మన తాతల కాలంనుండి సేమ్ టు సేమ్ ... AI జమానాలో కూడా ఏమాత్రం మారని వస్తువులివే
తరాలు మారుతున్నకొద్దీ ప్రతిదీ మారుతోంది. రాతియుగం నుండి టెక్నాలజీ యుగానికి మనిషి చేరుకున్నాడు. కానీ మన తాతలు వాడిన కొన్ని వస్తువులు ఇప్పటికీ ఏమాత్రం మారలేవు. వాటినే మనం ఇంకా ఉపయోగిస్తున్నాం. అలాంటి వస్తువులేవో తెలుసా?

తరాలు మారినా మారని వస్తువులివే...
తరాలు మారుతున్నాయి... రోజుకో కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తోంది... ఇందుకు తగ్గట్లుగానే మనిషి జీవన విధానం కూడా మారుతోంది. ఆకాశం వైపు చూస్తూ చందమామ పాటలు పాడుకున్న రోజులనుండి చందమామపై అడుగుపెట్టే స్థాయికి మనిషి చేరుకున్నాడు. చివరికి ఆ బ్రహ్మకే సాధ్యమని నమ్మే ప్రాణంపోసే పనిని కూడా అపర బ్రహ్మలుగా మారి వైద్యులే చేస్తున్నారు.. ఐయుఐ, ఐవిఎఫ్ పద్దతులతో మనుషిని సృష్టిస్తున్నారు. అంతరిక్షం నుండి అధ:పాతాళం వరకు ఎక్కడ ఏముందో కనుక్కునే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ప్రతిదాన్ని మనిషి తన అవసరాలకు, సౌకర్యాలకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు.
రాతియుగం నుండి టెక్నాలజీ యుగానికి మనిషి సాగించిన ప్రయాణంలో పెనుమార్పులు సంభవించాయి. ఓ మనిషి తన జీవితకాలంలో ఎన్నో అద్భుతాలను చూస్తున్నాడు. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కొన్ని వస్తువులు మాత్రం ఏమాత్రం మారలేవు... దశాబ్దాల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే ఉన్నాయి. ఇలా కాలంతో పాటు మారకుండా ఉన్న ఆ వస్తువులేమిటో చూద్దాం.
1. పిన్నీస్ (Safety Pin)
ఇది చాలా చిన్న వస్తువు... కానీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మహిళలు ఈ పిన్నీస్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు... చీరకుచ్చిళ్ల నుండి జెడలో పెట్టుకునే పూలవరకు వీటిని వాడుతుంటారు. ఇలా మహిళలు అందంగా ముస్తాబవడంలో ఈ పిన్నీసుల పాత్రకూడా ఉంటుంది. గతంలో చిరిగిన దుస్తులు, తెగిన చెప్పులకు కూడా ఈ పిన్నీసులు వాడేవారు. ఈ కాలంలో వీటి వినియోగం తగ్గింది... కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు వీటి రూపంలో ఎలాంటి మార్పు లేదు. తరాలు మారుతున్నా ఈ పిన్నీస్ మాత్రం మారడంలేదు.
2. నెయిల్ కట్టర్ (Nail Cutter)
పూర్వీకులు జుట్టుతో పాటు కాళ్లు, చేతులకు ఉండే గోర్లను కత్తిరించుకోవడానికి ఇబ్బందిపడేవారు… అందుకోసమే ఆ కాలంలో జుట్టు, గడ్డాలు మీసాలు పెంచుకుని తిరిగేవారు.. గోర్లు కూడా అలాగే పెరిగివుండేవి. ఆ తర్వాత బ్లేడ్స్, పదునైన కత్తులతో గోర్లను కత్తిరించుకునేవారు... నైంటీస్ లో ఈ నెయిల్ కట్టర్ వచ్చాక ఈ బాధ తప్పింది. ఆరంభంలో ఈ నెయిల్ కట్టర్ ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది... ఏమాత్రం మారలేదు. ఎంత టెక్నాలజీ వచ్చినా మన ఇళ్ళలోని నెయిల్ కట్టర్ ని మార్చలేకపోయింది.
నెయిల్ కట్టుర్ నేటితరానికి ఓ ఎమోషన్.. ఎందుకంటే చిన్నపుడు మన పెద్దవాళ్లు వద్దని ఏడుస్తున్నా వినకుండా దీంతోనే గోర్లు తీసేవారు. ఇప్పుడు మనకు పెళ్లలయి పిల్లలు పుట్టారు... వారికి కూడా మనం ఇదే నెయిల్ కట్టర్ తో గోర్లు తీస్తున్నాం. ఇలా తరాలు మారినా ఈ నెయిల్ కట్టర్ మారడంలేదు... దానితో ఎమోషన్ తగ్గడంలేదు. మన పిల్లలు కూడా భవిష్యత్ లో వాళ్ల పిల్లలకు గోర్లు తీయడానికి వీటినే ఉపయోగిస్తారేమో.
3. బట్టల క్లిప్పులు (Clothes clips)
బట్టలు బండకేసి రుద్దుతూ ఉతికే రోజులు పోయాయి... ఇప్పుడంతా వాషింగ్ మిషన్లు వాడుతున్నారు. పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా వాషింగ్ మిషన్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇలా బట్టలు ఉతికేతీరు మారిందికానీ... అరబెట్టే తీరుమాత్రం మారలేదు. అదే దండెంపై బట్టలు వేసి అవే క్లిప్పులు పెడుతున్నాం. బట్టలు ఎగిరిపోకుండా ఉపయోగించే క్లిప్పులు కూడా ఆనాటి నుండి ఈనాటి ఏమీ మారలేవు. క్వాలిటీలో మార్పులు వచ్చాయేమో కానీ వాటి ఆకారంలో ఏమాత్రం మార్పులేదు.
4. టూత్ పిక్ (tooth Pik)
ఒకప్పుడు హోటల్ కి వెళితే కింద కూర్చుని తినేవారు... ఆ తర్వాత టేబుల్స్, కుర్చీలు వచ్చాయి... ఇప్పుడు మెత్తని సోఫాలు, రకరకాల కూర్చీలు, మెరిసిపోయే టేబుల్స్ వచ్చాయి. కానీ ఆనాటి నుండి ఈనాటికి మారనిది ఒక్కటే టూత్ పిక్. అప్పుడు ఎలాంటి టూత్ పిక్స్ ఉండేవి ఇప్పడు అలాంటివే ఉన్నాయి... మనం తిన్నాక నోటిని శుభ్రం చేసుకోడానికి ఉపయోగించే ఇవి కూడా కాలంతో పాటు మారలేవు.

