Mutton: మటన్ ఉడికేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. కూర ముదిరినా కూడా నిమిషాల్లో ఉడికిపోతుంది..!
Mutton: మటన్ కూర వండేటప్పుడు తొందరగా ఉడకడం లేదా? కుక్కర్ లో పెట్టినా మెత్తగా ఉడకడం లేదా? అయితే.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే. ఇది ఫాలో అయితే..మటన్ మెత్తగా ఉడికి వెన్నలా కరిగిపోతుంది.

Mutton Curry
నాన్ వెజ్ ప్రియులు మటన్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మటన్ తినడానికి కమ్మగా ఉంటుంది. కానీ, కూర వండటమే కష్టం.. తొందరగా ఉడకనే ఉడకదు అనేది చాలా మందిలో ఉండే అభిప్రాయం. కానీ, ఈ కూర వండే విధంగా వండితే.. చికెన్ కన్నా ఫాస్ట్ గా ఉడుకుతుంది. నిజానికి లేత మటన్ అయితే ఈజీగానే ఉడుకుతుంది. కానీ కాస్త ముదురు మటన్ అయితే ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎంత ముదురుగా ఉన్నా.. దానిలో కొన్నింటిని కలపడం వల్ల వెన్నలా కరిగిపోయేలా చేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
1.పచ్చి బొప్పాయి పేస్టు..
ముదిరిన మటన్ తొందరగా ఉడకాలంటే పచ్చి బొప్పాయి చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. దీని కోసం మీరు పచ్చి బొప్పాయి తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా చేసి తర్వాత మెత్తటి పేస్టులా మార్చాలి. కేజీ మటన్ కూర వండుతున్నట్లయితే.. ఈ పచ్చి బొప్పాయి పేస్టును ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు కలిపితే సరిపోతుంది. ఈ పేస్టు కలిసి అరగంట పాటు మారినేట్ చేసి ఆ తర్వాత వండితే.. మెత్తగా ఉడుకుతుంది. బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ మాంసం తొందరగా ఉడకడానికి హెల్ప్ చేస్తుంది.
పెరుగు వేసి మ్యారినేట్ చేయండి
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మాంసాన్ని నెమ్మదిగా మెత్తగా చేస్తుంది.పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మసాలాలతో కలిపి కనీసం 2 గంటలు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
3. నిమ్మరసం లేదా వెనిగర్ కొద్దిగా వేయండి
కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ కూడా మాంసాన్ని మెత్తబరుస్తుంది. అయితే మరీ ఎక్కువగా వేస్తే మాంసం రుచి, ఆకృతి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కొద్దిగా వాడితే సరిపోతుంది.
4. ప్రెజర్ కుక్కర్‌లో సరైన విజిల్స్
ముదిరిన మటన్ కుక్కర్ లో అయినా ఉడకడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, కుక్కర్ లో మరో రెండు విజిల్స్ ఎక్కువ వచ్చేంత వరకు మీడియం మంట మీద ఉంచాలి. అప్పుడు సమానంగా ఉడుకుతుంది. తొందరగా కూడా ఉడుకుతుంది.
5. వేడి నీరే ఉపయోగించండి
మధ్యలో నీరు అవసరమైతే చల్లటి నీరు కాకుండా వేడి నీరే పోయాలి. ఇలా చేయడం వల్ల ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గదు. మటన్ గట్టిపడకుండా సమానంగా ఉడుకుతుంది.
6. చిన్న ముక్కలుగా కోయండి
పెద్ద ముక్కల కంటే మధ్యస్థ పరిమాణంలో ఉన్న ముక్కలు త్వరగా ఉడుకుతాయి. మసాలాలు కూడా బాగా పడతాయి.
ముదిరిపోయిన మటన్ త్వరగా, మెత్తగా ఉడకాలంటే పచ్చి బొప్పాయి పేస్ట్, పెరుగుతో మ్యారినేషన్, వేడి నీరు, సరైన ప్రెజర్ కుకింగ్ వంటి పద్ధతులు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని పాటిస్తే మటన్ రుచిగా, జ్యూసీగా, మెత్తగా ఉడుకుతుంది.

