GST : మీరు ఈ వస్తువులు కొనాలనుకుంటున్నారా? ఇంకొన్నిరోజులు ఆగండి... ధరలు తగ్గొచ్చు
త్వరలో జరిగే జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో కీలక నిర్ణయాాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని వస్తువుల ధరలు బాగా తగ్గుతాయట. అవేంటో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు
GST Council Meeting 2025 : త్వరలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత జిఎస్టి (గూడ్స్ ఆండ్ సర్విసెస్ ట్యాక్) లో కీలక మార్పులు చేపట్టనున్నట్లు అధికారిక వర్గాల నుండి సమాచారం వెలువడుతోంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన త్వరలోనే జరిగే 56వ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని వస్తువుల ధరల భారీగా తగ్గనున్నాయి.
ఏమిటీ జిఎస్టి?
'ఒకే దేశం ఒకే ట్యాక్స్' విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2017 లో జిఎస్టి (Goods and Services Tax) విధానాన్ని తీసుకువచ్చింది. దీనిప్రకారం ఒక వస్తువుకు దేశంలో ఎక్కడైనా ఒకే రకమైన పన్ను ఉంటుంది... అంటే ఒకే ధర ఉంటుందన్నమాట. ఇలా ఒకే వస్తువుపై వివిధ రకాలు పన్నులు వేసే విధానానికి స్వస్తి పలికింది జిఎస్టి.
కొన్ని వస్తువులపై అసలు పన్నులేమీ లేకుండా 0 శాతం జిఎస్టి జాబితాలో చేర్చింది కేంద్రం. అలాగే జిఎస్టి వసూళ్లకోసం 5%,12%,18%,28% శ్లాబులను ఏర్పాటుచేసారు... వీటిప్రకారం పన్నులు విధిస్తున్నారు. ఈ జిఎస్టి శ్లాబుల విషయంలోనే త్వరలో జరిగే కౌన్సిల్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశాలున్నాయి.
జిఎస్టి కౌన్సిల నిర్ణయాలతో వీటి ధరలు తగ్గుతాయా?
జిఎస్టి వివిధ వస్తుసేవలపై విధించే 12 శాతం శ్లాబును తొలగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించడంతో పాటు జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి.
సామాన్యులపై పన్నుల భారాన్ని తగ్గించేందుకే కేంద్రం 12శాతం జిఎస్టి శ్లాబును తొలగించేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఇదే జరిగితే నిత్యావసర వస్తువులు డెయిరీ వస్తువులు వెన్న,నెయ్యి వంటివాటి ధరలు తగ్గుతాయి. అలాగే మొబైల్ ఫోన్స్ ధరలు కూడా తగ్గే అవకాశాలున్నాయి. వర్షకాలంలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే గొడుగుల ధరలు బాగా తగ్గుతాయి. ఇవన్ని 5శాతం శ్లాబ్ లోకి వచ్చే అవకాశాలున్నాయి.
తగ్గనున్న ట్రాక్టర్, ఏసి ధరలు?
రైతులు ఉపయోగించే ట్రాక్టర్ల ధరలు కూడా తగ్గే సూచనలున్నాయి. ట్రాక్టర్లపై ప్రస్తుతం 12శాతం జిఎస్టి వసూలు చేస్తున్నారు... దీన్ని పూర్తిగా ఎత్తివేస్తే ఇది 5శాతం జిఎస్టి శ్లాబులో చేరనుంది. కాబట్టి ధరలు తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏసిలపై కూడా జిఎస్టిని తగ్గించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏసీలపై ప్రస్తుతం 28 శాతం జిఎస్టి విధిస్తున్నారు.. దీన్ని 18 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోందట. ఇదే జరిగితే ఏసీ తయారీ కంపెనీలపై భారం తగ్గుతుంది... దీంతో వీటి ధరలు దిగివస్తాయి.
వీటి ధరలు పెరుగుతాయా?
12శాతం పన్ను శ్లాబ్ తొలగింపుతో కొన్ని వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. ప్రస్తుతం ఈ శ్లాబ్ లోని వస్తువులను 18 శాతం లేదా 28 శాతం శ్లాబులో చేర్చే అవకాశాలున్నాయి... ఇలా ప్రీమియం, బ్రాండెడ్ వస్తువుల పన్ను శ్లాబులు మారవచ్చు... తద్వారా వాటి ధరలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.