- Home
- Life
- IRCTC : హైదరాబాద్ నుండి తిరుమల, అరుణాచలం, శ్రీరంగం యాత్ర.. 3 పుణ్యక్షేత్రాలను కలిపే ట్రైన్ రెడీ
IRCTC : హైదరాబాద్ నుండి తిరుమల, అరుణాచలం, శ్రీరంగం యాత్ర.. 3 పుణ్యక్షేత్రాలను కలిపే ట్రైన్ రెడీ
ఒకే ట్రిప్‌లో తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం వస్తే భలే ఉంటుంది కదా? తెలుగువారికి ఈ ఛాన్స్ వచ్చింది. భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఈ మూడు ఆలయాలను కలుపుతూ స్పెషల్ ట్రైన్ సర్వీస్ ప్రకటించింది.

హైదరాబాద్ నుండి 3 పుణ్యక్షేత్రాలకు ట్రైన్ సర్వీస్
Hyderabad to Tirupari, Arunachalam, Srirangam Train : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుపతి టాప్ లో ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ ఆలయానికి కేవలం తెలుగు ప్రజలే కాదు తమిళులు భారీగా వెళుతుంటారు... కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. సేమ్ టు సేమ్ ఇలాగే తమిళనాడులోని అరుణాచలం, శ్రీరంగం దేవాలయాలను కేవలం తమిళులే కాదు తెలుగువారు ఎక్కువగా సందర్శిస్తుంటారు. అంటే ఈ మూడు దేవాలయాలు ఇటు తెలుగువారికి, అటు తమిళులకు అత్యంత పవిత్రమైనవి... అందుకే నిత్యం తెలుగు రాష్ట్రాలనుండి అరుణాచలం, శ్రీరంగంకు... తమిళనాడు నుండి తిరుమలకు భక్తులు తరలివెళుతుంటారు.
తెలుగు, తమిళ ప్రజల సౌకర్యార్థం తిరుమల, అరుణాచలం, శ్రీరంగం ఆలయాలను కలుపుతూ రైల్వే శాఖ ప్రత్యేక ట్రైన్ అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ (చర్లపల్లి రైల్వేస్టేషన్) - తిరుచిరాపల్లి మధ్య కొత్తగా ఓ వీక్లీ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది… ఇవాళ్టి (జూలై 7, మంగళవారం) నుండే ఈ రైలు అందుబాటులోకి రానుంది.
తెలుగువారికి సూపర్ ఛాన్స్
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే చాలామంది తెలుగోళ్లు తిరువన్నామలై (అరుణాచలం) కూడా వెళుతుంటారు. ఇంకా చెప్పాలంటే అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో తమిళుల కంటే తెలుగువారే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇలాంటివారికి తాజాగా దక్షణమధ్య రైల్వే ప్రకటించిన ట్రైన్ బాగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తిరుపతి, అరుణాచలం వెళ్లే భక్తులకు ఈ కొత్త సర్వీస్ అదనపు కనెక్టివిటీని అందిస్తుంది. తిరుచిరాపల్లి శ్రీరంగం ఆలయానికి వెళ్లాలనుకున్నా ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది.
నేడే హైదరాబాద్-తిరుపతి-అరుణాచలం-శ్రీరంగం ట్రైన్ పరుగులు
హైదరాబాద్ శివారులోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఇవాళ (జూలై 7, మంగళవారం) వీక్లీ ట్రైన్ ప్రారంభం అవుతుంది. ఇక ప్రతి మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు 17077 నంబర్ ట్రైన్ చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం 8.50కి తిరుపతి, మధ్యాహ్నం 1.20కి తిరువణ్ణామలై, సాయంత్రం 4.30కి శ్రీరంగం చేరుకుంటుంది. సాయంత్రం 6.45కి చివరి స్టేషన్ తిరుచిరాపల్లి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 17078 నంబర్ రైలు ప్రతి బుధవారం రాత్రి 9.30కి తిరుచిరాపల్లి నుంచి బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 9.52కి శ్రీరంగం, మరుసటి రోజు తెల్లవారుజామున 1.28కి తిరువణ్ణామలై, గురువారం ఉదయం 7.05కి తిరుపతి, రాత్రి 10.20కి చర్లపల్లికి చేరుకుంటుంది. ఇలా మంగళ, బుధ, గురువారం మూడ్రోజుల్లో మూడు పుణ్యక్షేతాలను రెండుసార్లు టచ్ చేస్తుంది ఈ ట్రైన్.
ఈ స్పెషల్ ట్రైన్‌లో 3 సెకండ్ ఏసీ (2AC) కోచ్‌లు, 5 థర్డ్ ఏసీ (3AC) కోచ్‌లు, 10 స్లీపర్ కోచ్‌లు, 4 జనరల్ కోచ్‌లు ఉన్నాయి. వివిధ వర్గాల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుండి అరుణాచలంకు డైరెక్ట్ ట్రైన్
ఇప్పటికే హైదరాబాద్ - తిరుపతి మధ్య డెయిలీ, వీక్లీ సర్వీసులతో కలిపి దాదాపు 20 డైరెక్ట్ రైళ్లు ఉన్నాయి. వాటిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ముఖ్యమైనవి. కానీ హైదరాబాద్ - తిరువణ్ణామలై (అరుణాలచం) మధ్య డైరెక్ట్ రైలు సర్వీస్ లేదు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వీక్లీ స్పెషల్ ట్రైన్ భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
భక్తులు ఈ రైలు టైమ్ టేబుల్, సీట్ల లభ్యతను ముందుగానే చెక్ చేసుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా సెలవులు, పండుగల సమయంలో ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. మూడు పుణ్యక్షేత్రాలను కలిపే ట్రైన్ కాబట్టి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి.

