నప్పుడు, మనసు తేలికగా మారుతుంది, జీవితం మరింత ప్రశాంతంగా అనిపిస్తుంది.

