Makhana Capital: మన దేశంలో మఖానా రాజధాని ఏది? ప్రపంచం మొత్తానికి ఇక్కడి నుంచే సరఫరా..!
Makhana Capital: ఈరోజుల్లో హెల్దీ స్నాక్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫూల్ మఖానా. ఈ మఖానాని దేని నుంచి తయారు చేస్తారు? ప్రపంచం మొత్తం ఇష్టపడుతున్న ఈ స్నాక్ కి మన దేశ రాజధాని ఏదో తెలుసా?

మఖానా గోల్డెన్ స్టేట్..
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్నాక్స్ అంటే ఇష్టం లేనివాళ్లు ఎవరు ఉంటారు? టీవీ చూస్తున్నా, ల్యాప్ టాప్ ముందు వర్క్ చేసుకుంటున్నా, స్నాక్స్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే, స్నాక్స్ హెల్దీగా తినాలి అంటే...ఫస్ట్ వినిపించే పేరు ఫూల్ మఖానా. తామర గింజలతో తయారు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడుతున్న ఈ స్నాక్ కి మన దేశమే ఫేమస్ విషయం తెలుసా? ముఖ్యంగా.. మన దేశంలోని ఓ ప్రాంతం లో ఈ మఖానా ఎక్కువగా తయారౌతుంది. ప్రపంచంలో దాదాపు 80 శాతం మఖానా ఇదే ప్లేస్ నుంచి పంపిణీ అవుతుంది. ప్రపంచానికే మఖానా క్యాపిటల్ గా మారిన గోల్డెన్ స్టేట్ ఏదో ఇప్పుడు చూద్దాం....
గ్లోబల్ మార్కెట్లో మనదే హవా
ప్రపంచ వ్యాప్తంగా లభించే మొత్తం మఖానాలో దాదాపు 80 నుంచి 85 శాతం కేవలం మన దేశం నుంచే ఉత్పత్తి అవుతుంది. అది కూడా బిహార్ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతుండటం విశేషం. 2025-26 లెక్కల ప్రకారం, భారతదేశం మొత్తంల 80,590 మెట్రిక్ టన్నుల మఖానా ఉత్పత్తి కాగా అందులో సింహ భాగం అంటే దాదాపు 60,000 మెట్రిక్ టన్నులు ఒక్క బిహార్ లోనే ఉత్పత్తి అయ్యింది. ముఖ్యంగా ఉత్తర బిహార్ లోని మిథిల, సీమాంచల్ ప్రాంతాలు, కోసీ నదీ పరివాహక ప్రాంతాలు మఖానా సాగుకు ప్రసిద్ధి చెందాయి. దర్భంగా, మధుబని, పూర్ణియా, కటిహార్, సుపౌల్ వంటి జిల్లాలు మఖానా హబ్ లుగా పేరుగాంచాయి.
మఖానా GI ట్యాగ్...
బిహార్ లోని ఎక్కువ ప్రాంతాలలో మఖానా పండిస్తున్నప్పటికీ.. మిథిల ప్రాంతానికి మాత్రమే జీఐ గుర్తింపు లభించింది. ఇక్కడి మఖానా నాణ్యతకు గుర్తింపుగా ఆగస్టు 2022లో 'మిథిలా మఖానా' కి ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు (GI Tag) లభించింది. అలాగే, దర్భంగాలో 2002లోనే 'ICAR - నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మఖానా' ను ఏర్పాటు చేసి సాగు , ప్రాసెసింగ్‌లో నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. మఖానా అనేది నీటి చెరువులు, చిత్తడి నేలల్లో పెరిగే తామర పువ్వులోని ఈ గింజలను సేకరించి, వేయించి.. మఖానా తయారు చేస్తారు.
ప్రభుత్వ ప్రోత్సాహం – అంతర్జాతీయ ఎగుమతులు..
మఖానా రంగాన్ని మరిన్ని ఎత్తులకు తీసుకెళ్లేందుకు నేషనల్ మఖానా బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు, 2025-26 నుండి 2030-31 వరకు ₹476.03 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రత్యేక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీని ఫలితంగా, మన దేశంలోనే కాక విదేశాల్లోనూ బీహార్ మఖానా మెరుస్తోంది. ఆగస్టు 2026లో దర్భంగా రైతుల నుండి సేకరించిన 18 మెట్రిక్ టన్నుల GI-ట్యాగ్డ్ మిథిలా మఖానాను సముద్ర మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు తొలిసారిగా ఎగుమతి చేశారు. దాదాపు ప్రపంచంలో ఎక్కువ మంది తినే మఖానా మనదే కావడం విశేషం.

