- Home
- Life
- Motivational story: కష్టాలు వచ్చాయని బాధపడుతున్నారా? ఈ కథ చదివితే మీ ఆలోచన కచ్చితంగా మారుతుంది!
Motivational story: కష్టాలు వచ్చాయని బాధపడుతున్నారా? ఈ కథ చదివితే మీ ఆలోచన కచ్చితంగా మారుతుంది!
కష్టాలు అందరికీ వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడినప్పుడే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. కష్టాలకు భయపడితే మన లైఫ్ ఎలా ఉంటుందో చెప్పే ఓ చిన్న కథ మీకోసం. ఈ కథ మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ఓ సారి చూసేయండి.

Motivational story
సాధారణంగా మనలో చాలామంది కష్టాలను చూసి భయపడతారు. కుంగిపోతారు. అక్కడితో లైఫ్ ముగిసిపోయినట్లు బాధపడుతారు. వాటినుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ బండరాయి కథ చదివితే మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది. భవిష్యత్తులో ఎంత పెద్ద కష్టాలనైనా మీరు సులభంగా ఎదుర్కోగలరు. మరి ఆ కథ ఏంటో చూద్దామా..
Motivational story
ఒక శిల్పి అడవిలో నడుస్తున్నప్పుడు ఒక బండరాయిని చూస్తాడు. ఆ బండరాయి చాలా అందంగా ఉండటంతో వెంటనే ఉలిని తీసుకుని ఏదో చెక్కడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ రాయి అతనితో మాట్లాడుతుంది. "మీరు నన్ను కొడితే నాకు బాధ కలుగుతుంది. దయచేసి నన్నువదిలేయండి. కావాలంటే వేరే బండరాయిని వెతకండి" అని అంటుంది. వెంటనే శిల్పి దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు.
Motivational story
కొంత దూరం వెళ్లాక శిల్పికి మరో బండరాయి కనిపిస్తుంది. వెంటనే ఆ రాయిని చెక్కడం ప్రారంభిస్తాడు. ఆ రాయికి కూడా నొప్పి కలుగుతుంది. కానీ అది ఓపికగా నొప్పిని భరిస్తుంది. కొంత సమయం తర్వాత శిల్పి ఆ రాయిని వినాయకుడి విగ్రహంగా మారుస్తాడు. ఆ తర్వాత శిల్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
Motivational story
అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఒక సన్యాసి వినాయకుడి విగ్రహాన్ని చూసి నమస్కరించి వెళ్తాడు. గ్రామస్తులు కూడా ఆ విగ్రహాన్ని ప్రతిరోజూ పూజించడం ప్రారంభిస్తారు. వారు వినాయకుడికి కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు. దీనికోసం బండరాయిని వెతుకుతున్నప్పుడు శిల్పి మొదట చూసిన రాయి కనిపిస్తుంది. దానిపై కొబ్బరికాయ కొట్టడం ప్రారంభిస్తారు. కొబ్బరికాయ ప్రతి దెబ్బ బండరాయిపై గాటు పెడుతుంది. 'ఒక్కరోజు శిల్పి దెబ్బలను భరించి ఉంటే ఇప్పుడు జీవితాంతం ఇన్ని దెబ్బలు పడాల్సిన అవసరం ఉండేది కాదు' అని బండరాయి బాధపడుతుంది.
Motivational story
ఈ కథలోని మొదటి బండరాయిలాగే మనలో చాలామంది కష్టాలను భరించలేక వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా కష్టాలు లేని జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కష్టాలను ఓపికగా భరిస్తే.. రెండవ బండరాయిలాగే.. జీవితాంతం సంతోషంగా ఉండచ్చు.