Hair Care: మంతెన ప్రకారం.. మెంతులు ఇలా వాడితే జుట్టు రాలడం ఆగుతుంది..!
Hair Care: మెంతులు జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మెంతులను సరైన విధానంలో వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన గారు చెప్పారు.

hair Care
ఒత్తైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్ మొదలవ్వగానే చాలా మంది తాము రెగ్యులర్ గా వాడే నూనెలు, షాంపూలు మార్చేస్తారు. మార్కెట్లో దొరికే ఖరీదైన వాటివన్నింటినీ వాడేస్తూ ఉంటారు. అయినా కూడా పెద్దగా ఫలితం ఉండదు.కానీ, ఖరీదైన షాంపూలు, నూనెలతో సంబంధం లేకుండా.. మన వంటింట్లో లభించే మెంతులతో జుట్టును అందంగా మార్చుకోవచ్చని మంతెన చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి వైద్యం ప్రకారం, జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా, ఊడిపోకుండా ఉండాలన్నా మెంతులు ఒక అద్భుతమైన ఔషధం. దానిని ఎలా వాడాలో తెలిస్తే చాలు.
మంతెన గారు చెప్పిన ప్రకారం, మెంతులు ఎలా వాడాలంటే...
1.మెంతుల పేస్టు...
జుట్టు రాలడం తగ్గించి , కుదుళ్లను బలోపేతం చేయడానికి మెంతులను ఇలా వాడాలి. దాని కోసం 2 నుంచి 3 చెంచాల మెంతులను రాత్రిపూట నీళ్లల్లో నానపెట్టాలి. ఉదయాన్నే ఆ మెంతులను మెత్తగా పేస్టులాగా రుబ్బుకోవాలి. ఈ పేస్టును తల మాడుకి, జుట్టుకీ బాగా పట్టించాలి. 30 నుంచి 45 నిమిషాల పాటు అలానే ఉంచి.. తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. అయితే.. తలస్నానం చేయడానికి కెమికల్స్ ఉన్న షాంపూ వాడకూడదు. వాటికి బదులు కుంకుడు కాయ లేదా శీకాకాయ వాడితేనే మెంతులు బాగా పని చేస్తాయి.
2.మొలకెత్తిన మెంతులు...
మంతెన గారి ప్రకారం, జుట్టు సమస్యలకు కారణం శరీరంలో పోషకాహార లోపం. అందుకే ఆయన మొలకలను ఎక్కువగా సిఫార్సు చేస్తారు. మెంతులను మొలకెత్తించి రోజుకు ఒక చెంచా చొప్పున తీసుకోవాలి. వీటిలో ఉండే ప్రోటీన్, నికోటిన్ యాసిడ్ జుట్టును లోపలి నుండి బలంగా మారుస్తాయి. మెంతులు తింటే చేదుగా ఉంటాయనిపిస్తే, కొంచెం తేనె లేదా ఖర్జూరంతో కలిపి తినవచ్చు.
పరగడుపున మెంతుల నీరు..
రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో వేడి (Heat) తగ్గితే జుట్టు రాలడం కూడా ఆటోమేటిక్ గా తగ్గుతుందని ఆయన చెబుతారు.
పాటించాల్సిన ఇతర జాగ్రత్తలు...
వేడి నీళ్లు వద్దు: తల స్నానానికి ఎప్పుడూ వేడి నీటిని వాడకూడదు. ఇది వెంట్రుకలను బలహీనపరుస్తుంది.
సహజ గాలి: స్నానం చేసిన తర్వాత జుట్టును ఆరబెట్టడానికి డ్రయ్యర్లు (Hair Dryers) వాడకుండా, సహజమైన గాలికి ఆరనివ్వాలి.
నూనె: తలకు నూనె రాసినప్పుడు మాడుకు బాగా పట్టేలా మర్దన చేయాలి, అది రక్త ప్రసరణను పెంచుతుంది. ఇవి రెగ్యులర్ గా ఫాలో అయితే... కొద్ది రోజుల్లోనే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా.. మళ్లీ జుట్టు పెరుగుతుంది.

