Motivation: ఇతరులతో పోల్చుకొని బాధపడుతున్నారా? ఈ కాకి కథ చదివితే మీ ఆలోచన మారాల్సిందే
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి.? చాలా మంది స్వామీజీలు, మోటివేషన్ స్పీకర్స్ చెప్పే మాట ఇతరులతో పోల్చుకోకూడదని. అయితే మనలో చాలా మంది చేసే తప్పే అది. ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని భారంగా మార్చుకుంటాం. అయితే ఈ కాకి కథ చదివితే మీ ఆలోచన కచ్చితంగా మారుతుంది..

ఒక రోజు ఓ కాకి చెట్టుపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఓ స్వామీజి ఆ కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దీంతో కాకి తన బాధను మొత్తం వెల్లగక్కింది. 'నేను నల్లగా ఉంటాను, నన్ను ఎవ్వరూ ఇష్టపడరు, నేను వచ్చానంటే చాలు చి అంటూ తరమికొడతారు, నన్ను ఎవ్వరూ పెంచుకోరు. నా జీవితంపై నాకే చిరాకు వేస్తుంది. అసలు ఎందుకీ జీవితం అనిపిస్తోంది. ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు, నా జీవితమే ఇలా ఉంది' అంటూ స్వామిజీ వద్ద వాపోయిందా కాకి.

కాకి చెప్పిందంతా విన్న ఆ స్వామిజీ.. 'ఇంతకీ ఆనందంగా ఎవరు ఉన్నారో చెప్పు' అని కాకిని అడుగుతాడు. వెంటనే కాకి స్పందిస్తూ.. అదిగో ఆ హాంసను చూడు తెల్లగా ఎంత అందంగా ఉందో, ఎంచక్కా కొలనులో ఈత కొడుతూ హ్యాపీగా ఉంది అంటుంది. అయితే ఓసారి వెళ్లి ఆ హాంసను నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా వెళ్లి అడుగు అని కాకికి చెప్పాడు స్వామీ. దీంతో హంస దగ్గరికి వెళ్లి.. 'నువ్వు అందంగా ఉంటావు. చాలా హ్యాపీగా ఉంటావు కదూ! అని అడిగింది. దీనికి స్పందించిన హంస.. ఛీ నాది ఓ అందమేనా తెల్లగా సున్నం వేసినట్లు ఉంటాను. అదిగో ఆ రామచిలు చూడు.. రంగురంగులుగా ఎంత అందంగా ఉందో. అది అసలైన అందం అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చింది.
దీంతో వెంటనే రామ చిలుక దగ్గరకు వెళ్లిన కాకి.. 'నువ్వ ఇంతంగా అందంగా ఉంటావు కదా సంతోషంగా ఉన్నావా.?' అని అడిగింది. రామ చిలుక కూడా తన బాధను మొదలు పెట్టింది. అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది. స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్లలేను, వెళ్లినా బంధించి నన్ను పంజరంలో బంధిస్తున్నారు. నన్ను బంధించి జనాలు సంతోషపడుతున్నారు. ఇంతకంటే నరకం మరోటి ఉంటుందా.? ఎప్పుడూ భయంభయంగా బతకాలి, నాదీ ఓ బతుకేనా అంటూ వాపోయింది. హ్యాపీ లైఫ్ అంటే.. అదిగో ఆ నెమలిదే.
ఇక నెమలి దగ్గరికి వెళ్లిన కాకి నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగ్గా.. నెమలి కూడా తన కష్టాన్ని చెప్పడం మొదలు పెట్టింది. నాదేం సంతోషం అడవిలో హ్యాపీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పడేశారు. ప్రజలంతా వచ్చి నాతో ఫొటోలు దిగుతారు. నేను పురివిప్పితే చూడాలని ఆశిస్తారు. అడవిలో నెమలి విప్పి నాట్యం చేసే నేను ఈ బందిఖానాలో ఎలా నాట్యం చేస్తా? అసలు ఇదేం ఖర్మా.. నిజం చెప్పనా కాకి అసలు నీ జీవితమే సూపర్. ఎంచక్కా నచ్చినట్లు విహరిస్తావు. నిన్ను ఎవ్వరూ బంధించడానికి ప్రయత్నించరు. హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తావ్. నీ జీవితమే బిందాస్ అని చెప్తుంది. దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెడుతుంది. నిజమే కదా అని ఆలోచనలో పడుతుంది.
అసలు విషయం ఏంటంటే..
పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుందని అనుకోవడం సహజం. కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి. మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నామన్నదే ముఖ్యం. పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే జీవితానికి అసలైన అర్థం.