Thick Eyebrows: ఈ సింపుల్ టిప్స్ తో కనుబొమ్మలు నల్లగా, ఒత్తుగా మారడం పక్కా!
Thick Eyebrows: మీ కనుబొమ్మలు, ఐలాషెస్ పలుచగా ఉన్నాయా? దానివల్ల మీ ముఖ అందం తగ్గినట్లు కనిపిస్తోందా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే. ఇంట్లో దొరికే కొన్ని సహజ పదార్థాలతో నల్లని, ఒత్తైన కనుబొమ్మలను సొంతం చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

ఒత్తైన కనుబొమ్మల కోసం సింపుల్ టిప్స్
అందమైన కళ్లకు ఒత్తైన, చక్కటి ఆకారంలో ఉండే కనుబొమ్మలు మరింత ఆకర్షణను తీసుకొస్తాయి. అయితే ఎక్కువగా థ్రెడింగ్ చేయడం, పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు, ఇతర కారణాల వల్ల చాలామందికి కనుబొమ్మల వెంట్రుకలు పలుచబడిపోతుంటాయి. దానివల్ల ముఖ అందం తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే కనుబొమ్మలు మరింత ఒత్తుగా పెరుగుతాయి. ఆ చిట్కాలేంటో తెలుసుకోండి.
ఆముదంతో మసాజ్
రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా ఆముదం తీసుకొని వేళ్లతో కనుబొమ్మలపై సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దీంతో చర్మం తేమగా ఉండటంతో పాటు వెంట్రుకల మూలాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కనుబొమ్మలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.
అలోవెరా జెల్
కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి అలోవెరా జెల్ కూడా ఉపయోగపడుతుంది. స్వచ్ఛమైన అలోవెరా జెల్‌ను తీసుకొని అందులో రెండు చెంచాల విటమిన్ ఇ ఆయిల్ కలపాలి. ఈ పేస్టును రాత్రిపూట రాసుకొని, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా 3 నెలలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
కొబ్బరి నూనె
అర కప్పు కొబ్బరి నూనెలో మూడు చెంచాల మెంతి పొడి వేసి 10 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు మిశ్రమాన్ని కనుబొమ్మలకు రాసుకుంటే వేగంగా పెరుగుతాయి.
మెంతుల పేస్ట్
నానబెట్టిన మెంతులను పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని వారానికి మూడుసార్లు మస్కారా బ్రష్‌తో కనుబొమ్మలకు అప్లై చేయాలి. మెంతుల్లో ఉండే ‘నికోటినిక్ సాల్ట్’ కనుబొమ్మలు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది.
అయితే ఏ చిట్కా పాటించినా.. ప్యాచ్ టెస్ట్ చేసుకోవడంతో పాటు కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మంచి ఫలితాల కోసం కనీసం 3 నుంచి 6 నెలల పాటు ఓపికగా, క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటించాలి.

